న్యూఢిల్లీ: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో బీజేపీ అవినీతిపరులకు టికెట్లిచ్చిందనీ, దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పపై 23 అవినీతి, మోసం, ఫోర్జరీ కేసులున్నాయనీ, ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు జరిపిన గాలి జనార్ధన రెడ్డి మనుషులకు 8 టికెట్లు ఇచ్చారని రాహుల్ దుయ్యబట్టారు.
బీజేపీ అభ్యర్థులు మోదీ సహా వివిధ బీజేపీ నాయకులతో దిగిన ఫొటోలతో కూడిన ఓ వీడియోను ‘కర్ణాటకాస్ మోస్ట్ వాంటెడ్’ పేరుతో రాహుల్ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ. మీరు చాలా ఎక్కువ మాట్లాడతారు. కానీ సమస్యేంటంటే మీ మాటలకు చేతలకు పొంతనే ఉండదు’ అని ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు శ్రీరాములు, సోమ శేఖర రెడ్డి, కట్టా సుబ్రమణ్య నాయుడు, సీటీ రవి మరికొందరు బీజేపీ అభ్యర్థులపై అవినీతి కేసులున్నాయని రాహుల్ వెల్లడించారు.
మీదీ పీపీపీ పార్టీయే: సిద్దరామయ్య
బెంగళూరు: కాంగ్రెస్‌ను మోదీ పీపీపీ–కాంగ్రెస్ (పంజాబ్, పుదుచ్చేరి, పరివార్–కాంగ్రెస్) అని విమర్శించడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. బీజేపీ కూడా పీపీపీ పార్టీయేననీ, అంటే జైళ్లు (ప్రిజన్), ధరల పెరుగుదల (ప్రైస్ రైజ్), పకోడా పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల ఆస్తులు భారీగా పెరిగాయన్న మోదీ ఆరోపణపై స్పందిస్తూ.. ‘మీ సీఎం అభ్యర్థి ఏకంగా చెక్ ద్వారా లంచం తీసుకున్నారు. గాలి జనార్ధన రెడ్డి నోట్లరద్దు సమయంలో 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూతురి పెళ్లి చేశారు’ అని సిద్దరామయ్య గుర్తుచేశారు. మోదీ అనవసర విషయాలు కాకుండా ఇక్కడి ప్రజల సమస్యలపై, కర్ణాటక విషయాలపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment