కార్యక్రమంలో శనగపప్పులు ఆరగిస్తున్న సిద్ధరామయ్య
మైసూరు: తమ ఐదేళ్ల పాలనలో విధానసౌధలో అవినీతి కనిపించలేదని, ఒకవేళ అక్కడ అవినీతి జరుగుతున్నట్లు అనిపిస్తే అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కుమారస్వామికి సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సూచించారు. మంగళవారం మైసూరు కువెంపు నగర్‌లో వరుణ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడారు. విధానసౌధలో తాండవిస్తున్న అవినీతిని అరికట్టడానికి తమకు కొంత వ్యవధి కావాలంటూ సీఎం కుమారస్వామి సోమవారం చేసిన వాఖ్యలపై పైవిధంగా స్పందించారు. ఐదేళ్ల పాలనలో విధానసౌధలో తమకు కనిపించని అవినీతి సీఎం కుమారస్వామికి కనిపిస్తుంటే, మీ హయాంలో దానిని నిర్మూలించాలంటూ సూచించారు. ముఖ్యమంత్రి పదవిపై తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ నేతలే బలవంతంగా తమకు ముఖ్యమంత్రి పదవి అప్పగించారంటూ కుమారస్వామి చేసిన వాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కకపోవడంతో నేతల్లో చెలరేగిన అసంతృప్తి ప్రస్తుతం సమసిపోయిందని చెప్పారు.
షాకింగ్‌గా అనిపించలేదు
రాజకీయంగా మొదటి జీవితాన్ని,పునర్జీవితాన్ని అందించిన చాముండేశ్వరి నియోజకవర్గ ఫలితాలు మీడియాకు షాకింగ్ అనిపించి ఉండొచ్చేమో కానీ తమకు మాత్రం అలా అనిపించలేదంటూ సిద్ధరామయ్య తెలిపారు. బాదామిలో విజయం సాధించినా రాజకీయంగా, వ్యక్తిగతంగా విడదీయరాని అనుబంధం కలిగిన చాముండేశ్వరిలో ఓడిపోవడం ఒకింత బాధ కలిగించిందన్నారు. ఇవే తమకు చివరి ఎన్నికలని వచ్చే విధానసభ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాల్గొంటానని తెలిపారు.
ప్రజలే టోపీ వేశారు
ఈ సందర్భంగా తమను మైసూరు పేటెతో సన్మానించడానికి ఓ కార్యకర్త ప్రయత్నించగా చాముండేశ్వరి ఎన్నికల్లో ప్రజలే ఓడించి పెద్దటోపీ వేసి సన్మానించారని మరోసారి టోపీ వేయించుకోవడం ఇష్టం లేదంటూ ఎన్నికల్లో తమ ఓటమితో చమత్కరించారు. తనకు మరోసారి టోపీ వేయవద్దనడంతో కార్యక్రమంలో నవ్వులు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా మంత్రి పుట్టరంగశెట్టికి– సిద్ధుకి మధ్య చతురోక్తులు నడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment