సాక్షి,సినిమా: సూపర్‌స్టార్, కమలహాసన్ చిత్రాలు ఎన్నడూ లేనంతగా అయోమయం పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చిత్ర పరిశ్రమ సమ్మెకు ఇప్పట్లో పరిష్కారం లభించేటట్టులేదు. ఇటు నిర్మాతల మండలి, అటు థియేటర్ల సంఘం ఎవరికి వారు తమ పక్కనే న్యాయం ఉందంటూ పంతాలకు పోయి సమస్యను జఠిలంగా మారుస్తున్నారు. నిర్మాతల మండలి తమ డిమాండ్లు నెరవేరాల్సిందే నంటుంటే, వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని థియేటర్ల యాజమాన్యం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ సమ్మె ప్రకటనకు ముందే ప్రకటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాలా చిత్రం సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్నా, ఎట్టకేలకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది.
చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ /ఏ సర్టిఫికెట్‌ను అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు కమలహాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రానికి కమల్ సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వరూపం–2 చిత్రాన్ని కమలహాసన్ ఇదే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మిగతా చిత్రాల విషయం ఎలా ఉన్నా, రజనీకాంత్, కమలహాసన్ చిత్రాల ప్రభావం చిత్ర పరిశ్రమపైనా, ప్రేక్షకులపైనా ఎక్కువగానే ఉంటుంది. అయితే చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండడంతో కాలా, విశ్వరూపం–2 చిత్రాల విడుదల అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె కారణంగా సినీ కార్మికులకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా చూడాల్సిందిగా రజనీకాంత్ ఇటీవల తనను కలిసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు హితవు పలికారు. అదే విధంగా కమల్‌ను కలిసిన విశాల్ సమ్మెకు కారణాలను వివరించారు. దీంతో సమ్మెను రజనీకాంత్, కమలహాసన్ తప్పు పట్టకపోయినా ఈ పిరిస్థితులు వారి చిత్రాలకు ఇబ్బంది కలించేవిగా ఉన్నాయన్నది వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment