
కర్ణాటక అసెంబ్లీలోని దృశ్యాలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బల పరీక్షలో విజయం సాధించారు. విధానసౌధలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో 117 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకుంది. తమ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించడంతో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
కాగా, బలపరీక్షకు ముందే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా కుమారస్వామి ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ 111ను దాటేసింది. అంతా అనుకున్నట్టు జరగడంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. కుమారస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోవడంతో గత కొన్నిరోజులుగా కర్ణాటకలో కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెర పడింది.
సభలో అంతకుముందు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కన్నడ ప్రజలు ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిశాయని కుమారస్వామి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కొత్తేమీ కాదని, 2004లో ఇలానే జరిగిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment