ప్రిస్టేజ్ రిసార్టు ముందు భద్రత
బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. మొబైల్స్, ఇంటర్నెట్‌పై నిఘా. ఇంద్ర నగరిని తలపించే రిసార్టులో జీవితం. ముఖ్యమంత్రి పదవిని అందుకోబోతున్న జేడీఎల్పీ నేత కుమారస్వామి తన ఎమ్మెల్యేలను నగర సమీపంలోని ప్రిస్టేజ్ రిసార్టుకు తరలించారు. బలపరీక్ష వరకు వారిని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
దొడ్డబళ్లాపురం: ఆపరేషన్ కమల కంగారుతో జేడీఎస్ తన ఎమ్మెల్యేలను పిల్లల కోడిలా కాపాడుకుంటోంది. పలు రిసార్టులకు మకాం మారుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని నిద్రపోనివ్వమని బహిరంగంగా సవాళ్లు విసురుతుండడంతో బీజేపీ ఏ వైపు నుండి ఆకర్షిస్తుందోనని భయపడ్డ జేడీఎస్ హైకమాండ్ ఆదివారం రాత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలను దేవనహళ్లి– నందికొండ మార్గంలోని ప్రిస్టేజ్ గోల్ఫ్ షైర్ రిసార్టుకు తరలించింది. రిసార్టు లోపల, బయట పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు ఎడబాటు లేకుండా కుటుంబ సభ్యులను కూడా రిసార్టులో ఉండడానికి అవకాశం కల్పించడం విశేషం. రిసార్టులో పనిచేసే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు వదులుతున్నారు. అతిథులుగా వచ్చిన విదేశీయులు, ఇతర అతిథులు ఈ తనిఖీలతో ఇబ్బందులు పడ్డారు. కొందరిని లోపలకు వదలగా మరికొందరిని వెనక్కు పంపించారు. రిసార్టులోకివెళ్లే ఫోన్లపై నిఘా పెట్టారు.
రిసార్టులో 32 మంది
పార్టీ నాయకుల సమాచారం ప్రకారం 32 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్టులో బసచేయగా, లోకల్ జేడీఎస్ ఎమ్మెల్యే (దేవనహళ్లి) నిసర్గ నారాయణస్వామి పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఉండగా సోమవారం రిసార్టు నుండి ముగ్గురు,నలుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవ్వరూ బయటకు రాలేదు. మొదట చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ పని మీద బెంగళూరుకు వెళ్లారు. తరువాత సింధనూరు ఎమ్మెల్యే నాడగౌడ బయటకు వెళ్లారు. శిర తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 7 మంది మరణించడంతో ఆ ఎమ్మెల్యే సత్యనారాయణ హైకమాండ్ అనుమతితో కారు తెప్పించుకుని అక్కడికి వెళ్లారు.
తరువాత మాజీ మంత్రి ప్రస్తుత జేడీఎస్ ఎమ్మెల్యే బండెప్ప కాశంపూర్ కాసేపు బయటకు వచ్చి మీడియాతో ముచ్చటించారు. లోపల ఎమ్మెల్యేలు ఎలాంటి ఇబ్బందులూ పడడం లేదన్నారు. అయితే అధికంగా ప్రయాణించడం వల్ల అలసిపోయామని, ఇక ఇదే రిసార్టులో 5 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటామన్నారు. మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారా?అని ప్రశ్నించగా కుమారస్వామి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు మంత్రి పదవి ఇమ్మని అయితే అడగలేదని, కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తమందరి లక్ష్యమని చెప్పారు.
అంతా రిలాక్స్ మూడ్
మధ్యాహ్నం సమయానికి కొళ్లేగాల నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మహేశ్ కూడా పని నిమిత్తం బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలందరూ రిలాక్స్ మూడ్‌లో ఉన్నామన్నారు. తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని చెప్పారు. బుధవారం కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి బీఎస్పీ అధినాయకురాలు మాయావతి వస్తారని తెలిపారు. కుమారస్వామి ఎమ్మెల్యేలను కలవడానికి ఉదయమే రిసార్టుకు వస్తారని చెప్పినప్పటికీ, హాసన్‌లో పలు దేవాలయాల దర్శనం,ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉండడంతో ఆయన రాలేకపోయారు.
మంత్రి పదవులపై కాంగ్రెస్ చర్చ
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణంలో పదవుల పందేరంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఓ హోటల్‌లో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపారు. పలువురు జేడీఎస్ నాయకులు కూడా హాజరయ్యారు. మంత్రివర్గంలో సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులకే పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. రెండు పార్టీలకూ ఆమోదయోగ్యులనే కేబినెట్‌లో తీసుకుంటారు. గత సిద్ధు ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఈసారి చాన్స్ ఇవ్వాలా, వద్దా అనేది కీలక ప్రశ్నగా మారింది. సీనియర్ నాయకులు మంత్రి పదవుల కోసం త్యాగం చేయాల్సిందేనని మాజీ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. తనకు పదవి కావాలని అడగలేదని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment