బెంగళూరులో ఈవీఎంలను తీసుకెళ్తున్న పోలింగ్ సిబ్బంది
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నేడే కన్నడ సంగ్రామం. గెలుపు గుర్రాన్ని అధిరోహించేదెవరో నిర్ణయమయ్యే రోజు. 2600 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే రోజు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల్లో కన్నడ ఓటరు ఎవరికి పట్టం కడతాడో తేలే రోజు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజే జరగనున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాల్లో.. వాయిదా పడిన ఆర్‌ఆర్ నగర్, జయనగర మినహా 222 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
దాదాపు 55,600 పోలింగ్ బూత్‌ల్లో, మూడున్నర లక్షల మంది సిబ్బంది పర్యవేక్షణలో 4.96 కోట్ల ఓటర్లు తమ తీర్పును ఈ రోజే ప్రకటించనున్నారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కన్నడ నాట కీలక పార్టీ జేడీఎస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్, బీజేపీల నుంచి దిగ్గజ నేతలు స్వయంగా రంగంలోకి దిగి, ప్రచారం నిర్వహించడం ఈ ఎన్నికల్లో గెలుపు వారికి ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి.
చరిత్ర పునరావృతమయ్యేనా!
1985 నుంచి నేటి వరకు కర్ణాటకలో ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలో లేదు. ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి మళ్లీ అధికారంలోకి వస్తామని సిద్దరామయ్య ట్వీట్ చేశారు. మరోవైపు, చరిత్రను పునరావృతం చేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. 130 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ధీమాగా ఉన్నారు. ప్రధాని మోదీ చేసిన సుడిగాలి ప్రచారం తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. పోటీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే నెలకొంది.
ఈ ఎన్నికలు తమ పార్టీకి జీవన్మరణ సమస్యని, ఓడిపోతే మరణమే శరణ్యమని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. నలుగురు తాజా, మాజీ సీఎంలు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. చాముండేశ్వరి, బాదామీల నుంచి సిద్దరామయ్య, షికారిపుర నుంచి యడ్యూరప్ప, చెన్నపట్నం, రామనగర నుంచి కుమారస్వామి, హుబ్లీ–ధార్వాడ్ నుంచి జగదీశ్ షెట్టర్‌లు పోటీ చేస్తున్నారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
కీలక నేతలపైనే చర్చ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లోని కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది.
సిద్దరామయ్య: సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి, బాదామీ రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరిలో జేడీఎస్ నేత జీటీ దేవెగౌడ, బాదామీలో బీజేపీ నేత శ్రీరాములు నుంచి ఇతనికి గట్టి పోటీ ఎదురుకానుంది. చాముండేశ్వరిలో జేడీఎస్ అభ్యర్థి (వక్కలిగ)కి బలమైన మద్దతుంది. ఇక్కడ ‘అహిందా’ ఓట్లనే సీఎం నమ్ముకున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లోనూ సీఎంకు గట్టి పోటీ ఉండటం, రెండుస్థానాల్లో సీఎం ఓడిపోతారని అమిత్ చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆర్ అశోక్: ఇతను దక్షిణ బెంగళూరు పరిధిలోని పద్మనాభసాగర్ నుంచి బరిలో ఉన్నారు. డీలిమిటేషన్‌కు ముందు దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గమైన ఉత్తరహళ్లి నుంచి పోటీ చేసి గెలిచారు. వక్కలిగ వర్గానికి చెందిన అశోక్ బీజేపీలో కీలక నేత. అశోక్‌కే విజయావకాశాలు ఎక్కువ.
ప్రియాంక్ ఖర్గే: పార్లమెంట్‌లో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే. గుల్బర్గా జిల్లా చిత్తాపూర్ నుంచి బరిలో ఉన్నారు. కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. బీజేపీ నుంచి వాల్మీకీ నాయక్ పోటీలో ఉన్నారు. నాయక్, ఖర్గే మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
జి. పరమేశ్వర్: తుముకూరు జిల్లా కొరటగేరే (ఎస్సీ రిజర్వ్‌డ్) నుంచి ఈయన బరిలో ఉన్నారు. 2013లో జేడీఎస్ నేత సుధాకర్ చేతిలో ఓడిపోయారు. జేడీఎస్ నేత సుధాకర్ లాల్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సీనియర్ నేత కావడంతో ఈసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.
బి. శ్రీరాములు: యడ్యూరప్ప తర్వాత బీజేపీలో జనాకర్షకనేతగా శ్రీరాములు ఎదిగారు. పార్టీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇతను సీఎం సిద్ధరామయ్యపై బాదామీలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ నువ్వా–నేనా అనే రీతిలో ఉంది. ములకల్మూరు నుంచి కూడా శ్రీరాములు బరిలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే (బీజేపీ అసంతృప్త) తిప్పేస్వామికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ శ్రీరాములు గెలిచే అవకాశం ఉంది.
ఎస్ సురేశ్‌కుమార్: ఇతను బీజేపీ తరఫున రాజాజీనగర్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో న్యాయశాఖమంత్రిగా పనిచేశారు. పద్మావతి (కాంగ్రెస్) నుంచి ఈయనకు పోటీ ఉన్నప్పటికీ.. సురేశ్‌కుమార్‌కే ఇక్కడ విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సినీ నటుడు సాయికుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న బాగేపల్లిపై కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. బీజేపీ తరఫున ఈయన బరిలో ఉన్నారు. పదేళ్లక్రితం పోటీచేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ నియోజకవర్గంలో కనిపించలేదనే అపవాదు ఉంది. జేడీఎస్ నుంచి ఇతనికి గట్టిపోటీ ఎదురుకానుంది. బీటీఎం నుంచి తెలుగువ్యక్తి, ప్రస్తుత హోంమంత్రి రామలింగారెడ్డి, శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున రోషన్‌బేగ్‌లు గెలిచే అవకాశాలున్నాయి.
పచ్చనోట్ల పందేరం
ఎన్నికలను ఇరుపార్టీలు కీలకంగా తీసుకోవడంతో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో పచ్చనోట్ల పందేరం జరిగింది. నగదు పంపిణీతో పాటు చీరలు, ప్రెషర్ కుక్కర్లు, సెల్‌ఫోన్లు, ముక్కపుడకలు, క్రికెట్ కిట్లు, పంపిణీ చేశారు. బీటీఎం, విజయనగర నియోజకవర్గాల్లో ఓటుకు 3–5వేల వరకు పంచారని.. బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు నాన్సిన్ తెలిపారు. ఇదే నియోజకవర్గంలో ముక్కపుడకలు కూడా పంపిణీ చేస్తున్నారని సోమనాథ్ అనే కిరాణాకొట్టు నిర్వాహకుడు చెప్పారు. పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా 100–150 కోట్లు ఖర్చు చేస్తున్నారని అంచనా. రాజరాజేశ్వరీనగర్ నియోజకవర్గంలో 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులను ఈసీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందోనని ఏపీ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్‌ఆర్ నగర్ ఎన్నిక వాయిదా
10వేల నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడ్డ రాజరాజేశ్వరి నగర్ (ఆర్‌ఆర్ నగర్) నియోజకవర్గ ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మే 28 ఎన్నిక నిర్వహించి 31వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సంజీవ్ కుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆర్‌ఆర్ నగర్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో కానుకలతో పాటు సుమారు 10 వేల నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు జయనగరలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయకుమార్ ఆకస్మిక మృతితో అక్కడ వాయిదా వేశారు. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఈసీ ప్రకటించలేదు.
దావణగెరెలో మహిళలకు ప్రత్యేకించిన పింక్ పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగుతున్న ఓ ఓటరు
Comments
Please login to add a commentAdd a comment