దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పునిస్తారనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరగటం.. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కర్ణాటక రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరికి మేజిక్ ఫిగర్ దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కన్నడలో ప్రజానాడిపై విడుదలైన ఎనిమిది సర్వేల్లో.. ఆరు బీజేపీవైపు, రెండు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కేవలం మూడు సర్వేలు మాత్రమే ఏకపార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ సంస్థ కాంగ్రెస్ 106 నుంచి 118 సీట్లతో సర్కారు ఏర్పాటుచేస్తుందని పేర్కొనగా.. రిపబ్లిక్–జన్‌కీ బాత్, టుడేస్ చాణక్య సంస్థలు బీజేపీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి.
యూపీలో గతితప్పిన అంచనాలు
గతంలోనూ వివిధ రాష్ట్రాలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించటంలో విజయం సాధించలేకపోయాయి. ఉదాహరణకు, గతేడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ+కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఎస్పీ+కాంగ్రెస్ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు, బీజేపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నా అత్తెసరు మెజారిటీయే ఉంటుందని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓవైపు ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాలు.. కాంగ్రెస్ తరపున సిద్దరామయ్య ఒంటరిగా ప్రతివ్యూహాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ మరొకరికి తీసిపోని విధంగా ప్రచారం చేసింది. మే 15 నాటి ఫలితాలతోనే ఎవరిపై ఎవరిది పైచేయనేది స్పష్టమవుతుంది.
సిద్దరామయ్య విశ్వాసం
కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్యే కన్నడ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఐదేళ్ల కాలంలో చేపట్టిన పలు పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోవటం, సామాన్యులు, పేదలకోసం ఉద్దేశించిన పథకాలను సరిగ్గా అమలుచేయటమే తనకు మళ్లీ పట్టంగడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కేవలం సిద్దరామయ్య వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమేననేది సుస్పష్టం. కన్నడ గౌరవం, కన్నడ ప్రత్యేక జెండా వంటివి కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్‌కు దూరం కాకుండా చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఐదారు నెలలుగా తమ పార్టీకి 120కి పైగా సీట్లొస్తాయని విశ్వాసంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదు. అటు బీజేపీకి కూడా 2008లో అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు కూడా లేవు.
క్షేత్రస్థాయి పనిలో బీజేపీ!
కర్ణాటక ఎన్నికలకు కనీసం ఆర్నెల్ల ముందునుంచే బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. బూత్ స్థాయిలో పనిచేసేలా కార్యకర్తలకు శిక్షణనివ్వటం మొదలుకుని ఓటింగ్ రోజు వారిని పోలింగ్ బూత్‌లకు తీసుకురావటం వరకు పకడ్బందీగా నిర్వహించింది. ఈ పనిని అమిత్‌షాయే ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూవచ్చారు. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితా విశ్లేషణ, ఎన్నికల ర్యాలీలు, యాత్రలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇక్కడ తొలిసారి ఓటేస్తున్న వారి సంఖ్య గతంలో కంటె రెట్టింపు కాగా, మహిళాఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ తన ప్రచారంలో యువత, మహిళలను పదేపదే ప్రస్తావించటం వెనక వ్యూహం కూడా ఇదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమిత్ షా సందేశమిస్తూ.. ‘ ఉదయం 10.30 కల్లా ఓటు వేసి.. మిగిలిన వారు ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి’ అని సూచించారు.
లింగాయత్‌లు ఎటువైపు?
ఈసారి కన్నడ ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించటం. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని సీఎం భావిస్తున్నారు. లింగాయత్‌ల జనాభా ఎక్కువగా ఉండే, సెంట్రల్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్, అంతకుముందు ఒపీనియన్ పోల్స్‌కూడా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే 10 శాతం లింగాయత్‌లు మినహా మిగిలిన వారంతా బీజేపీతోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరగటం అధికార పార్టీపై వ్యతిరేకతకు సంకేతమని అనుకోవడానిక్కూడా వీల్లేదు. దళిత, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, వక్కలిక ఓట్లు మెజారిటీగా ఉన్న పాత మైసూరు ప్రాంతాలపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. హైదరాబాద్ కర్ణాటకలోనూ బీజేపీనుంచి తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. కోస్తా కర్ణాటకలోనూ బీజేపీయే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment