బీదర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: లింగాయత్ సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలో కీలకమైన ఐదు జిల్లాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల మధ్య ప్రధాన పోరు సాగనుంది. అన్ని పార్టీలు లింగాయత్‌ల ఓట్ల కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో సాగుతున్నాయి. ప్రస్తుతం బీదర్, కలబుర్గి(గుల్బర్గ), యాద్గీర్, రాయిచూర్, కొప్పాల్ జిల్లాల్లో పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ యత్నిస్తుంటే.. మెరుగైన ఫలితాలపై బీజేపీ దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లో మొత్తం 31 స్థానాలుంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 18, జేడీఎస్ 5, బీజేపీ 4, కేఎంపీ+కేజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. లింగాయత్‌లకు మైనార్టీ హోదా కల్పించడం ద్వారా ఆ ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆశించారు. అయితే.. లింగాయత్‌ల్లోని ఉపకులాలను రిజర్వేషన్ల పేరిట విడగొట్టడంపై ఆ సామాజిక వర్గంలో మెజార్టీలుగా ఉన్న ‘ఆది’ వర్గం అసంతృప్తితో ఉంది.
మోదీ సభతో బీజేపీలో ఉత్సాహం
సిద్దూ సర్కారు మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని,.. తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఇక్కడి మధ్య, ఉన్నతవర్గాల్లో ఉంది. కందులు, పత్తి, చెరకు పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదంటూ రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్ప మళ్లీ బీజేపీలోకి రావడంతో ఈసారి సీట్లను రెండంకెలకు పెంచుకోగలమని బీజేపీ భావిస్తోంది. గుల్బర్గలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభకు భారీగా స్పందన రావడం బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ సీఎం, బీదర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ధరమ్‌సింగ్ మరణించడం ఆ పార్టీకి తీరని లోటు. లింగాయత్‌ల తరువాత ఈ ప్రాంతంలో ముస్లిం, దళిత సామాజిక వర్గానిదే పైచేయి. వారిలో మెజారిటీ మద్దతు కాంగ్రెస్‌కే ఉంది.
బీదర్..
బీదర్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒకస్థానంలో కర్ణాటక మక్కల్ పక్ష(కెఎంపీ), మరో చోట బీజేపీ గెలిచింది.
► బీదర్
మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారనే విమర్శలున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రహీంఖాన్‌కు మంచిపేరే ఉంది. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన గురుపాదప్ప నాగమార్‌పల్లి కుమారుడు సూర్యకాంత్‌ను బీజేపీ దింపింది. ముస్లింలు అధికంగా ఉన్న ఈ స్థానంలో రహీంఖాన్‌కే గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
► బీదర్(దక్షిణ)
అశోక్ ఖేనీ(కాంగ్రెస్), డాక్టర్ శైలేంద్ర బల్దాలే(బీజేపీ), బండెప్ప కేశంపూర్(జేడీఎస్)లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కెఎంపీ నుంచి గెలిచిన అశోక్ ఖేనీ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆయన అభ్యర్థిత్వంపై స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉంది.
► హుమ్నాబాద్: హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజశేఖర్‌పాటిల్(కాంగ్రెస్) నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై సొంత ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. లింగాయత్‌ల్లో పట్టున్న పాటిల్‌కు పోటీగా.. అదే సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌కల్లుర్‌ను బీజేపీ, మాజీ మంత్రి మీరాజుద్దీన్ సోదరుడు నాసీమ్‌పటేల్‌ను జేడీఎస్ బరిలో దింపాయి.
► బసవకళ్యాణ్: మహారాష్ట్ర సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో మరాఠీ ఓటర్లు కీలకం. స్థానిక మరాఠా నాయకులను కాదని కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన జేడీఎస్ ఎమ్మెల్యే మల్లిఖార్జున కుబాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రెండు సార్లు ఓడిన ‘కబ్బలిగ’ వర్గానికి చెందిన నారాయణరావుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. పీజీఆర్ సింధియాను జేడీఎస్ రంగంలోకి దించింది. మరో రెండు నియోజకవర్గాలైన ఔరాద్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభు చౌహాన్(బీజేపీ), విజయ్‌కుమార్(కాంగ్రెస్), ధంజీ(జేడీఎస్)లు పోటీలో ఉన్నారు.
యాద్గీర్, రాయచూర్, కొప్పాల్..
ఈ మూడు జిల్లాల్లో మొత్తం 16(యాద్గీర్ 4, రాయచూర్ 7, కొప్పాల్ 5)స్థానాలున్నాయి.
► యాద్గీర్‌లో: ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కస్థానంలోనూ గెలవలేదు. యాద్గీర్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న డాక్టర్ మలక్ రెడ్డి రెండో హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. 1989 నుంచి 99 వరకు వరుసగా మూడుసార్లు గెలిచిన మలక్‌రెడ్డి, 2004లో ఓడిపోయారు. 2009, 2013లో ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన కృషితోనే యాద్గీర్ జిల్లా కేంద్రంగా ఏర్పడింది. బీజేపీ తరఫున వెంకట్ రెడ్డి, జేడీఎస్ నుంచి కడ్లూర్ పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో లింగాయత్‌లు 40 శాతం వరకు ఉంటారు. గుర్మిట్‌కల్ స్థానంలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావుకు ప్రజల్లో మంచి పేరుంది. షాహపూర్, షోరాపూర్ స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది.
► రాయచూర్, కొప్పాల్: రాయచూర్ నగర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో జేడీఎస్ తరఫున గెలిచిన శివరాజ్‌పాటిల్ బీజేపీ టికెట్‌తో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సయ్యద్ యాసీన్ రంగంలో ఉన్నారు. రాయచూర్ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తిప్పేస్వామికి మంచి ఫాలోయింగ్ ఉంది. రాయచూర్ జిల్లాలోని మాన్వి, సింధనూరు, మాస్కి, దేవదుర్గ, లింగసూగూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖపోటీ ఉంది. కొప్పాల్ జిల్లాలో కుస్తాగి, కనకగిరి, గంగావతి, యల్‌బుర్గ, కొప్పాల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోటీ నెలకొంది.
గుల్బర్గ....
గుల్బర్గ జిల్లాలో 9 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు, జేడీఎస్ ఒక సీట్లో గెలుపొందాయి. ఇక్కడ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. మరో రెండు స్థానాలు అదనంగా సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. గుల్బర్గలో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది. ప్రధాన మార్కెట్ మార్గాల విస్తరణ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీమా నదిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల్లో జాప్యంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కర్ణాటకలో అత్యధికంగా కందులు పండించే జిల్లాగా గుల్బర్గకు పేరుంది. ఈసారి కందుల ధరలు దారుణంగా పడిపోయాయని రైతు బసవన్న ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 20 క్వింటాళ్ల వరకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేదని, ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 6 వేలిచ్చి.. పది క్వింటాళ్లు మాత్రమే కొంటోందన్నారు.
► చిత్తాపూర్
లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐటీ మంత్రి అయిన ప్రియాంక్‌ఖర్గే వ్యవహారశైలి స్థానిక నాయకులకు నచ్చట్లేదు. ఈడిగ సామాజిక వర్గానికి చెందిన మలికయ్య గుత్తేదార్ సహా పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. స్థానిక ప్రజలతో తనకున్న సత్సంబంధాలు, అభివృద్ధిపరచిన మౌలిక వసతులే గెలిపిస్తాయన్న ధీమాతో ప్రియాంక్ ఉన్నారు. ఈ నియోజవకర్గంలో లింగాయత్‌లు దాదాపు 60 వేల వరకు ఉండగా, కోలిలు 45వేలు, దళితులు 35 వేలు, ముస్లింలు 20 వేల వరకు ఉంటారు. బీజేపీ నుంచి బలహీన వర్గాల్లో పేరున్న వాల్మీకి నాయక్ బరిలో ఉన్నారు.
► జెవర్గీ
కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్‌సింగ్(మాజీ సీఎం ధరమ్‌సింగ్ కుమారుడు)కు మంచిపేరే ఉంది. గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేశారని స్థానిక రైతు బసవన్నదొడ్డగౌడ చెప్పారు. ఉద్యోగాల కల్పనలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శ ఉంది. అజయ్‌సింగ్ తండ్రి ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని స్థానికులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెవర్గీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేసినా.. ఒక్క పరిశ్రమ రాలేదని గిరిపాటిల్ అనే యువకుడు తెలిపాడు.
► గుల్బర్గ(ఉత్తర)
ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కమర్ ఉల్ ఇస్లాం మరణించడంతో.. ఆయన భార్య కనీజ్ ఫాతిమాను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఇక్కడ మొత్తంగా 11 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. 60% ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు ముందునుంచి అనుకూలమైన స్థానమే. కానీ ఈసారి ముస్లిం అభ్యర్థులు ఎక్కువ మంది రంగంలో ఉండడంతో ఓట్లు చీలుతాయన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. కమర్ ఉల్ ఇస్లామ్‌కు శాసనసభ్యునిగా మంచి పేరుంది. ఆయన అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లేవారని హిందువులు కూడా చెప్తారు. వ్యాపారవేత్త చందుపాటిల్‌ను బీజేపీ రంగంలోకి దింపింది.
► గుల్బర్గ(దక్షిణ)
జేడీఎస్ నుంచి వచ్చిన దత్తాత్రేయ చంద్రశేఖర్ పాటిల్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ రేవూర్ పాటిల్ కుటుంబానికి దక్షిణ గుల్బర్గలో మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్ అల్లప్రభు పాటిల్‌ను, జెడీఎస్ బస్వరాజ్ దుగ్గావిని బరిలోకి దింపాయి.
► గుల్బర్గ(గ్రామీణ)
ఇక్కడ త్రిముఖ పోటీ. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ జి.రామకృష్ణ(కాంగ్రెస్), బస్వరాజ్ ముట్టిమడ్(బీజేపీ), రేవూనాయక్ బెలమగి(జేడీఎస్) పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రేవూనాయక్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన జేడీఎస్‌లోకి జంప్ అయ్యారు. ఈ ప్రాంతం గుల్బర్గను ఆనుకుని ఉన్నప్పటికీ అభివృద్ధిలో బాగా వెనుకబడింది. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. ఇవికాకుండా, ఆలంద్, సేడం, అఫ్జల్‌పూర్, చించోలి నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లే ప్రధానంగా పోటీలో ఉన్నాయి.
‘లింగాయత్’ల గడ్డపై త్రిముఖపోరు
Published Fri, May 4 2018 3:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment