Hung Assembly
-
Karnataka: 2018 టైంలో అలా.. మరి ఇప్పుడు ఎలా?
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కానీ, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవీ కూడా.. ఏ పార్టీకి మెజార్టీని, అధికారాన్ని కట్టబెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మాత్రమే దాదాపు చాలావరకు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలు వెల్లడించాయి. విచిత్రంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో(ప్రధాన పార్టీలు మారాయంతే) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికాగా.. ఆ సమయంలో ఆ జోస్యమే ఫలించింది కూడా!. 👉 కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. 2023 ఎన్నికల తరహా ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అయ్యాయి. అయితే అప్పుడు తుది ఫలితం కూడా అంచనాలకు తగ్గట్లే వచ్చింది. ఆరు జాతీయ వార్తా సంస్థలతో పాటు ఓ రీజినల్ ఛానెల్ సర్వే కూడా బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. చెప్పినట్లుగానే బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. 👉 అదే సమయంలో వేసిన హంగ్ అంచనా కూడా ఫలించింది. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ.. కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన యాడ్యూరప్ప.. మూడు రోజులకే రాజీనామా చేశారు. ఆపై కాంగ్రెస్, జేడీఎస్‌లు సర్కార్‌ను ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ, 14 నెలల తర్వాత బీజేపీలోకి కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలతో సీన్ మారింది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాషాయ పార్టీ బలం 116కు చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 👉 అప్పుడు ఎగ్జిట్‌పోల్స్ మాదిరే ఇప్పుడు గణాంకాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగైదు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి కనిపిస్తోంది. 👉 ఇక.. గత ఎగ్జిట్‌పోల్స్‌కి ఇప్పటి ఎగ్జిట్‌పోల్స్‌కు ప్రధానంగా కనిపిస్తున్న మూడో సారుప్యత.. జేడీఎస్ పార్టీ. గత ఎన్నికల్లో 20 నుంచి 40 స్థానాల నడుమ గెలుస్తుందని వేసిన అంచనా జేడీఎస్ విషయంలో నిజమైంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కింగ్‌మేకర్ అవుతుందని కూడా ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన జోస్యం ఫలించింది. 👉 ఇప్పుడు కూడా ఎగ్జిట్‌పోల్స్.. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్ల దాకా రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమయ్యే స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవచ్చని భావిస్తున్న తరుణంలో.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. -
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
ఆర్జేడీ కూటమికే జై
సాక్షి, న్యూఢిల్లీ/పటా్న: బిహార్‌లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అయిన మహాగuŠ‡బంధన్(ఎంజీబీ) మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా.. ఏడాదిన్నర కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మహాగuŠ‡బంధన్ వైపే ప్రజలు మొగ్గు చూపించినప్పటికీ హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశాలున్నట్టుగా వివిధ సర్వేలు చూస్తే వెల్లడవుతుంది. నితీశ్‌కుమార్ వరసగా నాలుగోసారి సీఎం కావాలని తహతహలాడుతూ ఉంటే, తన తండ్రి లాలూ ప్రచారం చేయకపోయినా తేజస్వి యాదవ్ రాష్ట్రంలో ఆర్జేడీని బలోపేతం చేశారని, యువతరాన్ని ఆకర్షించారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై గత ఏడెనిమిది నెలలుగా నితీశ్ సరిగ్గా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆర్థిక అంశాలు, నిరుద్యోగితపై ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడంలో సఫలీకృతుడయ్యారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ సహా ఆరు పార్టీల కూటమి అయిన గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్(జీడీఎస్ఎఫ్) ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేకపోయిందన్నాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలి ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ప్రశ్నకు 44 శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌నే ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని స్పష్టంగా చెప్పారు. నితీశ్‌కుమార్ సీఎం కావాలని 35% మంది కోరుకుంటే, దివంగత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 7% మంది, ఉపేంద్ర కుష్వా ముఖ్యమంత్రి కావాలని 4% మంది ఆశించారు. బిహార్‌లో తన తండ్రి మాదిరిగా కులాల చట్రంలో పడి కొట్టుకుపోకుండా కొత్త తరహా రాజకీయాలకు తేజస్వీ యాదవ్ తెరతీశారని ఇండియా టుడే విశ్లేíÙంచింది. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ సర్కార్ సురక్షితం! మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడంతో 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు శివరాజ్‌సింగ్ సర్కార్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఉండడంతో ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీకి 16–18, కాంగ్రెస్‌కి 10–12 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్‌తక్ సర్వే కాంగ్రెస్‌కు 16–18, బీజేపీకి 10–12స్థానాలు వెల్లడించింది. యువతరం ప్రతినిధి తేజస్వి 30 ఏళ్ల వయసున్న తేజస్వి తనని తాను యువతరానికి ప్రతినిధిగా ఒక ఇమేజ్ సంపాదించడమే కాకుండా ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వంటి అంశాలతో ప్రచారానికి కొత్త రూపు కలి్పంచారని ఇండియా టుడే అభిప్రాయపడింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ హామీ ఇవ్వడమే కాకుండా, లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కారి్మకుల కష్టాలపైనే ఆయన ఎన్నికల ప్రచారంలో దృష్టి సారించారు. అధికార నితీశ్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన అంశాలను పట్టుకొని వాటినే పదే పదే ప్రస్తావిస్తూ యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వలస కారి్మకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుపేద మధ్య తరగతి వర్గాలన్నీ ఈసారి తేజస్వీ యాదవ్ వైపే ఉన్నట్టుగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ముస్లిం, యాదవ్‌లు అంటూ కులాల వారీగా మద్దతు కూడగట్టుకోకుండా కష్టాల్లో ఉన్న వారి అండని సంపాదించడానికి తేజస్వి ప్రయత్నించారు. తేజస్వి ప్రచార సభలకి జనం వెల్లువెత్తడం, ఆవేశపూరితంగా ఆయన చేసే ప్రసంగాలు ఎన్నికల ఫలితాల్ని మార్చబోతున్నాయని ఇండియా టుడే విశ్లేíÙంచింది. -
సీఎం ఖట్టర్.. డిప్యూటీ దుష్యంత్
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో ‘హంగ్’ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్(65) కొనసాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా(31) డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీలోని 90 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేకపోయింది. ప్రధాన పార్టీలైన బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజాతీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆయన..‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది. అయినా, ఈ ఎన్నికల్లో మేం కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయలేదు కదా?’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన నేతలు బీజేపీకి చెందిన సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరులు సమర్పించిన రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతోపాటు తమకు మెజారిటీ సభ్యుల మద్దతున్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ చేసిన వినతిని కూడా ఆయన అంగీకరించారు. అనంతరం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరగనుందని ఆయన చెప్పారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్‌కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అందజేశారు. గోపాల్ కందా మద్దతు తీసుకోం అంతకుముందు ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకుంది. ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. సీఎం పదవికి ఖట్టర్ పేరును ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్ ప్రతిపాదించగా మిగతా వారు ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఖట్టర్ మంత్రి వర్గంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తాము తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. దుష్యంత్ తండ్రి జైలు నుంచి బయటకు చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. అధికారంలో ఉండగా ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓం ప్రకాశ్‌తోపాటు ఆయన తనయుడు, దుష్యంత్ తండ్రి అయిన అజయ్ చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం నుంచి రెండు వారాలపాటు బయట గడిపేందుకు ఖైదీలకిచ్చే సెలవులాంటి వెసులుబాటు(ఫర్లో)ను అధికారులు కల్పించారు. -
హర్యానాలో హంగ్ అసెంబ్లీ
-
హరియాణాలో హంగ్
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణాలో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తప్పాయి. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లుండగా ‘ఈసారి 75కు పైగా సీట్లు మనవే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలు కూడా సాధించలేకపోయింది. సీఎం ఖట్టర్ కేబినెట్లోని మెజారిటీ మంత్రులు అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బీజేపీతో పోటీగా మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఫలితాల సరళిని బట్టి కొత్తగా అవతరించిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా మారింది. 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో తాజా ఫలితాలను బట్టి బీజేపీ 40, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జేజేపీ 10 సీట్లలో, స్వతంత్ర అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీటిని బట్టి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు దుష్యంత్ చౌతాలాతో పాటు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్లు కానున్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తొహానా స్థానం నుంచి ఓటమి పాలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ సుభాష్ బరాలా... పార్టీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీయేతరులు ఏకం కావాలి: హూడా బీజేపీయేతర పక్షాలన్నీ తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. మిశ్రమ ఫలితాల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు యంత్రాంగాన్ని వాడుకుని స్వతంత్రులపై ఒత్తిడి పెంచుతూ, వారిని బీజేపీ ఎటూ వెళ్లకుండా చేస్తోందని హూడా ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ.. ‘బీజేపీని ప్రజలు తిరస్కరించారు. న్యాయం కోసం కొత్త మార్పును కోరుకున్నారు’ అని పేర్కొన్నారు. ఇది బీజేపీకి నైతిక ఓటమి: కాంగ్రెస్ హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి నైతిక ఓటమి రుచి చూపాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఉన్న 90 సీట్లలో 47 సీట్లతో గతంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు 40 స్థానాలకు పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు 31 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తుకు గతంలో కంటే మంచి ఫలితాలు వచ్చాయని, బీజేపీ మెజార్టీ తగ్గిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది: దుష్యంత్ తాజా ఫలితాలపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. సీఎం ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ‘ఎవరికి మద్దతిచ్చేదీ ఇప్పుడే చెప్పలేం. ముందుగా మా పార్టీ తరఫున గెలిచిన వారితో సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీ నేతను ఎన్నుకుంటాం. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా’ అని అన్నారు. 75 సీట్లలో గెలవాలన్న బీజేపీ లక్ష్యంపై ఆయన స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకే ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది’అని వ్యాఖ్యానించారు. గెలిచిన ప్రముఖులు వీరే... ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 45 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీనియర్ మంత్రి అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిపై 20 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ అతిరథులైన మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా, కుల్దీప్ బిష్ణోయి, కిరణ్ ఛౌధరీ విజయం సాధించారు. ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రేమ్లతపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా 47వేలకు పైగా ఓట్లతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. ఇంకా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీకి చెందిన ఒకే ఒక అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా ముందంజలో ఉండగా హరియాణా లోఖిత్ పార్టీ (హెచ్ఎల్పీ) అధ్యక్షుడు గోపాల్ కందా సిర్సా స్థానంలో గెలుపు సాధించారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ విజయం సాధించారు. ప్రముఖుల ఓటమి హరియాణా మంత్రివర్గంలోని కెప్టెన్ అభిమన్యు, కవితా జైన్, కృష్ణకుమార్ బేడీతో పాటు రెజ్లర్ బబితా ఫొగట్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా, అసెంబ్లీ స్పీకర్ కన్వర్పాల్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ఓటమిపాలయ్యారు. లోక్తంత్ర సురక్ష పార్టీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ గొహానాలో ఓడిపోయారు. జాట్ల కంచుకోటలో కాంగ్రెస్ జాట్ల కంచుకోటలైన రొహ్తక్, జజ్జర్, సోనిపట్ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. కేవలం సోనిపట్ జిల్లాలోని రాయ్ సీటును మాత్రం బీజేపీ గెలుచుకోగలిగింది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ 10చోట్లకు పైగా గెలిచి, మరో 11 చోట్ల ముందంజ లో ఉంది. దక్షిణ హరియాణా, ఫరీదాబాద్ జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపగలిగింది. బీజేపీ ముందు 3 దారులు!! హంగ్ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఏం చేస్తాయి? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమ నేత దుష్యంత్ చౌతాలాని ముఖ్యమంత్రిని చేస్తే మద్దతిస్తామని ఇప్పటికే జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తేల్చి చెప్పింది. బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ విషయంలో బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. 1. మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగానే ఉంచి దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఇది బీజేపీకి సమస్యేమీ కాదు. అయితే జాట్యేతర ముఖ్యమంత్రి ఖట్టర్ కింద డిప్యూటీ సీఎంగా చేరడం జాట్ ఓట్ల పునాదులపై గెలిచిన దుష్యంత్ చౌతాలా రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారవచ్చు. 2. జేజేపీ మినహా ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందే అవకాశం బీజేపీకి ఉంది. ఇప్పటికే ఏడుగురు స్వతంత్రులతో టచ్‌లో ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే ఖట్టర్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టవచ్చు. హెచ్ఎల్పీ అధ్యక్షుడు గోపాల్ గోయల్ కందా, సప్నా చౌదరికి బీజేపీ వర్గాలతో సాన్నిహిత్యం ఉంది. వారిద్వారా మిగిలిన స్వతంత్ర అభ్యర్థులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 3. ఈ ఎన్నికల్లో జాట్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించే అవకాశమూ ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కనుక బీజేపీ సీఎం పదవిని దుష్యంత్ చౌతాలాకు అప్పగించే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే అది అంత తేలిక కాదు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి సీఎంగా.. బీజేపీ నేత, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రోహ్తక్ జిల్లా మహమ్ తెహసిల్‌లోని నిదాన గ్రామంలో 1954 మే 5న జన్మించారు. తండ్రి హర్బాస్ లాల్ ఖట్టర్ వ్యాపారి. భారతదేశ విభజన సమయంలో ఇక్కడకు వలస వచ్చిన కుటుంబానికి చెందినవారు. ఖట్టర్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అవివాహితుడు. హరియాణాకు 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో 24 ఏళ్ల వయసులో ఖట్టర్ ఆర్ఎస్ఎస్లో చేరారు. 1980 నుంచి దాదాపు 14 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పని చేశారు. 1994లో బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయి కార్యకర్తగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న ఖట్టర్.. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2014లో మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో హరియాణా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
హరియాణాలో కాంగ్రెస్ వ్యూహాలకు బీజేపీ చెక్
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీకి సీఎం పదవిని ఆఫర్ చేస్తూ బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు అప్పగించింది. హరియాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించే పరిస్థితి లేకపోవడంతో జేజేపీని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 90 మంది సభ్యులతో కూడిన హరియాణ అసెంబ్లీలో బీజేపీ 40 స్ధానాల్లో కాంగ్రెస్ 29 స్ధానాల్లో ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ పది స్ధానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. కాగా, హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం. -
కమల్‌నాథ్ X సింధియా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టేదెవరో ఇంకా తేలనప్పటికీ ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గనుక ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో యువనాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ కూడా కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్నారు. అనుభవజ్ఞుడికే బాధ్యతలు ఇస్తారా? చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ 9 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఓ సారి ఇందిర చింద్వారాకు ఎన్నికల ప్రచారానికి వచ్చి, నా మూడో కొడుకు కమల్‌నాథ్‌ను గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇవి చాలు రాజకీయాల్లో కమల్‌నాథ్‌కు ఉన్న అనుభవమేమిటో చెప్పడానికి. ఇప్పుడు అనుభవజ్ఞుడైనందున కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపొచ్చనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కమల్‌నాథ్ సీఎం రేసులో ముందున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కమల్‌నాథ్ అంతా తన భుజస్కం«ధాలపైనే నడిపించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ కమలనాథ్కు ఏరికోరి ఎన్నికల వేళ పీసీసీ పగ్గాలు అప్పగించిందనే విశ్లేషణలైతే ఉన్నాయి. కానీ మాస్ ఫాలోయింగ్‌లో ఆయన వెనుకబడే ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ జ్యోతిరాదిత్యకే మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందిన సింధియా జనాకర్షణ కలిగిన నేత. గత కొన్నేళ్లుగా గ్రామ స్థాయి పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకున్నారు. 32 శాతం మంది ప్రజలు జ్యోతిరాదిత్య సీఎం కావాలని కోరుకున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆయన మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఎల్లప్పుడూ విభేదిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ మాజీ నేత మాధవరావు సింధియా కుమారుడు కావడం, రాహుల్ గాంధీకి కుడి భుజంగా ఉండడం జ్యోతిరాదిత్యకు కలిసొచ్చే అంశాలు. మరో నాలుగు నెలల్లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలున్నందున ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింధియాకు కాంగ్రెస్ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. -
జమిలి జరగాలంటే...
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. దేశంలో తరచూ ఎన్నికల వల్ల అభి వృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతోందని, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజా ధనం వృథా అవుతోందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని నివారించేందుకు రాష్ట్రాలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే డిమాండ్ కొన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాలకూ కాకపోయినా అతితక్కువ గడువు మాత్రమే ఉన్న 12 రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి లోక్‌సభకూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, లోక్‌సభ నిబంధనలు, ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి వాటికి కేంద్రం యుద్ధప్రాతిపదికన సవరణలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులు... చట్టసభలు నిర్ణీత ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటేనే జమిలి ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అవిశ్వాస తీర్మానాలతో ప్రభుత్వాలు పడిపోయినప్పుడు, హంగ్ ఏర్పడి ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు, అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసినప్పుడు సాధారణ ఎన్నికలతో కాకుండా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణల ఆవశ్యకత ఏర్పడుతుంది. అవి ఏమిటంటే... - ఆర్టికల్ 83, 172 (1): లోక్‌సభ కాలావధి ఐదేళ్లు అని రాజ్యాంగంలోని 83 (2) క్లాజ్ చెబు తోంది. అసెంబ్లీల పదవీకాలం మొదటిసారి సమావేశమైనప్పటి నుంచి ఐదేళ్లు అని ఆర్టికల్ 172 (1) సూచిస్తోంది. ఈ రెండింటికీ కాలా వధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. - ఆర్టికల్ 85, 174: లోక్‌సభ రద్దు, వాయిదా, సుప్తచేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలావధి కంటే ముందే ఏదైనా సభ రద్దయితే మిగిలిన సమయానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో ఏర్పడిన సభ 2020లోనే రద్దు అయితే మిగిలిన కాలానికి అంటే 2024 వరకూ అసెంబ్లీ ఉండేలా ఎన్నికలు జరుగుతాయన్నమాట. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటుకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది. - రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని కుదించాలన్నా, పొడిగించాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొత్త క్లాజులు చేర్చాలి. కుదింపు/పొడిగింపు ఎంతకాలం అనే దానిపై పరిమితి ఉండరాదు. - అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం చూపుతూ విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాలి. రెండింటికీ ఒకేసారి ఓటింగ్ జరగాలి. తద్వారా చట్ట సభలు ముందస్తుగా రద్దయ్యే అవకాశాలు తగ్గుతాయి. - సాధారణ ఎన్నికలకు కొంచెం సమయం మాత్రమే ఉన్నప్పుడు ఏవైనా చట్ట సభలు రద్దయితే రాష్ట్రపతి పాలన విధించాలి. తాను నియమించుకున్న మంత్రుల ద్వారా పాలన సాగించే అధికారం రాష్ట్రపతికి ఉండాలి. అసెంబ్లీలకు సంబంధించి ఈ పనిని గవర్నర్ చేసేలా చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. - హంగ్ ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోయినా, ఏదైనా ప్రభుత్వం రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకున్నా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కాలపరిమితి ఐదేళ్లు ఉండదు. మిగిలిన సమయానికి మాత్రమే కొత్త సభ మనుగడలో ఉంటుంది. - ఆర్టికల్ 356: దీని ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకూ మాత్రమే విధించ వచ్చు. పొడిగించాల్సి వస్తే మళ్లీ రాష్ట్రపతి ఆమో దం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో మూడేళ్లపాటు రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఐదేళ్ల అవధి మధ్యలో ఏదైనా అసెంబ్లీలో రాష్ట్రపతి పాలన విధించి మూడేళ్ల రాష్ట్రపతి పాలన ముగిశాక కూడా సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలన్న అంశాన్ని కూడా నిర్వచించి ఈ ఆర్టికల్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఇదీ జమిలి చరిత్ర... 1952లో లోక్‌సభ తొలి సార్వత్రిక ఎన్నికలతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల (ఒకటి రెండు మినహాయింపులతో) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 దాకా ఈ పరిస్థితే కొనసాగింది. 1967లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడగా అంతర్గత కుమ్ములాటలు లేదా కేంద్రమే రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దయ్యాయి. 1971లో ఏడాది ముందుగానే అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడంతో జమిలి ఎన్నికల శకం ముగిసింది. 1999లో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి సారథ్యంలోని లా కమిషన్ తన నివేదికలో ఎన్నికల సం స్కరణలపై పలు సూచనలు చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసి ంది. 2014 సెప్టెంబర్‌లో సుదర్శన్ నాచియప్పన్ చైర్మన్‌గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది. 2015 డిసెంబర్లో ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ 2016 సెప్టెంబర్‌లో తొలిసారిగా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. వాస్తవ దృష్టితో చూస్తే పార్లమెంటుతోపాటు 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ అభిప్రాయపడ్డాయి. 2019లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే అస్సాం, కేరళ, తమిళనాడు అసెంబ్లీల కాలపరిమితిని రెండేళ్లు తగ్గించాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెం బ్లీల పదవీకాలాన్ని దాదాపు మూడేళ్లు కుదించాలి. ఈ త్యాగాలకు అక్కడి అధికార పార్టీలు అంగీ కరించే అవకాశం లేనందున మధ్యేమార్గాన్ని అనుసరించాలని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ సూచిం చాయి. కొన్ని రాష్ట్రాలను 2019 ఏప్రిల్–మేలలో (మొదటి దశ) జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలతో కలిపితే... మిగతా వాటిని 2021 అక్టోబర్–నవంబర్లలో (రెండో దశ) కలిపి ఎన్నికలు నిర్వ హించాలనేది సూచన. ఈ విధంగా దేశంలో ఐదేళ్లలో రెండుసార్లే ఎన్నికలు జరుగుతాయి. 2019 మే తర్వాత రెండున్నర ఏళ్లకు 2021 నవంబర్‌లో మళ్లీ ఎన్నికలుంటాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కొన్ని సవరణలు చేస్తేగానీ జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్నది న్యాయ కమిషన్ ముసాయిదా చెబుతున్న విషయం. పదవ షెడ్యూల్లోని ఈ అంశంలో పార్టీలు జారీ చేసే విప్‌లు సభ్యులు అతిక్రమించకూడదని ఈ షెడ్యూల్ చెబుతుంది. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు విప్‌లు జారీ చేయకుండా చేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది. తద్వారా ఆ ప్రభుత్వం ఐదేళ్లు నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే విప్ల జారీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించాల్సి ఉంటుంది. చట్ట సవరణ పద్ధతులు... జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసేందుకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. చేయాల్సిన మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. మార్పుల ముసాయిదాను కేంద్ర కేబినెట్ పరిశీలించి ఆమోదించాలి. చట్టాలు, నిబంధనల మార్పు కోరుతూ ఓ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ మార్పులన్నీ చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇవన్నీ జరిగాయనుకున్నా మార్పులు, చేర్పుల కారణంగా రాజ్యాంగం తాలూకూ మౌలిక స్వభావానికి విఘాతం కలిగిందని ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉండటం కొసమెరుపు! ప్రజాప్రాతినిధ్య చట్టం... జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంట్లోని సెక్షన్ 14 లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబందించినది. ఇందులోని రెండవ క్లాజ్ ప్రకారం లోక్‌సభ కాలావధి ముగిసేందుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం లేదు. లోక్‌సభ నిర్ణీత కాలావధి ముగిశాక లేదా రద్దయినప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. అసెంబ్లీ, లోక్‌సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈ క్లాజ్‌ను సరి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన నిర్వచనాన్ని చేర్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుకూల వాదన... - ఏటా ఏదో ఒక ఎన్నికలు (పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఉండటం మంచిది కాదు. గత 30 ఏళ్లలో ఏ ఒక్క ఏడాదీ ఎన్నికలు లేకుండా గడవలేదు. సగటున తీసుకున్నా ఏటా 5 లేదా 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికల ప్రవర్తనా నియామవళి కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకాలు, పనులను చేపట్టే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గత మూడేళ్లలో చూస్తే 2014లో ఏడు నెలలు, 2015లో మూడు నెలలకుపైగా, 2016లో రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. - జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రూ. 3,780 కోట్లు ఖర్చయింది. జమిలి ఎన్నికలు పెడితే రూ. 4,500 కోట్లు సరిపోతాయని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. - ఎన్నికల నిర్వహణ కోసం భారీగా పారామిలటరీ, పోలీసులమోహరింపుతో శాంతిభద్రతల పర్యవేక్షణలో లోపం ఏర్పడుతుంది. - తరచూ ఎన్నికలు జరిగితే కుల, మత, ప్రాంతీయ భావాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతికూల వాదన... - ఏకకాలంలో ఎన్నికలు వస్తే భారత్‌లో 77 శాతం ఓటర్లు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి ఓటేస్తారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. - లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరు ఎజెండాలపై జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ఓటరు తీర్పు ఉంటుంది. జమిలి ఎన్నికలైతే జాతీయాంశాలు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించి రాష్ట్రాలకున్న ప్రత్యేక సమస్యలు మరుగునపడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకే పరిమితమై ఓటరు తీర్పునిచ్చే అవకాశాన్ని జమిలి ఎన్నికలు తగ్గిస్తాయి. - మనది సమాఖ్య వ్యవస్థ. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదంగా బాగానే ఉన్నా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. లోక్‌సభతోపాటే ఎన్నికలు జరిగేలా రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించినట్లే అవుతుందని, ఇది రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని మరింత పెంచినట్లవుతుందనేది నిపుణుల ఆందోళన. జమిలిపై పార్టీల వైఖరి ఏమిటి? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రంలోని అధికార బీజేపీ ఆలోచనతో ఏకీభవించడం లేదని ఇటీవల జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్) సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మరోవైపు తాము జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ప్రకటించాయి. జమిలి ఎన్నికలకు జేడీ(యూ) పాక్షిక మద్దతు తెలిపినప్పటికీ ఆర్టికల్ 356 ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసింది. -
అక్కడ ప్రమాణం చేస్తే.. ఐదేళ్లు కష్టమే!
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేశారు. గత చరిత్ర చూస్తే విధానసౌధ ఆవరణలో ప్రమాణస్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఐదేళ్లు పదవిలో లేరు. గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో నిర్వహించేవారు. కానీ 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు. అదేఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణంచేసినా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో మళ్లీ పదవిని పోగొట్టుకున్నారు. 1990లో సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణం చేసిన బంగారప్ప కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. కావేరీ జాలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో ఆయన రెండేళ్లలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006లో బీజేపీ మద్దతుతో విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి కేవలం 20 నెలలే పరిపాలించగలిగారు. యడ్యూరప్పకూ చుక్కెదురే.. కర్ణాటకలో 2008లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పట్లో విధానసౌధ ముందు అట్టహాసంగా, ఎంతో ఆడంబరంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి దూరమయ్యారు. -
ఇది ప్రాంతీయ, లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయం
కోల్‌కతా / న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం యడ్యూరప్ప మూడ్రోజుల ప్రభుత్వం కూలిపోవడం ప్రాంతీయ శక్తుల విజయమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలకు, దేవెగౌడకు, కుమారస్వామికి, కాంగ్రెస్ సహా ఇతర నేతలకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడం లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. కర్ణాటకలో శనివారం ప్రజాతీర్పు ధన బలంపై విజయం సాధించిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన ఘటనతో బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సూచించారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ‘అబద్ధాలు, అబద్ధాలకోరును సత్యమే ఓడిస్తుంది’ అని ట్వీట్ చేశారు. -
కర్ణాటకంలో కాంగ్రెస్ దూకుడు
కర్ణాటక రాజకీయ క్రీడలో ప్రస్తుతానికి కాంగ్రెస్ విజయం సాధించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. అధికారం చేపట్టలేకపోయిన వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. కర్ణాటకలో తమ వ్యూహాలను పకడ్బందీగా అమల్లో పెట్టింది. ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్.. విజయంపై తొలి నుంచి ధీమాగానే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ప్రచార రంగంలోకి దూకింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రాన్ని చుట్టేశారు. మరోవైపు సిద్దరామయ్య ఇమేజ్, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అంతగా లేని వ్యతిరేకత తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశించింది. రాహుల్ దేవాలయాల సందర్శన, లింగాయత్‌లకు మైనారిటీ హోదా.. తదితరాలు కూడా ఓట్లు కురిపిస్తాయనుకుంది. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. సాధారణంగా అయితే, ఓటమిని అంగీకరించి, మౌనంగా ఉండే కాంగ్రెస్.. ఈసారి ఊహించని దూకుడును ప్రదర్శించింది. ఫలితాలు వెలువడుతుండగానే రంగంలోకి దిగింది. రాహుల్ ఇంట్లో జరిగిన ‘లంచ్ మీట్’లో ప్లాన్ బీని సిద్ధం చేసింది. ఫలితాలకు ముందు రోజే బెంగళూరు చేరుకున్న ఆజాద్ ద్వారా జేడీఎస్‌తో రాయబారం నడిపింది. ప్రభుత్వ ఏర్పాటులో కలసి నడుద్దామని, జేడీఎస్‌కు మద్దతిచ్చేందుకు సిద్దమని సమాచారం పంపింది. సీఎంగా కుమారస్వామి ఉంటారన్న డిమాండ్ సహా జేడీఎస్ నుంచి వచ్చిన డిమాండ్లకు వెంటనే ఆమోదం తెలిపింది. సీనియర్ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు స్వయంగా కాంగ్రెస్ ప్రణాళికను దగ్గరుండి మరీ అమలు చేసేలా చూసింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో గవర్నర్ వద్దకు కుమారస్వామితో పాటు ఆజాద్‌నూ పంపించింది. లాస్ట్ ‘రిసార్ట్’..: ఇప్పుడు తమ ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞుడైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. తొలుత బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను భద్రంగా దాచిన శివకుమార్, మరింత భద్రత కోసం అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించి, బలపరీక్ష రోజే(శనివారం) అసెంబ్లీకి చేరుకునేలా ప్రణాళిక రచించారు. అంతకుముందు, వారిని కొచ్చికి తరలిస్తున్నట్లుగా లీకులిచ్చి, గందరగోళం సృష్టించారు. ‘మిస్’ అయిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప గౌడను కూడా మళ్లీ సొంత గూటికి తెచ్చారు. ఇలా అనూహ్యంగా దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టింది. ఈ మొత్తం వ్యూహాన్ని సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా స్వయంగా పర్యవేక్షించారు. కోర్టులోనూ క్రియాశీలకంగా.. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన తరువాత కూడా కాంగ్రెస్ శీఘ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులైన అభిషేక్ మను సింఘ్వీ, చిదంబరంలను రంగంలోకి దింపింది. యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని, బలనిరూపణకు 15 రోజుల గడవు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. బుధవారం అర్ధరాత్రే సుప్రీంకోర్టు తలుపు తట్టి, తమ పిటిషన్‌ను విచారించాలని కోరింది. దాంతో అప్పటికప్పుడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వాదనలు తెల్లవారే వరకు నడిచాయి. కానీ యెడ్డీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత ఇరుపక్షాల వాడీవేడి వాదనల అనంత రం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనబెట్టి, శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని యడ్యూరప్పను ఆదేశించింది. ఈ తీర్పు కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
23న కుమారస్వామి ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజులకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శాసనసభా పక్ష నేతగా ఉన్న కుమారస్వామిని శనివారం రాత్రి గవర్నర్ వజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ‘గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలుసుకున్నాను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం మే 15న సమర్పించిన వినతిపత్రం మేరకు మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు’ అని కుమార స్వామి చెప్పారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజుల్లో సభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారని, అంతకంటే ముందుగానే బలపరీక్షకు వెళ్తామని తెలిపారు. మే 21న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తొలుత చెప్పిన ఆయన.. కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం మే 23న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మే 23కు మార్చారని జేడీఎస్ నాయకుడొకరు చెప్పారు. ‘మే 24న బలపరీక్షకు వెళ్లాలన్న అంశంపై కాంగ్రెస్‌తో చర్చించాం’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మే 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు చెపుతానని, అలాగే కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఎంత మంది మంత్రులుగా ఉండాలన్న అంశంపై వారితో చర్చిస్తానని ఆయన తెలిపారు. విపక్ష నేతలకు ఆహ్వానం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని కుమారస్వామి చెప్పారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాయావతి, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్–జేడీఎస్‌లు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మరోసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన కుమార స్వామి.. ‘వారు ఇబ్బందులు సృష్టిస్తారన్న విషయం తెలుసు. వాటిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. -
గెలుస్తాననుకున్నా..!
బెంగళూరు: రాజీనామా చేసే ముందు, సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాజీనామా చేయడం తథ్యమని నిర్ణయించుకున్న తరువాత చేసిన ఈ వీడ్కోలు ప్రసంగంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. అధికారంలో కొనసాగితే రైతు సంక్షేమం కోసం పాటు పడ్తామనుకున్నానని, అది సాధ్యం కాకపోతున్నందుకు బాధపడ్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు అతిపెద్ద పార్టీగా బీజేపీకే పట్టం కట్టారని, కాంగ్రెస్, జేడీఎస్ కుట్రపూరితంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడి ప్రజాతీర్పును కాలరాశాయన్నారు. అయినా, రాష్ట్రాభివృద్ధికోసం కలసి వస్తారన్న ఆశతో కొందరు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తాననుకున్నానన్న యడ్యూరప్ప.. ఆశించినవన్నీ జరగవు కదా! అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కాంగ్రెస్–జేడీఎస్ అవకాశవాద కూటమి. కుట్ర చేసి ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. మీరు ఎమ్మెల్యేలను బంధించారు. పాపం వారు తమ కుటుంబసభ్యులతోనూ మాట్లాడుకోకుండా చేశారు. మీ ఎమ్మెల్యేలంతా వాళ్ల కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం దక్కినందుకు ఇవాళ సంతోషంగా ఉండుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇది వాస్తవం. ఆత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని వారిని కోరాను. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న పార్టీ. అందుకే ఆ ఎమ్మెల్యేలు నేటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని వారితో అన్నాను. కొందరు ఇందుకు అంగీకరించారు కూడా. కాంగ్రెస్‌కు గానీ, జేడీఎస్‌కు గానీ ప్రజామోదం దక్కలేదనేది వాస్తవం. అతిపెద్ద పార్టీగా నిలిచినందునే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించారు. నావి ప్రజా రాజకీయాలు. ఇకపైనా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈ విశ్వాస పరీక్షను అగ్నిపరీక్షలా భావించాను. ఇదేం తొలిసారి కాదు. నా జీవితమంతా అగ్నిపరీక్షే. ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం అనుకునేది వేరు. దేవుడి ఆలోచన వేరు’ అని వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు ‘నా చివరి శ్వాస వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఇక కర్ణాటక రాష్ట్రమంతా పర్యటిస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలను, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను బీజేపీ గెలుచుకోవటంలో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తా. నేను పోరాడుతూనే పైకొచ్చాను. నాకు అధికారం ఇవ్వకపోతే చనిపోతానని ఒకరు (కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ)చెప్పారు. నాకు అధికారం దక్కినా, దక్కకపోయినా నేను మాత్రం అలా అనను. మన కాంగ్రెస్ మిత్రుల కుట్ర కారణంగా ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగుతాను. గవర్నర్ దగ్గరికెళ్లి రాజీనామా సమర్పించబోతున్నాను’ అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌తో కరచాలనం చేసి సభ నుంచి యడ్యూరప్ప బయటకెళ్లారు. నాడు వాజ్‌పేయి..