
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. సూపర్‌స్టార్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే రజనీ గత సినిమా కబాలి దెబ్బ కాలాపై పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కబాలి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే.. సూపర్‌స్టార్ సినిమాకు ఉండాల్సిన హడావిడి ‘కాలా’కు లేదని అభిమానులు ఫీలవుతున్నారు. కాలా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించినా పాటలు అభిమానులను అలరించేలా లేవన్న టాక్ వినిపిస్తోంది. రజనీకి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళ ఇండస్ట్రీ తరువాత రజనీకి టాలీవుడ్ అతి పెద్ద మార్కెట్. కానీ ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమా సందడి కనిపించడం లేదు.
ప్రస్తుతం తెలుగు అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్తను ప్రకటించింది చిత్రయూనిట్. మే 29న కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభవుతుందని తెలిపారు. నానా పటేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వం వహించారు. తలైవాకు జోడిగా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment