Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu coalition govt making land deals and sold for just 99 paise1
ఐటీ ముసుగులో భూములు ‘లిఫ్ట్‌’!

సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములివ్వాలంటే ముందుగా దాని ట్రాక్‌ రికార్డు చూస్తుంది! కంపెనీ శక్తి, సామర్థ్యాలు ఏమిటి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? రాష్ట్రానికి పారదర్శకంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూస్తుంది. అంతటా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. కానీ ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా పప్పు బెల్లాల మాదిరిగా భూముల పందేరానికి టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఐటీ కంపెనీల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెర తీసింది. ఎన్ని ఎకరాల భూమి అయినా సరే కేవలం 99 పైసలకే ఇస్తాం...! ఐటీ పేరుతో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోండి..! ఆ తరువాత మార్కెట్‌ ధరకు అమ్మేసుకోండి..! అంటూ ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్‌ హబ్స్‌ (లిఫ్ట్‌) పేరుతో విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్‌ వేశారు. ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సన్నాహాలు చేశారు. తొలుత ఒకటి రెండు ప్రముఖ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి కనీసం పాలసీ కూడా సిద్ధం కాకముందే విశాఖలో 99 పైసలకే భూములను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఊరూ పేరు లేని ఉర్సాకు కారుచౌకగా భూములను కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఉలిక్కిపడి ‘లిఫ్ట్‌’ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు. ఉర్సా లాంటి వందలాది సత్తాలేని కంపెనీలను సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అసలు టెక్నాలజీతో సంబంధం లేని కంపెనీలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు! తొలుత విశాఖలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించి ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భూములను కేటాయించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నామినల్‌ రేటు అంటే 99 పైసలు..ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే ఏపీ ఐటీ అండ్‌ గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ (జీసీసీ) పాలసీ 2024–29 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా ‘లిఫ్ట్‌’ పాలసీని తెరపైకి తెచ్చింది. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20 శాతం కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు.. అడిగినంత భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టనుంది. మిగిలిన 80 శాతంలో 30 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు 50 శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘నామినల్‌ రేటు అంటే 99 పైసలు..’’ అని అందులో పేర్కొనడం గమనార్హం.ప్రత్యేకంగా ‘ఫార్చూన్‌ 500 యూరప్‌’ ఎందుకు?ఐటీ, ఐటీఈఎస్, జీసీసీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూనే ‘‘ఫార్చూన్‌ 500 యూరోప్‌’’ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో నాన్‌ ఐటీ కంపెనీలే ఉన్నాయి. టెక్నాలజీతో ఏమాత్రం సంబంధంలేని యూరోప్‌ ఫార్చూన్‌ 500 ఇండెక్స్‌ను ఎంపిక చేసుకోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ఇండెక్స్‌లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్‌కు చెందిన 36కిపైగా కంపెనీలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫార్చూన్‌ 500 యూరోప్‌ తేవడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.డెవలపర్స్‌ ముసుగులో ‘రియల్‌’ వ్యాపారంఐటీ పార్కు డెవలపర్స్, జీసీసీ డెవలపర్స్‌కు కూడా ఈ పాలసీ కింద 99 పైసలకే భూమిని కేటాయిస్తారు. జీసీసీ డెవలపర్స్‌ కనీసం ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఫార్చూన్, ఫోర్బ్స్‌ కంపెనీల్లో ఒక దానిని యాంకర్‌ కంపెనీగా ఎంపిక చేసుకొని అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం తీసుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాలి. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 50 శాతం భూమిని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, జీసీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు . అదే ఐటీ పార్కు డెవలపర్స్‌ అయితే ఎకరాకు 1,00,000 చదరపు అడుగులు చొప్పున కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఐటీ డెవలపర్స్‌కు కనీసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తారు.

Extreme delay in Water evacuation to Midmaneru2
ఎత్తిపోతలు ఎప్పుడు?

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి వరదెత్తింది. నదీ పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని జలాశయాలన్నీ అడుగంటిపోయి ఉండగా, ఎప్పటికప్పుడు పంపుల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకోకపోవడంతో వరద జలాలన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. జలాల ఎత్తిపోతలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం.. ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం, అక్కడి నుంచి మిడ్‌మానేరు జలాశయానికి పంపింగ్‌ను మాత్రమే ప్రారంభించడం గమనార్హం. మిడ్‌ మానేరుకు తరలింపులో తీవ్ర ఆలస్యం మిడ్‌మానేరు నుంచి ఎగువన ఉన్న అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ జలాశయాల్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి శ్రీరామ్‌సాగర్‌కు గత మూడు రోజులుగా భారీ వరద వస్తున్నా ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ (ఎఫ్‌ఎఫ్‌సీ) ద్వారా గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయానికి నీళ్లను తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎల్‌ఎఫ్‌సీ ద్వారా 10,000 క్యూసెక్కులను విడుదల చేయగా, ఇంకా ఆ నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్‌హౌస్‌ ద్వారా 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా అంతే నీళ్లను మిడ్‌మానేరు జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో చెరో ఏడు చొప్పున మొత్తం 14 పంపులుండగా, చెరో 4 పంపులతో నీళ్లను పంపింగ్‌ చేస్తున్నారు. దీంతో మిడ్‌మానేరు జలాశయం నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు గాను 11.13 టీఎంసీలకు చేరింది. మిడ్‌ మానేరు నుంచి ఎప్పుడు? మిడ్‌మానేరు నుంచి నీళ్లను ఏకకాలంలో సమాంతరంగా అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు మరో లింక్‌ ద్వారా మలకపేట, అప్పర్‌ మానేరుకు ఎత్తిపోసేందుకు వీలుండగా, ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన ఈ ఆన్‌లైన్‌ రిజర్వాయర్లలో ప్రస్తుతం నిల్వలు అడుగంటిపోయి ఉన్నా పంపింగ్‌ ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రాజెక్టులకు వరద ఇలా.. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 6 గంటలకు 31,412 క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 28,357 క్యూసెక్కులకు తగ్గిపోయింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.37 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,244 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 49,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రస్తుతం నిల్వలు 12.88 టీఎంసీలకు చేరాయి. ఇక గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్‌సాగర్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 66.23 టీఎంసీలకు పెరిగాయి. మరో రెండురోజుల్లో శ్రీరామ్‌సాగర్‌ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అప్పుడే కడెం, ఎల్లంపల్లి గేట్లు కిందకి.. కడెం నదిపై ఉన్న కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం శనివారంతో పోల్చితే ఆదివారానికి 1.33 లక్షల క్యూసెక్కుల నుంచి 4,632 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో గేట్లను కిందికి దించేశారు. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నిల్వలను కొనసాస్తూ 299 క్యూసెక్కులను కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్‌సాగర్, కడెంకి దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద సైతం 2.15 లక్షల క్యూసెక్కుల నుంచి 28,460 క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశారు. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.31 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా 9,390 క్యూసెక్కులను మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అనంతగిరి రిజర్వాయర్‌ కింద 40వేల ఎకరాలు, రంగానాయకసాగర్‌ కింద 1.10 లక్షల ఎకరాలు, మల్లన్నసాగర్‌ కింద 2.96 లక్షల ఎకరాలు, కొండపోచమ్మసాగర్‌ కింద 2.85 లక్షల ఎకరాలు, అప్పర్‌ మానేరు కింద 16,085 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీరు అందే అవకాశం ఉంది. కృష్ణా జలాశయాలు కళ కళ కృష్ణా పరీవాహకంలో రాష్ట్రంలో మొత్తం 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 రిజర్వాయర్లుండగా, 584.65 టీఎంసీల నిల్వలతో అన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, కేవలం 191.69 టీఎంసీల నిల్వలతో వెలవెలబోతుండటం గమనార్హం. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 33.18 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రం తాత్కాలికంగా కోల్పోయింది. సింగూరు జలాశయానికి ఏ క్షణంలోనైనా గండిపడవచ్చనే హెచ్చరికలున్న నేపథ్యంలో 21 టీఎంసీలకు మించి నీళ్లను నిల్వ చేయడం లేదు. కాగా నీటి నిల్వలకు అవకాశం ఉన్న జలాశయాలూ ఖాళీగా ఉండడం గమనార్హం.

Rasi Phalalu: Daily Horoscope On 18-08-2025 In Telugu3
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో పేరుప్రతిష్ఠలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.దశమి సా.6.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: రోహిణి ఉ.5.40 వరకు, తదుపరి మృగశిర రా.3.51 వరకు, వర్జ్యం: ఉ.10.26 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.7.31 నుండి 9.02 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.వృషభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.మిథునం.... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు.కర్కాటకం.... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.సింహం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కన్య.... శ్రమ తప్పదు. పనులు కొన్ని మధ్యలో నిలిపివేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.తుల.... కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.వృశ్చికం... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.ధనుస్సు... నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.మకరం..... పనుల్లో కొంత జాప్యం. సోదరులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.కుంభం.. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.మీనం.... శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. భూవివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం.

Sakshi Guest Column On Donald Trump4
మనమంటే మొహం మొత్తిందా?

ఇండియాపై ట్రంప్‌కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్‌ ముప్పు తెస్తోందని ట్రంప్‌కు వాణిజ్య సలహాదారైన పీటర్‌ నవారో ప్రకటించారు. పుతిన్‌తో ట్రంప్‌ చర్చలు విఫలమైతే భారత్‌పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్‌ బిసెంట్‌ వెల్లడించారు. యూరప్‌ కూడా భారత్‌పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్‌ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్‌ను ట్రంప్‌ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్‌ పాకిస్తాన్‌తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్‌పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్‌ను కొనియాడింది. ట్రంప్‌... పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్‌కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్‌ నుంచి భారత్‌ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్‌ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్‌ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్‌తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్‌ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్‌ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్‌ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్‌ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్‌ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్‌ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్‌ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్‌ హెచ్చరించ లేదు. రష్యన్‌ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్‌ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్‌ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్‌ నుంచి జపాన్‌ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్‌’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్‌ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్‌ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్‌’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్‌’ పట్ల ట్రంప్‌ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్‌ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్‌ పింగ్‌తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్‌ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్‌ ఎర్త్‌ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్‌పై పుతిన్‌–ట్రంప్‌ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్‌ ఇప్పటికీ ఉందని స్కాట్‌ బిసెంట్‌ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్‌ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Radhakrishnan Is NDAs Vice Presidential Candidate5
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్‌

ఢిల్లీ: ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌.. స్వస్థలం తమిళనాడు. సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సమతుల్యత పాటించింది కేంద్రం. రాష్ట్రపతి ముర్ము ఉత్తరాది వాసి కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ దక్షిణాది వాసి. ఇదిలా ఉంచితే, ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. ఇక సెప్టెంబర్‌ 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.కాగా, సీపీ రాధాకృష్ణన్‌.. బీజేపీ నాయకుడు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారాయన. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా బాద్యతలు నిర్వర్తించారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్.. 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలును అప్పగించారు. 2024 జులై 31 వరకు తెలంగాణ గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఆగస్టు 06 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. ఆపై మహారాష్ట్ర గవర్నర్‌గా ఎంపికయ్యారు.

Australia Womens A team wins third ODI6
అలీసా అదరహో

బ్రిస్బేన్‌: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్‌ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్‌ ఖాతాలో వేసుకుంది. స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్‌; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్‌ కీపర్‌ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్‌ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్‌ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్‌ (22 బంతుల్లో 17), కెప్టెన్‌ రాధా యదవ్‌ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్‌ హసబ్నిస్‌ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్‌గ్రాత్‌ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్‌ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్‌ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్‌ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్‌ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ ఒక వికెట్‌ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్‌లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్‌తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. గత మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్‌ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్‌ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్‌లో ఫోర్‌తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్‌తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్‌ బౌలర్‌ షబ్నమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్‌ నుంచి తహిలా విల్సన్‌ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్‌ ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్‌ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్‌ నుంచి రాచెల్‌ (21 నాటౌట్‌) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది

Russia-Ukraine war: NATO-like protection in focus for Trump meeting with Ukraine, Europe7
Russia-Ukraine war: ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర! 

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు అమెరికా, ఐరోపా సమాఖ్య చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం స్వీయ సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘రష్యా విషయంలో భారీ పురోగతి సాధించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఉక్రెయిన్‌ విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్‌ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్‌కు నాటో కూటమి తరహాలో అమెరికా, ఈయూ ‘రక్షణ హామీ’ ఇచ్చినా అభ్యంతరం లేదని పుతిన్‌ చెప్పారు. మొత్తం ప్రక్రియలో ఇదొక కీలక మలుపు. ఇకపై ఉక్రెయిన్‌ భూభాగాలను ఆక్రమించబోమని హామీ ఇచ్చారు. రష్యాతో విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకోనున్నాం. నాటో కూటమికి గుండెకాయ అయిన క్లాజ్‌–5 తరహాలో ఉక్రెయిన్‌కు రక్షణ ఆఫర్‌ ఇచ్చేందుకు ట్రంప్‌ సిద్ధపడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఉక్రెయిన్‌ నాటోలో చేరేందుకు ప్రయతి్నస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఉక్రెయిన్‌ నాటోలో చేరొద్దనేదే పుతిన్‌ ప్రధాన అభ్యంతరం. కనుక ట్రంప్‌ ఆఫర్‌ సమస్య పరిష్కారం చూపుతుంది. ప్రక్రియ సజావుగా సాగడానికి సమయం పట్టొచ్చేమో గానీ కచి్చతంగా శాంతి నెలకొంటుంది. మూడున్నరేళ్ల యుద్ధానికి తెర పడుతుంది’’ అన్నారు. 5వ క్లాజ్‌ ప్రకారం 32 నాటో దేశాల్లో దేనిపై శత్రువు దాడి చేసినా అన్ని దేశాలపై ఉమ్మడి దాడిగా పరిగణించి ప్రతి దాడికి దిగుతాయి.నేడు ట్రంప్‌–జెలెన్‌స్కీ భేటీ ట్రంప్‌ సోమవారం జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్‌స్కీ సమావేశం అవుతారు. బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడ్‌రిక్‌ మెర్జ్, ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తదితరులు పాల్గొంటారు. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్‌ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డీర్‌ లేయిన్‌ చెప్పారు.డోన్బాస్‌ ఇచ్చేయండి డోన్బాస్‌ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌పై పుతిన్‌ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్‌స్కీకి ట్రంప్‌ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్‌ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్‌ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్‌ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్‌ను ఇచ్చేశాక పుతిన్‌ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారొచ్చన్నది జెలెన్‌స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.

Over 429 AIIMS doctors have resigned in 2years8
ఎయిమ్స్‌ను వీడుతున్న వైద్యులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఒకప్పుడు ఇందులో చేరడానికి వైద్యులు పోటీపడ్డ సంస్థను ఇప్పుడు వైద్యులు వీడుతున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న సంస్థ. ఆ సంస్థతో అంతే విడదీయలేని అనుబంధం. కొంతమంది డాక్టర్లయితే.. వారి పేరుతో కాకుండా.. ఎయిమ్స్‌తోనే గుర్తింపు. అలాంటి గుర్తింపును కూడా ఎందుకు వదులుకొంటున్నారు? పేగుబంధం లాంటి అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారు? ఇటీవల పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెప్పిన సత్యాలేంటో చూద్దాం. ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచే ఎక్కువగా... దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ల్లో 429 మంది రాజీనామా చేశారు. 2022 నుంచి 2024 మధ్య రెండేళ్ల కాలంలోనే, రాజీనామాలు సంభవించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌ నుంచి అత్యధికంగా 52 మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. రిషికేశ్‌లో 38 మంది, రాయ్‌పూర్‌లో 35, బిలాస్‌పూర్‌లో 32, మంగళగిరిలో 30 మంది, భోపాల్‌లో 27 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 1,000 మందికంటే ఎక్కువ మంది అధ్యాపకులు, విభాగాధిపతులు, కేంద్రాల అధిపతులు, సీనియర్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే.. ఇక్కడ జరిగిన రాజీనామాలలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయిలోనే జరిగాయి. అత్యున్నత స్థాయివారే అత్యధికం.. రాజీనామా చేసినవారిలో మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకుని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శివ్‌ చౌదరి రాజీనామా చేసి ఫోర్టీస్‌ ఎస్కార్ట్‌లో చేరారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ శశాంక్‌ శరద్‌ కాలే అపోలోకు మారారు. రాజీనామా చేసిన ప్రముఖుల్లో ఈఎన్‌టీ విభాగం, నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ మాజీ అధిపతి డాక్టర్‌ అలోక్‌ టక్కర్, రోటరీ కేన్సర్‌ హాస్పిటల్‌ అనస్థీషియాలజీ అధిపతి డాక్టర్‌ సుష్మా భటా్నగర్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి, న్యూరోసైన్సెస్‌ సెంటర్‌ చీఫ్‌ డాక్టర్‌ పద్మ శ్రీవాస్తవ, ఆర్థోపెడిక్‌ విభాగం మాజీ అధిపతి డాక్టర్‌ రాజేష్‌ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరంతా ఎయిమ్స్‌లోనే ఎదిగి, 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే సేవలందించడం గమనార్హం. అపనమ్మకం.. అసమర్థత... ఢిల్లీలోని ఎయిమ్స్‌ అంటే.. తక్కువ ఖర్చుతో అత్యున్నతమైన వైద్యం అందుతుందనే అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే.. ఇప్పటికీ ప్రతిరోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. అలాంటి సంస్థ చిత్రం మొత్తం మారిపోయింది. సరైన నాయకత్వం లేకపోవడం నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అపాయింట్‌మెంట్ల కోసం గంటల తరబడి క్యూలు, శస్త్రచికిత్సల కోసం నెలలపాటు సుదీర్ఘ నిరీక్షణలు సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం నిత్యం ఒత్తిడిలో ఉంటోంది. గతంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అంటే.. గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు అపనమ్మకం, అసమర్థతతో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక విభాగాధిపతులైతే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనలన్నీ కాగితాలపైనే నిలిచిపోతున్నాయి. రోజువారీ పనితీరు కూడా కష్టమవ్వడం వల్లే ఎయిమ్స్‌ను వీడామని పలువురు చెబుతున్నారు. రోటరీ హెడ్‌షిప్‌ విధాన అమలే లేదు.. ఇక్కడ మరో వివాదాస్పద అంశం రోటరీ హెడ్‌షిప్‌ విధానం. రోటరీ హెడ్‌షిప్‌ అనేది వైద్య కళాశాల విభాగాల అధిపతులను రొటేషన్‌ పద్ధతిలో నియమించే విధానం. దీని ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఒక అధ్యాపకుడు ఆ విభాగానికి అధిపతిగా ఉంటారు. ఆ తర్వాత మరొకరు ఆ స్థానాన్ని తీసుకుంటారు. అధ్యాపకులందరికీ నాయకత్వ అవకాశం కల్పించడం, వారి అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్‌ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలలో అమలు చేసే వ్యవస్థ. ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్‌లలోని పీజీఐఎంఈఆర్‌లో దీనిని అమలు చేయాలని 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్‌ వరకు గడువు విధించింది. అయినా ఈ విధానం అమలు కాలేదు. రాజకీయాలతో విశ్వసనీయతకు మచ్చ.. ఎయిమ్స్‌తో 30 నుంచి 35 ఏళ్ల అనుబంధం కలిగి ఉండి కూడా.. జరుగుతున్న నష్టాన్ని చూస్తూ భరించలేక వీడామని సీనియర్లు అంటున్నారు. నిబద్ధతతో ఉన్న వైద్యులపై రాజకీయాలు చేయడం, తక్కువ అనుభవం ఉన్నవారికి సంస్థలో నిర్ణయాధికారాలు కట్టబెట్టే ధోరణి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. తప్పని పరిస్థితుల్లోనే అంత గొప్ప సంస్థను వీడామంటున్నారు. తాము వేతనాలకోసమే అయితే ఎప్పుడో వెళ్లిపోయేవారమని, ఇన్ని దశాబ్దాల తరువాత సంస్థను వీడాల్సి రావడానికి సంస్థలో రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఈ సామూహిక వలసలతో సీనియర్‌ స్థాయి వైద్యుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువ మంది అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో నిండిపోయింది. ఇది ఎయిమ్స్‌ ఢిల్లీ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవత్తుతోంది.సౌకర్యాల కొరతతో పోస్టులు ఖాళీ.. ఎయిమ్స్‌ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ సరిపోను క్వార్టర్స్‌ ఉండటం లేదు. కనెక్టివిటీ తక్కువగా ఉంటోంది. దగ్గరలో ఉన్నతస్థాయి పాఠశాలు ఉండటం లేదు. షాపింగ్‌ కాంప్లెక్సులు సరికదా.. చివరకు ఇంటర్నెట్‌ సౌకర్యంగా కూడా సరిగా ఉంటం లేదు. ఇక వీరు ఉంటున్న ప్రాంతాలు టైర్‌–3 నగరాలుగా గుర్తించి హోమ్‌ అలవెన్స్‌ తక్కువగా ఇస్తున్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదు. దీంతో ఇక్కడికి రావడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాయ్‌బరేలిలో 201 ఫ్యాకల్టీ పోస్టులకు 88 భర్తీ కాలేదు. జమ్మూలోని ఎయిమ్స్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయిలో 183కి గాను 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గత మూడేళ్లలో ఒక్క ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే 1,191 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 827 భర్తీ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 2023–24లో 1,207 పోస్టులు మంజూరు కాగా, 850 భర్తీ అయ్యాయి. 2024–25లో 1,235 పోస్టులు మంజూరు కాగా, 803 భర్తీ అయ్యాయి. 2025–26 సంవత్సరానికి 1,306 పోస్టులు మంజూరు కాగా, 844 భర్తీ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 ఎయిమ్స్‌ల్లో సగానికి పైగా ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.

Sakshi Editorial On Street Dogs Issue In India9
కుక్క కథ

కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్‌ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు! 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్‌’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!జపాన్‌ లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్‌ లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్‌ విధుల్లోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్‌ కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్‌ లో ఎదురుచూసింది. జపాన్‌ లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.జాక్‌ లండన్‌ రాసిన ‘కాల్‌ ఆఫ్‌ ద వైల్డ్‌’ నవలలోని బక్‌ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు (ఉదా: జూలియన్‌ మే రాసిన ‘ఇంటర్వెన్షన్‌ ’). ‘పాతాళ్‌ లోక్‌’ వెబ్‌సిరీస్‌లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా!

Telangana ranks 4th in country in suicides10
ఆందోళనకరంగా ఆత్మహత్యలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. దేశంలో 2018 నుంచి 2022 వరకు నమోదైన ఆత్మహత్యల వివరాలను నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 2018లో 7,845 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2019లో 7,675, 2020లో 8,058, 2021లో ఏకంగా 10,171 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2022లో ఆ సంఖ్య 9,980గా నమోదైంది. ఐదేళ్లలో 43,729 మంది ఆత్మహత్యలు చేసుకోగా ఏటా సగటున 8,746 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. వీరిలో ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు కూడా ఉండడం గమనార్హం. కాగా 2023 నుంచి 2025 వరకు జరిగిన ఆత్మహత్యల వివరాలను ఎన్‌సీఆర్‌బీ వెల్లడించలేదు. దేశంలో ఐదేళ్లలో 7.62 లక్షల ఆత్మహత్యలు ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 1,34,516 ఆత్మహత్యలు (రేటు 10.2) నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 1,70,924 (రేటు 12.4)గా నమోదైంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఐదేళ్లలో మొత్తం 7,61,648 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే దేశంలో లక్ష జనాభాకు సగటున 11.26 రేటుతో ఆత్మహత్యలు నమోదయ్యాయన్న మాట. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకొని లెక్కలేస్తే సిక్కిం రాష్ట్రంలో అత్యధికంగా ఐదేళ్లలో సగటున 37.5 రేటు నమోదైంది. 26.42 రేటుతో ఛత్తీస్‌గఢ్‌ తర్వాతి స్థానంలో ఉంది. మూడో స్థానంలో కేరళ (25.44)ఉండగా, నాలుగో స్థానంలో (23.3) తెలంగాణ, ఐదో స్థానంలో తమిళనాడు (21.8) ఉన్నాయి. నిరుద్యోగం, కుటుంబ సమస్యలూ కారణం.. నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా గుర్తించగా.. పంటలు సరిగా పండక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య కూడా దేశంలో ఏయేటికాయేడు పెరుగుతోంది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 2018లో 10,134 మంది ఉంటే 2022లో ఆ సంఖ్య 14,600గా నమోదైంది. తెలంగాణలో ఐదేళ్లలో 2,590 మంది మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. కాగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌లలో ఆత్మహత్యల రేటు అధికంగా ఉండగా, లక్షద్వీప్‌లో అతి తక్కువగా నమోదైంది. ఆత్మహత్య ఆలోచనల నుంచి మళ్లిస్తున్న టెలి మానస్‌ చిన్న సమస్యను సైతం పెద్దగా ఆలోచించి ఆత్మహత్య వైపు అడుగువేసే ధోరణి పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను నివారించేందుకు వీలుగా 2022 అక్టోబర్‌లో ‘నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం (టెలి–మానస్‌)’ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 53 టెలి మానస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మొబైల్‌ యాప్, వీడియో కన్సల్టేషన్‌ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలోని ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రిలో మానస్‌ కేంద్రం ఏర్పాటు చేయగా, ఈ కేంద్రానికి ఇప్పటివరకు 1,61,477 ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫోన్‌ రాగానే మానసిక నిపుణులు బాధితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా 53 టెలీ మానస్‌ కేంద్రాలకు ఇప్పటి వరకు 24.52 లక్షల కాల్స్‌ను వచ్చాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement