
యడ్యూరప్ప
సాక్షి, బళ్లారి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప ఆ పదవిలో కొనసాగుతారా? లేదా? వైదొలిగిపోతారా? అన్న విషయాన్ని జనం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక వైపు జేడీఎస్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 117 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందామని, అందరం కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు విన్నవించిన నేపథ్యంలో మరో వైపు రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బలనిరూపణకు గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్, జేడీఎస్‌లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈనేపథ్యంలో శనివార సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగింది. 104 సంఖ్యాబలం ఉన్న బీజేపీకి మరో 8 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. జేడీఎస్, కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బళ్లారి జిల్లాకు చెందిన ఆనంద్‌సింగ్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది.
అదే విధంగా రాయచూరు జిల్లాకు చెందిన ప్రతాప్‌గౌడ పాటిల్ కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇలా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అంతర్గతంగా బీజేపీకి టచ్‌లో ఉంటూ వారి క్యాంపుల్లో ఉంటున్నారని తెలుస్తోంది. బలనిరూపణ సమయంలో బీజేపీకి మద్దతు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడుతుందనే ప్రచారం ఓ వైపు సాగుతుండగా, ఎట్టి పరిస్థితుల్లో యడ్యూరప్ప సీఎంగా కొనసాగే అవకాశం ఉండదని కూడా చర్చ సాగుతోంది. మరి కొన్ని గంటల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారన్న విషయం తేలిపోనుందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment