మోదీ, రాహుల్, సిద్ధరామయ్య (జత చేసిన ఫోటో)
సాక్షి, బెంగళూరు: ఎన్నికల సమయం దగ్గర పడటంతో కర్ణాటకలో ప్రచార హోరు ఉధృతమైంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రచార పర్వంలో భాగమవడంతో కన్నడనాట రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల పర్యటనల్లో భాగంగా బెంగళూరు బహిరంగ సభలో మంగళవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. కర్ణాటకలో సిద్ధరామయ్య చేసిన అభివృద్ధిపై రాహుల్ ఓ 15 నిమిషాల పాటు ఎటువంటి పేపర్ చూడకుండా మాట్లాడాలని కౌంటర్ వేశారు.
అయితే, దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తారని భావించిన బీజేపీకి దిమ్మ తిరిగిపోయే పనైంది. మోదీ సవాల్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. నిమిషాల వ్యవధిలోనే వరుస ట్వీట్లతో బీజేపీకి చెమటలు పట్టించారు. ‘రేపు మీకు సమయమిస్తున్నా. దమ్ముంటే, ధైర్యముంటే నాతో చర్చకు రండి. గత యడ్యూరప్ప ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏపాటిదో..! మీరు పేపర్ చూస్తూ.. ఓ 15 నిమిషాలు మాట్లాడండి’ అని మోదీకి ప్రతి సవాల్ చేశారు. సిద్దూ రీ కౌంటర్‌పై కాంగ్రెస్ తెగ సంబరపడిపోతోంది.
కన్నడనాట తన ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించిన మోదీ నేరుగా సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. రాహుల్ గాంధీ, వారి కుటుంబ పాలనపై విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే వెల్లడైన పలు ఎన్నికల విశ్లేషణల్లో కన్నడ నాట బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ప్రధాని ఈ ఎత్తుగడని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను ఎన్నికల సమరానికి సమాయత్త పరచడంలో యడ్యూరప్ప విఫలమయ్యారని భావిస్తునన్న బీజేపీ కర్ణాటక ఎన్నికలను రాహుల్ వర్సెస్ మోదీగా మార్చాలని చూస్తోంది. ఆ యత్నాల్లో భాగంగానే జాతీయ సమస్యలపై మాట్లాడుతూ.. రాహుల్‌పై విమర్శలు చేస్తోంది. తద్వారా కర్ణాటక ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తోంది.
కానీ, బీజేపీ ఎత్తుగడని పసిగట్టిన కాంగ్రెస్ ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడింది. మోదీ విమర్శలపై స్పందించాలని సిద్దూకి సూచించింది. ‘కర్ణాటకలో ఓటమి ఖాయమని బీజేపీకి తెలుసు. అందుకనే రాష్ట్ర బీజేపీ పరివారమంతా మోదీ జపం చేస్తున్నారు. ఆయన మాత్రమే తమని గట్టెక్కిస్తారని నమ్ముతున్నారు. ఎందుకంటే గత యెడ్డీ ప్రభుత్వం గురించి ప్రధాని చెప్పడానికి ఏమీ లేదు. యెడ్డీ ప్రభుత్వ కాలంలో అవినీతి రాజ్యమేలింది’ అని ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయ పడ్డారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ సమస్యలు లేవనెత్తడం అనవసరం. ఇక్కడ మోదీ, రాహుల్ ముఖ్యం కాదు. ఇది సిద్ధరామయ్య, యెడ్యూరప్ప, కుమార స్వామిల మధ్య పోరు’ అని రాజకీయ పరిశీలకుడు రామచంద్ర మహారుద్రప్ప అన్నారు. కాగా, తొలుత 15 బహిరంగ సభల్లో పాల్గొనాలని భావించిన మోదీ, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందని పలు నివేదికలు కుండబద్దలు కొట్టడంతో ఆ సంఖ్యను 21కి పెంచారు.
‘మోదీ వంద మీటింగులు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా కన్నడనాట బీజేపీ పరిస్థితి మారదు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఢిల్లీ నుంచి మోదీ వస్తారు. ఏదో ఎత్తుగడ వేసి మమ్మల్ని గెలిపిస్తారని.. ఓటింగ్ రోజు వరకు కూడా కన్నడ బీజేపీ నాయకులు ఎదురు చూస్తూనే ఉంటార’ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment