సాక్షి, బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ లేనట్లుగా హస్తం తన సీఎం అభ్యర్థినే ముందుగానే ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి విజయవంతం అయింది కాబట్టి తిరిగి ఈ సారి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ అధినేత అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మే 12 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారం చేపడితే సిద్ధరామయ్యే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. ఆదివారం ఉదయం నగరంలోని అశోక హోటల్‌లో అల్పాహార విందులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
ఆయనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, మళ్లీ అధికారంలోకి రావడంపై ఎలాంటి అనుమానాలు లేదని, కచ్చితంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధరామయ్యేనని ప్రకటించారు. కర్ణాటక అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి సంస్కృతి, ప్రజల ప్రేమాభిమానాలు ఎంతో బాగుంటాయని చెప్పారు. కర్ణాటకకు ఎంతో ప్రాచీనసంస్కృతి ఉందని చెప్పారు. దీన్ని ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికలు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు, కర్ణాటక సంస్కృతికి మధ్యేనని చెప్పారు. తన పర్యటనలో భాగంగా చాలావరకు ఆలయాలు, మఠాలు సందర్శించానని చెప్పారు. అయితే ఆయా మఠాల్లో మఠాధిపతులతో భేటీ సందర్భంగా ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదని తెలిపారు. అలాగే లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా విషయంపై కూడా మఠాధీశులతో చర్చలు జరపలేదని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ మోదీ పాలనను పరిశీలిస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఆయన అసలు రూపం బయటపడుతోందని చెప్పారు.
రెండు స్థానాల్లో సిద్ధరామయ్య పోటీ..
మే 12న శాసనసభకు జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు స్థానాల్లో పోటీ చేస్తారని రాహుల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మినహా ఎవరూ రెండు స్థానాల్లో పోటీ చేయరని స్పష్టం చేశారు. రాష్ట్రలో మతతత్వ బీజేపీతో కలవడంపై జేడీఎస్ తేల్చుకోవాలని సూచించారు. లౌకికవాద పార్టీ అని చెప్పుకునే జేడీఎస్.. బీజేపీతో కలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. జేడీఎస్ వైఖరేంటో ఇప్పటివరకు తమకు తెలియదని చెప్పారు.
సుప్రీంకోర్టు న్యాయవాదికి నివాళి
శనివారం మరణించిన సుప్రీంకోర్టు న్యాయవాది నిరంజన్ థామస్ ఆల్వా పార్థివ దేహాన్ని ఆదివారం బెంగళూరులో రాహుల్ గాంధీ సందర్శించి నివాళులర్పించారు. థామస్ సతీమణి, పార్టీ నాయకురాలు మార్గరేట్ ఆల్వాకు సానుభూతి తెలిపారు.
పారిశుధ్య కార్మికులతో మాటామంతీ
అనంతరం నగరంలో జక్కరాయన మైదానంలో పారిశుధ్య కార్మికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, తమ పిల్లలకు రాష్ట్రంలో నాణ్యమైన ఉచిత విద్య అందించేలా ప్రభుత్వానికి సూచన చేయాలని వారు కోరారు. కార్మికులు వారి కష్టాలు, ఇబ్బందులను రాహుల్‌తో పంచుకున్నారు. వారి డిమాండ్లు తీరుస్తామని హామీఇచ్చారు. సుమారు 356 మంది కార్మికులు పాల్గొనగా, 15 మందికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. అనంతరం వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జీఎస్టీ, నోట్ల రద్దు వైఫల్యాలని రాహుల్‌గాంధీ విమర్శించారు.
మెట్రోలో ప్రయాణం
రాహుల్ ఆదివారం బెంగళూరులో మెట్రోలో సందడి చేశారు. ఉదయం నుంచి పలు సమావేశాలతో తీరిక లేకుండా గడిపిన రాహుల్ ఆ తర్వాత సరదాగా మెట్రోలో ప్రయాణించారు. మధ్యాహ్నం విధానసౌధ నుంచి ఎంజీ రోడ్డు వరకు మెట్రోలో ప్రయాణించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరమేశ్వర్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment