h. d. kumaraswamy
-
KCR BRS Party: 'బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం'
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): కర్ణాటకలో 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోమని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి స్పష్టం చేశారు. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న కోలారు, రాయచూరుతో పాటు సరిహద్దు ప్రాంతాల నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు అన్ని విధాలా సహకారం అందించనున్నారని వివరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో 150 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయవచ్చని, దీంతో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు జరగవచ్చని అభిప్రాయపడ్డారు. తాము జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోమని స్పష్టం చేశారు. తమది చిన్న పార్టీ అని.. కర్ణాటకలో మాత్రమే పోటీలో ఉంటామని కుమారస్వామి పేర్కొన్నారు. చదవండి: (బీఆర్ఎస్గా పేరు మార్చండి) -
KCR Party: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఏర్పాటు చేసిన జాతీయపార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయస్థాయిలో విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలని, దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా కర్ణాటకలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామన్నారు. ఈ క్రమంలోను తమ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి పనిచేస్తారని చెప్పారు. చదవండి: (KCR: టీఆర్ఎస్ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత..) -
‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’
సాక్షి, బెంగుళూరు: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మార్పు తథ్యం అని, కొన్ని నెలల్లో దేశంలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయన్నారు. చదవండి: తెలంగాణ ఆ కుటుంబ దోపిడీకి గురవుతోంది: ప్రధాని మోదీ కాగా, ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం. -
కర్ణాటకలో ఆపరేషన్ ఆకర్ష్ షురూ..!
సాక్షి, బెంగళూరు : కింగ్ మేకర్‌గా వెలుగు వెలిగి అధికారం కోల్పోయిన జేడీఎస్‌కు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. పార్టీ అధినేతల వైఖరి నచ్చక చాలామంది నేతలు పార్టీ వీడుతున్నారు. గతేడాది అసమ్మతి పర్వం రూపంలో పలువురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఇంతలో మరికొందరు సీనియర్ నాయకులు రాజీనామాబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, మరో నేత మధు బంగారప్ప కూడా వీడ్కోలు చెబుతారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తుమకూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు జేడీఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జేడీఎస్ బలం దక్షిణ కర్ణాటకలో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఉత్తర కర్ణాటకలో ఏ జిల్లాలోనూ పార్టీకి బలమైన నాయకులు లేక సతమతమవుతోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత దక్షిణాది జిల్లాల్లో కూడా బీజేపీ ఆపరేషన్ చేపట్టి ఎమ్మెల్యేలను, నాయకులను చేర్చుకోవాలని ఎత్తులు వేస్తోంది. బుజ్జగింపుల పర్వం మధు బంగారప్ప, జీటీ దేవెగౌడ జేడీఎస్ వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాకుండా మాజీ మంత్రి జీటీ దేవెగౌడ జేడీఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆ ఇద్దరితో మంతనాలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటీవల పార్టీ ప్రముఖులతో సమావేశం కూడా నిర్వహించారు. అయినా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో బుజ్జగించినా ఫలితం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌బాబు జేడీఎస్‌కు రాజీనామా చేశారు. వస్తుంటారు, పోతుంటారు తాజా పరిణామాలపై దేవెగౌడ స్పందిస్తూ రాజకీయ పార్టీ అంటే వస్తుంటారు.. పోతుంటారు. వెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, జేడీఎస్‌కు ఇది కొత్తేమీ కాదు. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అన్నారు. -
ప్రజలే టోపీ వేశారు : సిద్ధు
మైసూరు: తమ ఐదేళ్ల పాలనలో విధానసౌధలో అవినీతి కనిపించలేదని, ఒకవేళ అక్కడ అవినీతి జరుగుతున్నట్లు అనిపిస్తే అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కుమారస్వామికి సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సూచించారు. మంగళవారం మైసూరు కువెంపు నగర్లో వరుణ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడారు. విధానసౌధలో తాండవిస్తున్న అవినీతిని అరికట్టడానికి తమకు కొంత వ్యవధి కావాలంటూ సీఎం కుమారస్వామి సోమవారం చేసిన వాఖ్యలపై పైవిధంగా స్పందించారు. ఐదేళ్ల పాలనలో విధానసౌధలో తమకు కనిపించని అవినీతి సీఎం కుమారస్వామికి కనిపిస్తుంటే, మీ హయాంలో దానిని నిర్మూలించాలంటూ సూచించారు. ముఖ్యమంత్రి పదవిపై తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ నేతలే బలవంతంగా తమకు ముఖ్యమంత్రి పదవి అప్పగించారంటూ కుమారస్వామి చేసిన వాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కకపోవడంతో నేతల్లో చెలరేగిన అసంతృప్తి ప్రస్తుతం సమసిపోయిందని చెప్పారు. షాకింగ్‌గా అనిపించలేదు రాజకీయంగా మొదటి జీవితాన్ని,పునర్జీవితాన్ని అందించిన చాముండేశ్వరి నియోజకవర్గ ఫలితాలు మీడియాకు షాకింగ్ అనిపించి ఉండొచ్చేమో కానీ తమకు మాత్రం అలా అనిపించలేదంటూ సిద్ధరామయ్య తెలిపారు. బాదామిలో విజయం సాధించినా రాజకీయంగా, వ్యక్తిగతంగా విడదీయరాని అనుబంధం కలిగిన చాముండేశ్వరిలో ఓడిపోవడం ఒకింత బాధ కలిగించిందన్నారు. ఇవే తమకు చివరి ఎన్నికలని వచ్చే విధానసభ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాల్గొంటానని తెలిపారు. ప్రజలే టోపీ వేశారు ఈ సందర్భంగా తమను మైసూరు పేటెతో సన్మానించడానికి ఓ కార్యకర్త ప్రయత్నించగా చాముండేశ్వరి ఎన్నికల్లో ప్రజలే ఓడించి పెద్దటోపీ వేసి సన్మానించారని మరోసారి టోపీ వేయించుకోవడం ఇష్టం లేదంటూ ఎన్నికల్లో తమ ఓటమితో చమత్కరించారు. తనకు మరోసారి టోపీ వేయవద్దనడంతో కార్యక్రమంలో నవ్వులు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా మంత్రి పుట్టరంగశెట్టికి– సిద్ధుకి మధ్య చతురోక్తులు నడిచాయి. -
‘కాలా’పై కన్నెర్ర!
కుల, మత సంస్థలు, ఇతర బృందాలు చలనచిత్రాల జోలికి రాకూడదని న్యాయస్థానాలు పదే పదే హితవు చెబుతున్నాయి. చలనచిత్రాల మంచి చెడ్డలు నిర్ణయించడానికి సెన్సార్ బోర్డు ఉన్నదని, దాని నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఇతరత్రా వేదికలు కూడా అందుబాటులో ఉన్నా యని గుర్తు చేస్తున్నాయి. అయినా చిత్రం పేరు మార్చాలని, ఫలానా సన్నివేశం తొలగించాలని, పాటల్లో ఫలానా పదాలు తీసేయాలని, లేదంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని బెది రింపులకు దిగే బృందాలు తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం విడుదల కావలసిన రజనీకాంత్ చిత్రం ‘కాలా’ అలాంటివారి బారిన పడింది. ఆశ్చర్యమేమంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో చిత్రం విడుదలను వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు. కర్ణాటకలో ఆ చిత్రం విడుదలను అడ్డుకుం టామని కన్నడ సంఘాలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కావేరీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని రజనీ కాంత్ డిమాండ్ చేయడం ఆ సంఘాలకు నచ్చలేదు. కన్నడ సంఘాలు మాత్రమే కాదు... తమిళనాడులోని కొన్ని ఇతర సంఘాలు కూడా ‘కాలా’కు సమస్యలు సృష్టించా లని చూస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి పలువురిని కాల్చి చంపిన ఉదంతంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆ సంఘాలకు అభ్యంతరకరం అనిపించాయి. పోలీసులపై కొన్ని అసాంఘిక శక్తులు దౌర్జన్యానికి దిగడం వల్లే వారు కాల్పులు జరపాల్సివచ్చిందన్నది రజనీ వ్యాఖ్యల సారాంశం. తూత్తుకుడి కాల్పుల దృశ్యాలను చూసిన వారెవరూ అలా మాట్లాడరు. పోలీసులు ఉద్యమ కారులను గురిచూసి కాల్చిచంపిన దృశ్యాలు బయటికొచ్చాక కూడా రజనీ అలా మాట్లాడి ఉండా ల్సింది కాదు. అసాంఘిక శక్తులపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ ఆ క్రమంలో పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇష్టానుసారం ప్రవర్తిస్తే అంగీకరించరు. ఈ విషయంలో రజనీకాంత్‌తో విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ సాకుతో చిత్రానికి అడ్డంకులు కల్పించడం సరికాదు. ఆమధ్య హిందీ చిత్రం ‘పద్మావత్’పై కూడా ఇలాంటి వివాదాలే ముసురుకున్నాయి. ఆ చిత్రంలో పద్మావతిని కించపరిచేలా చూపుతున్నారని అనుమానించి రాజ్పుట్ సంఘాలు షూటింగ్ మొదలైనప్పటినుంచే దాడులు మొదలుపెట్టాయి. చివరకు చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తలలు తెచ్చినవారికి రూ. 5 కోట్లు బహుమాన మిస్తామని కూడా ప్రకటించాయి. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ చిత్రంలో ఎలాంటి అభ్యం తరకమైన అంశాలూ లేవు. రెండు నెలలక్రితం పంజాబీ చిత్రం ‘గురునానక్ దేవ్’ను కూడా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ), అకల్ తఖ్త్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మూడేళ్లక్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఎస్జీపీసీ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, కొన్ని సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగడంతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అప్పట్లో చిత్ర నిర్మాతలు ఒక్క పంజాబ్‌లో మినహా మిగిలినచోట్ల విడుదల చేశారు. కానీ కొద్దిరోజులకే నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ఎస్జీపీసీ అభ్యంతరపెట్టింది. అసలు చిత్రంలో గురునానక్ పాత్రే ఉండరాదని, అలా చూపితే ఆయనకు అపచారం చేసినట్టేనని దాని వాదన. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో అదంతా సద్దుమణిగింది. కానీ ఇకపై సిక్కు సంప్ర దాయానికి సంబంధించి తీసే చిత్రాలకు తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని ఈమధ్య ఎస్జీపీసీ ప్రకటించింది. అందుకోసం 21మంది సభ్యులతో సిక్కు సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. సెన్సార్‌బోర్డుకు సిక్కు సంప్రదాయాలపై అవగాహన ఉండదు కనుక తామే అందుకోసం దీన్ని ఏర్పాటు చేశామంటున్నది. యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని చర్చించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంపైనా 2016లో వివాదం చెలరేగింది. సెన్సార్ బోర్డు 89 కత్తిరింపులు ప్రతిపాదించగా చిత్ర నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో ఒక్క సినిమాలపై మాత్రమే కాదు... వివిధ కళారూపాల గొంతు నొక్కడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన పెయింటింగ్‌లపై హిందూత్వ సంస్థలు విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల కేసులు నమో దుకావడం, బెదిరింపులు రావడం వగైరాలతో విసిగి ఆయన 2006లో భారత్ వదిలి వెళ్లి పోయారు. 2011లో మరణించేనాటికి ఆయన దోహాలో ఉన్నారు. తమిళనాడులో రచయిత పెరు మాళ్ మురుగన్ రాసిన నవలపై కూడా పెద్ద వివాదం తలెత్తింది. ఆయనను అనేకవిధాల వేధిం చారు. కుల, మత సంఘాలు ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. చివరకు మూడేళ్లక్రితం ఆ రచయిత సృజనాత్మకతపై ఆంక్షలు విధించడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. రచయితల, కళాకారుల భావ వ్యక్తీకరణను అడ్డుకునేందుకు, వారి భావాలు ప్రజలకు చేరకుండా నిరోధించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు బృందాలు అనేక విధాల ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నిర్మించిన డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ నిరుడు సుప్రీంకోర్టు విలువైన తీర్పును వెలువరించింది. చట్ట పరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో భావాలు వ్యక్తం చేయొచ్చునని, అందులో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకుగానీ, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకుగానీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో ఉదారంగా స్టేలు మంజూరు చేయొద్దని కింది కోర్టులకు సూచించింది. సుప్రీంకోర్టు పదే పదే ఇంత వివరంగా చెప్పినా సమస్యలు తలెత్తడం, అధికారంలో ఉన్నవారు వంతపాడటం విచారకరం. ఇలాంటి ధోరణులను నివారించకపోతే ప్రజాస్వామ్య భావనే ప్రమాదంలో పడుతుంది. -
రజనీ క్షమాపణ చెప్పినా విడుదలకానివ్వం..
సాక్షి, బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదలవకూడదని ఇప్పటికే కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మరోసారి చర్చించి సినిమా విడుదలవ్వాలా లేదా అనే విషయంపై తీర్మానిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఈ విషయంపై కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి కూడా స్పందించారు. రజనీకాంత్ బహిరంగ క్షమాపణ చెప్పినా ‘కాలా’ చిత్రం కర్నాటకలో విడుదల కానివ్వమని అన్నారు. ఇకపై రజనీకాంత్, కమల్ హాసన్‌కు సంబంధించిన ఏ చిత్రాలు కర్నాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ శెట్టి పేర్కొన్నారు. కర్నాటక ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ మాట్లాడుతూ.. రజనీ కాంత్, కమల్ హాసన్ చిత్రాలు తప్ప మిగిలిన అన్ని తమిళ చిత్రాలు కర్నాటకలో విడుదలయ్యేందుకు మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కావేరి జలాల విషయంలో తమిళులకు మద్దతుగా రజనీకాంత్, కమల్ హాసన్‌లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కరెంట్ రగడ
- విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై నిలదీసిన కుమారస్వామి - సమగ్ర దర్యాప్తునకు సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ - న్యాయ విచారణకు స్పీకర్ సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా సాగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయడానికి సభా సంఘాన్ని నియమించాలని శాసన సభలో జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ పద్దులపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన 2007-08 నుంచి 2012-13 వరకు విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకు ముందు 0.1 శాతంగా ఉన్న విద్యుత్ కొనుగోలు ఆ ఐదు సంవత్సరాల వ్యవధిలో 19 శాతానికి పెరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవధిలో రూ.17,480 కోట్లతో విద్యుత్నుకొనుగోలు చేశారని వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ధరను ఏడు శాతం నుంచి పది శాతానికి పెంచిన విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకు వస్తూ, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసక్తికరమైన చర్చ విద్యుత్ కొనుగోలు విషయమై సాదాసీదాగా ప్రారంభమైన చర్చ తీవ్ర ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్, కుమారస్వామి వాదనతో ఏకీభవిస్తూ దీనిపై ఏదైనా దర్యాప్తు జరిగితేనే మంచిదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సభ్యుడు శివమూర్తి ఇదో స్కామ్ అంటూ ఆరోపించారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా విద్యుత్‌ను కొనుగోలు చేస్తే, ఏదేదో ఆపాదిస్తారెందుకని ప్రశ్నించారు. బీజేపీ అప్పట్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కాలానికి ఎందుకు, గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దశలో బీజేపీ, జేడీఎస్ సభ్యుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై న్యాయ విచారణ జరిపించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇదే సందర్భంలో ప్రభుత్వానికి సూచించారు.