బెంగళూరు: కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చేదు వార్త. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తలైవా తాజా చిత్రం ‘ కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. కావేరీ జల వివాదంపై రజనీకాంత్ చేసిన వాఖ్యలపట్ల కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ‘ కాలా’ చిత్రాన్ని ప్రదర్శించరాదని నిర్ణయించుకుంది. కావేరీ జలాలపై రజనీ వాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని దీంతో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నామని ఫిల్మ్‌ఛాంబర్ తెలిపింది. తమిళనాడుకు కావేరీ జలాలను తక్షణమే విడుదల చేయాలని రజనీకాంత్ గతంలో కోరిన విషయం తెలిసిందే.
కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందారు. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్‌మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. కావేరి మేనేజ్‌మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం.
ఇక నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారత చూపించలేదు. మరి ఈ సూపర్‌స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment