
హాటైన సమ్మర్‌లో దీటైన ‘కాలా’ రౌడీయిజాన్నీ థియేటర్స్‌లో కూల్‌గా ఏంజాయ్ చేద్దామనుకున్న అభిమానుల ఆశలకు బ్రేక్ పడింది. ‘కాలా’ చిత్రం విడుదల వాయిదా పడిందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్.పా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో ధనుష్ నిర్మించారు. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ కథానాయికలు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బంద్ కారణంగా ‘కాలా’ చిత్రం రిలీజ్ వాయిదా వేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రంజాన్‌కు రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘కాలా’ రంజాన్‌కు థియేటర్స్‌లోకి వస్తే సల్మాన్‌ఖాన్‌తో బాక్సాఫీస్ వద్ద ఢీ తప్పదు. రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘రేస్ 3’ చిత్రాన్ని కూడా రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి.. ‘కాలా’ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడో? వెయిట్ అండ్ సీ.