కన్నడ రాజకీయాల్లో కోస్తా ప్రాంతానికున్న ప్రత్యేకతే వేరు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అభివృద్ధి, సామాజిక మార్పు, లింగాయత్‌లకు మతపరమైన రిజర్వేషన్లు ఇవేవీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపవు. ఇక్కడ హిందువులతోపాటు, ముస్లింలు, క్రిస్టియన్‌ల జనాభా ఎక్కువ. అడపాదడపా మతపరమైన ఘర్షణలు జరుగుతుంటాయి.
ఈ ఐదేళ్లలో కర్ణాటక వ్యాప్తంగా 25 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవగా.. ఎక్కువ మంది ఈ ప్రాంతంలోనే చనిపోయారు. దీంతో రాజకీయంగా, మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతంగా కోస్తాకు పేరుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ చేపట్టనున్న ర్యాలీలతో కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. మోదీ హవా బలంగా వీస్తే కాంగ్రెస్ కనీస సీట్లను సంపాదించటమూ కష్టమేనని రాజకీయ విశ్లేషకులంటున్.
పెరుగుతున్న నేరాలు
ఈ ప్రాంతంలో మొత్తం 21 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 5, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉన్న మూడు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. నేరాలు పెరగటం, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం, అటవీ భూములు తగ్గిపోవటం వంటివీ ఈ ప్రాంతంలో తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. కొంతకాలంగా మాదక ద్రవ్యాల సరఫరా ఈ ప్రాంతంలో పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై ఇక్కడి ప్రజల్లో మతాలకు అతీతంగా నిరసన వ్యక్తమవుతోంది.
ఆలోచనలో కాంగ్రెస్
గత ఎన్నికల్లో తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించిన కాంగ్రెస్ ఈసారి పట్టునిలుపుకునేందుకు శ్రమిస్తోంది. డ్రగ్స్ సరఫరా, లవ్ జిహాదీ ఘటనలు పెరగటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోస్తాపై పట్టు నిలుపుకునేందుకు, హిందూ ఓట్లు చీలకుండా ఉండేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. యోగిని ఎక్కువగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రచారానికే వినియోగించుకుంటోంది.
దీనికి తోడు మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొంతకాలంగా తమ ఓట్లు చీలకుండా చేస్తున్న వివిధ ప్రయత్నాలన్నీ ప్రధాని ర్యాలీలతో ప్రభావితం అవుతాయని.. కర్ణాటక మంత్రి, మంగళూరు సిట్టింగ్ ఎమ్మెల్యే యూటీ ఖాదర్ పేర్కొనటం పరిస్థితికి అద్దంపడుతోంది. మోదీ సునామీని తట్టుకునేందుకు ఇంటింటి ప్రచారంపైనే కాంగ్రెస్ అభ్యర్థులు దృష్టిపెట్టారు.
అభిమానం ఓటుగా మారేనా?
‘గత ఎన్నికల్లోనూ మోదీ ఇక్కడ పర్యటించారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ప్రస్తుతం ప్రధాని హోదాలో వస్తున్నారు. దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని ఖాదర్ పేర్కొన్నారు. ‘మోదీ హవా ఉందనేది వాస్తవమే. ఈ జిల్లాలో (మంగళూరు) మోదీకి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కానీ ఇది ఓటుగా ఎంతవరకు మార్పుచెందుతుందనేది ఆలోచించాలి. ఏదేమైనా ఇక్కడ నేనే గెలుస్తాను.
ఈ నియోజకవర్గంలో 20 శాతం మైనారిటీ ఓట్లున్నాయి’ అని మంగళూరు (నార్త్) కాంగ్రెస్ అభ్యర్థి మొయినొద్దీన్ బావా పేర్కొన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున భరత్ శెట్టి బరిలో ఉన్నారు. మరో సున్నితప్రాంతమైన బంత్వాల్ కాంగ్రెస్ అభ్యర్థి, కన్నడ అటవీ శాఖ మంత్రి రామ్‌నాథ్ పాయ్ మాత్రం.. మోదీ ప్రభావం ఉండదని కొట్టిపడేశారు.
వారిని బుజ్జగిస్తే..: విశ్లేషకులు
అయితే రాజకీయ విశ్లేషకులు కోస్తా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని.. మోదీ పర్యటన తర్వాత పరిస్థితి బీజేపీకి మరింత సానుకూలంగా మారొచ్చంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలను మోదీ బుజ్జగిస్తే.. పరిస్థితి కమలదళానికి అనుకూలమేనంటున్నారు.
ముందే రంగంలోకి యోగి
మతపరంగా సున్నితమైన ప్రాంతంలో మోదీ పర్యటన బీజేపీకి అనుకూలంగా మారుతుందని పార్టీ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. విపక్షాల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది. మతపరమైన సున్నిత ప్రాంతం కావటంతో.. ఇక్కడ మెజారిటీ సీట్లను గెలుపొందేందుకు బీజేపీ ముందునుంచే పావులు కదుపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే యోగి ఆదిత్యనాథ్ తరచూ ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటం బీజేపీ వ్యూహంలో భాగమే.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment