
యశవంతపుర: ఈ నెల 7న విడుదల కానున్న రజనీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదలకు కర్ణాటకలో కాలం కాలసిరావటంలేదు. రోజుకో çకన్నడ సంఘం నాయకులు రజనీకాంత్‌కు వ్యతిరేకతగా తమ అక్రోశంను వెల్లగక్కటంతో కాలా చుట్టూ సమస్యలు పెరుగుతున్నాయి. కర్ణాటక–తమిళనాడుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కావేరి నీటి పంపకాలపై కేంద్రం న్యాయ మండలిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తమిళనాడుకు మద్దతుగాను కర్ణాటకకు వ్యతిరేకంగాను సూపర్‌స్టార్ రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గత కొద్దికాలంగా వివాదం ఉంది.
దీంతో కాలా సినిమాను రాష్ట్రంలో విడుదలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కన్నడ రక్షణ వేదిక ప్రవీణ్‌శెట్టి మద్దతుదారులు శనివారం కర్ణాటక చలనచిత్ర వాణజ్య మండలి ఎదుట ఆందోళన చేశారు. రజనీకాంత్ నటించిన సినిమాను విడుదల చేయటానికి అవకాశం కల్పించరాదని చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందుకు విజ్ణప్తి చేసింది. ఒక వేళ రాష్ట్రంలో కాలాను విడుదల చేస్తే రజనీకాంత్ కష్టాలను ఎదరు చూడాల్సి ఉంటుందని కరవే అధ్యక్షుడు ప్రవీణ్‌శెట్టి హెచ్చరించారు. కావేరి విషయంలో రజనీకాంత్‌తో పాటు కమలహాసన్ నటించిన సినిమాలను కూడ విడుదలను అడ్డుకుంటామని సంఘం నాయకులు హెచ్చరించారు.
కావేరి నది విషయంలో రజనీకాంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాల్ నాగరాజు తెలిపారు. కలాను రాష్ట్రంలో విడుదల చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రజనీకాంత్–కమలహాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూనే సినిమా విడుదల అడ్డుకోవాలని రాష్ట్రంలోని అనేక కన్నడ సంఘలు తమపై ఒత్తిడి పెరిగిందని కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు తెలిపారు. సినిమాను ప్రదర్శించకుండ థియేటర్ల యజమాన్యం నిర్ణయించిందన్నారు. అందోళనకారులు రజనీ,కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవీణ్‌శెట్టిని అరెస్టు చేశారు.