
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘కాలా’... అంతగా గ్రాండ్ ఓపెనింగ్స్‌ను రాబట్టలేకపోయింది. రజనీ సినిమాలంటే సహజంగానే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కలెక్షన్ల సునామీ పోటెత్తుతుంది. అయితే, తొలిరోజు కాలా సినిమాకు చాలావరకు థియేటర్లు హౌస్‌ఫుల్ కాలేదని, అన్‌బుక్‌డ్ సీట్లు చాలా మిగిలిపోయాయని వార్తలు వచ్చాయి.
రెండోరోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మెల్లిగా ఊపందుకున్నాయని సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండ్రోరోజుల్లో ఒక్క చెన్నైలోనే కాలా సినిమా మూడు కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‌లో మిలియన్ మార్క్ (రూ. 6.83 కోట్లు)ను అందుకుంది. మొత్తానికి టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కాలా సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్‌లో వెల్లడించారు. చెన్నైలో ఈ సినిమా తొలి వీకెండ్‌లో రూ. 4.9 కోట్లు వసూలు చేసింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కాలా సినిమా సంచలన వసూళ్లు రాబడుతోంది. పద్మావతి సినిమా తర్వాత అత్యధిక విదేశీ వసూళ్లు రాబట్టిన సినిమాగా కాలా నిలిచింది. శాటిలైట్, మ్యూజిక్ తదితర హక్కుల ద్వారా విడుదలకు ముందే రూ. 230 కోట్ల బిజినెస్ చేసిన కాలా.. విడుదల తర్వాత కూడా వసూళ్లతో ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమా రజనీ ద్రవిడ డాన్‌గా, మురికివాడల్లో నివసించే తన ప్రజల హక్కుల కాపాడే వ్యక్తిగా అద్భుతమైన నటన కనబర్చారు.
#BREAKING: In 3 Days, #Kaala has crossed ₹ 100 Cr Gross at the WW Box Office.. pic.twitter.com/N9NS1no2Mg
— Ramesh Bala (@rameshlaus) June 10, 2018