
ఆ సినిమా స్టోరీ నాదే
పోలీస్ కమిషనర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు
టీనగర్: రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం కథ నాదేనంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం కాలా. ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ముంబైలో ప్రారంభమైంది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి కథానాయకిగా నటిస్తున్నారు. సముద్రఖని, ఈశ్వరీరావ్, హిందీ నటుడు నానా పటేకర్ సహా పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కె. రాజశేఖరన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. తాను సౌత్ ఇండియన్ ఫిలించాంబర్‌లో కరికాలన్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశానని, దీన్ని రజనీకాంత్‌తో చిత్రంగా రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇలాఉండగా వండర్‌బార్ ఫిలింస్ ఆధ్వర్యంలో దర్శకుడు పా.రంజత్ ద్వారా కాలా ‘కరికాలన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుసుకుని దిగ్భాంతి చెందానన్నారు. ఈ చిత్ర కథ నాదేనని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అభిమాన సంఘం సభ్యుడి తొలగింపు
ఫొటోల చిత్రీకరణ సమయంలో రజనీకాంత్ ముందు నినాదాలు చేసిన అభిమానుల సంఘం నిర్వాహకుడిని రజనీకాంత్ తొలగించారు. దీనిగురించి తొలగింపునకు గురైన సైదై రవి మాట్లాడుతూ రజనీకాంత్ చుట్టూ ఉన్న వ్యక్తులు పొరపాట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.