నేడు యడ్యూరప్ప! అది 1996.. కేవలం 13రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందు ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. నాటి ప్రసంగాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారంలో అందించటంతో దేశ ప్రజల మనసుల్లో అది చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సుదీర్ఘ, ఉద్వేగపూరిత ప్రసంగంతో సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయినా.. దేశ ప్రజల నమ్మకాన్ని వాజ్‌పేయి చూరగొన్నారు. ‘నేను పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి విపక్షాలకు చురకలు అంటించా రు. శనివారం నాడు అసెంబ్లీలోనూ యడ్యూరప్ప ఇదే రీతిలో మాట్లాడారు. ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినా నా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. -
ఢీ కొట్టని యెడ్డీ..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో ఐదురోజుల సస్పెన్స్‌కు తెరపడింది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. కీలకమైన విశ్వాసపరీక్షకు ముందు బల నిరూపణ చేసుకోలేకపోతున్నానంటూ రాజీనామా చేశారు. గవర్నర్ వజూభాయ్ వాలా బలనిరూపణ కోసం యెడ్డీకి 15 రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్–జేడీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు శనివారం సాయంత్రమే విశ్వాసపరీక్ష జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండానే.. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగింది. సభలో ఉద్వేగ భరిత ప్రసంగం చేసిన యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని బీజేపీయేతర విపక్ష నేతలు పేర్కొన్నారు. అనంతరం మమతా బెనర్జీ సహా వివి ధ పార్టీల అధ్యక్షులు కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు రావాలంటూ.. జేడీఎస్ నేత కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మమత, కేసీఆర్, చంద్రబాబు తదితరులను కుమారస్వామి ఆహ్వానించారు. ఉదయం నుంచీ ఉత్కంఠ శనివారం ఉదయం నుంచీ బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో బసచేసిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉదయమే వేర్వేరు బస్సుల్లో బెంగళూరులోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో వీరిని పటిష్టమైన భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అక్కడ ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య.. ఎన్నికైన అందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదంతా జరుగుతుండగానే.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ మిత్రులైన బీజేపీ సభ్యులతోనూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ హోటల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అనంతరం సిద్దరామయ్య కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ చేశారు. మరోవైపు, వీలైనంత ఎక్కువ మందిని లాగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. ఓ గంటముందు నుంచీ బీజేపీలో విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది. యడ్యూరప్పే రంగంలోకి దిగినా.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పటినుంచీ విశ్వాస పరీక్షలో గెలుస్తామంటూ యడ్యూరప్ప ధీమాగా కనిపించారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన గానీ, బీజేపీ నేతలు గానీ పరీక్షలో నెగ్గటంపై నమ్మకంగా కనిపించలేదు. బలపరీక్షలో నెగ్గేందుకు ఏడుగురు అదనపు ఎమ్మెల్యేల బలం అవసరం ఉండగా.. జేడీఎస్, కాంగ్రెస్ కూటమిలోని ఎమ్మెల్యేలను ఒప్పించటంలో యడ్యూరప్ప బృందం విఫలమైంది. యడ్యూరప్పే స్వయంగా రంగంలోకి దిగి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడినా పెద్దగా లాభం లేకపోయింది. కూటమి ఎమ్మెల్యేల్లో యెడ్డీ సహా పలువురు బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియో టేపులను కాంగ్రెస్ విడుదల చేయటం సంచలనం రేపింది. వారికి మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప స్వయంగా భరోసా ఇవ్వడంతో బలనిరూపణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ బంధించిందని ఆరోపణలు రాగా.. ఈయన సరిగ్గా యడ్యూరప్ప ప్రసంగానికి ముందు సభలో ప్రవేశించారు. అసెంబ్లీలో ప్రకటన అనంతరం రాజ్‌భవన్ చేరుకున్న యడ్యూరప్ప.. గవర్నర్ వజూభాయ్ వాలాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. యెడ్డీ రాజీనామాతో జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు (కాంగ్రెస్ మద్దతుతో) చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన 221 సీట్లలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117 ఎమ్మెల్యేల బలముంది. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: ఆజాద్ గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ‘గవర్నర్ మా రెండు పార్టీలను (జేడీఎస్, కాంగ్రెస్) చీల్చేందుకు యడ్యూరప్పకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ.. ఎమ్మెల్యేల బేరసారాలు జరగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా న్యాయవ్యవస్థ వ్యవహరించినందుకు కృతజ్ఞతలు’ అని ఆజాద్ పేర్కొన్నారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన యడ్యూరప్ప 2007లో ఏడు రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అనంతరం 2008లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాక దాదాపు మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదురోజుల సస్పెన్స్ మే 15న వెల్లడైన ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో కన్నడ నాట అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితాలు వెలువడుతుండగానే జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. కూటమి కంటే ముందే యడ్యూరప్ప గవర్నర్‌ను కలసి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరారు. అటు, మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువమందే తమకు మద్దతుగా ఉన్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలసి తమ ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారు. కొంత సమయం తీసుకున్న గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టి.. మరునాడు జరగాల్సిన యెడ్డీ ప్రమాణస్వీకారాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తమ అభ్యర్థులు చేజారకుండా బౌన్సర్లతో పటిష్టమైన భద్రత నడుమ రిసార్టులు, హోటళ్లలో వారిని ఉంచింది. అయితే.. యెడ్డీ ప్రమాణస్వీకారానికి అడ్డుతగలబోమన్న సుప్రీంకోర్టు.. శనివారం సాయం త్రం 4కు బలనిరూపణ జరగాల్సిందేనని ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారమంతా వీరితో సమావేశమై విశ్వాస పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. అయినా ఇరు పార్టీల నేతలకు మనస్సులో ఎక్కడో శంక. తమ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారతారన్న అనుమానం వెంటాడా యి. కానీ శనివారం అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు లేకుండానే యడ్యూరప్ప రాజీనామాను ప్రకటించటంతో ఐదురోజుల థ్రిల్లర్ ప్రస్తుతానికి ముగిసినట్లే కనబడుతోంది. -
మళ్లీ ‘ఆపరేషన్ కమల’?
పూర్తి మెజారిటీ లభించని బీజేపీని గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో.. ‘ఆపరేషన్ కమల’ మరోసారి తెరపైకి వచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం.. 2008లోనూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇప్పటిలాగే అప్పుడు కూడా బీజేపీయే అతిపెద్ద పార్టీగా నిలిచింది. సాధారణ ఆధిక్యానికి 113 సీట్లు అవసరమవ్వగా బీజేపీ 110 స్థానాల్లో గెలుపొంది.. మేజిక్ ఫిగర్‌కు కేవలం మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది. దాంతో యడ్యూరప్ప రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, జేడీఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో ‘మాట్లాడి’ వారి చేత రాజీనామాలు చేయించారు. మరోవైపు అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ, గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బలనిరూపణ పరీక్ష నాటికి సభలో ఏడుగురు సభ్యులు తగ్గిపోవడంతో మేజిక్ ఫిగర్ కూడా తగ్గింది. రాజీనామా చేసిన వారంతా కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులే కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గింది. ఆ వెంటనే రాజీనామా చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. వారిలో ఐదుగురు గెలిచారు. దీంతో సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 115కు చేరి స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీన్నే ‘ఆపరేషన్ కమల’ అని వ్యవహరిస్తారు. అప్పట్లో ‘ఆపరేషన్ కమల’ను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అందరూ మెచ్చుకున్నారు. -
అంతా గవర్నర్ విచక్షణేనా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. హంగ్ ఏర్పడితే, లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్ అధికార పరిధి, నిర్ణయాధికారాలపై కమిషన్లు, నిపుణుల సూచనలు చూద్దాం.. పూంచీ కమిషన్ ఏమంది? ఎన్నికలకు ముందు పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని కూడా రాజకీయ పార్టీగా భావించాలని పూంచీ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానించాలో ప్రాధాన్య క్రమంలో వివరించింది. అవి వరుసగా.. 1) పోలింగ్‌కు ముందు ఏర్పడి అధిక సీట్లు గెలుచుకున్న కూటమి 2) ఇతరుల మద్దతున్న అతిపెద్ద పార్టీ 3)పోలింగ్ అనంతరం ఏర్పడిన కూటమి 4)ఇతర పార్టీల చేరికతో పోలింగ్ అనంతరం ఏర్పడిన కూటమి (స్వతంత్రులు బయటి నుంచి మద్దతు తెలుపుతూ ఉండాలి) సర్కారియా కమిషన్ సిఫార్సు ఏంటి? ఎక్కువ సీట్లు గెలుచుకున్న కూటమికి గవర్నర్ ప్రాధాన్యమివ్వాలని సర్కారియా కమిషన్ అభిప్రాయపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో..ప్రాధాన్య క్రమంలో 1)పోలింగ్‌కు ముందు కుదిరిన కూటమి 2) సరిపడా మద్దతు కూడగట్టే అవకాశాలున్న అతిపెద్ద పార్టీ 3)పోలింగ్ తరువాత ఏర్పడిన కూటమి (సంఖ్యాబలముంటేనే) 4) బయటి నుంచి మద్దతు ఉందని, విశ్వాస పరీక్షకు 30 రోజుల గడువు కోరిన కూటమిని ఆహ్వానించాలంది. ఒక్కొక్కరిది ఒక్కో శైలి: నారిమన్ కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితి భారత్‌కు కొత్త కాదని ప్రముఖ న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్ అభిప్రాయపడ్డారు. దీన్ని ‘అతిపెద్ద పార్టీ వర్సెస్ పోలింగ్ అనంతర కూటమి’ కేసుగా వర్ణించారు. పార్టీ ఫిరాయింపులు, అనైతిక బేరసారాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గవర్నర్లు అంతా తమ విచక్షణాధికారాలను ఒకే రకంగా వినియోగించరని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కొందరు అతిపెద్ద పార్టీని, మరికొందరు అతిపెద్ద కూటమిని ఆహ్వానిస్తారని తెలిపారు. తేలాల్సింది సభలోనే: సుభాష్ కశ్యప్ ప్రభుత్వం ఏర్పాటుచేయమని ఎవరినైనా అడిగే అధికారం గవర్నర్‌కు ఉందని, ఆ నిర్ణయాన్ని కోర్టులోనూ సవాలుచేయరాదని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ తెలిపారు. అయితే గవర్నర్ సీఎంగా నియమించిన వ్యక్తి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని, గవర్నర్ ముందు సభ్యుల పరేడ్ నిర్వహిస్తేనో, ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లుగా లేఖలు చూపితేనో సరిపోదని అన్నారు. -
కన్నడ రాజ్యం ఎవరిది?
బీజేపీ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండురోజులు గడువు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత ఆధిక్యం లేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ బేరసారాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన పలువురు లింగాయత్ వర్గ శాసనసభ్యులు ఒక వక్కలిగ ముఖ్యమంత్రి కింద పని చేయడానికి సముఖంగా లేరన్నది మరొక అంశం. కాబట్టి బల నిరూపణ సమయంలో శాసనసభ రణరంగంగా మారడానికి అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలలో అసలు లబ్ధిదారు దేవెగౌడ. ఆయనే ఈ మంగళవారాన్ని అసలు మరచిపోలేరు. దేశ రాజకీయాలను పరిశీ లించేవారికి ఈ మంగళవారాన్ని (15వ తేదీ) మరచిపోవడం సులభం కాదు. కారణం– కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఉదయం పదకొండు గంటల వేళ మొత్తం 120 నియోజకవర్గాలలో బీజేపీ ముందంజలో ఉండడంతో ఇక కాంగ్రెస్, జేడీ(ఎస్)ల ఆట కట్టేనని అనిపించింది. కానీ తరువాత జరిగిన పరిణామాలే ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్టు మారిపోయాయి. నెమ్మదిగా బీజేపీ వెనకపడింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాల సంగతి దేవుడెరుగు, 104 స్థానాల దగ్గర ఆ పార్టీ విజయయాత్ర ఆగిపోయింది. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఎదురు చూస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు కలిపి 116 స్థానాలు దక్కాయి. సాయంత్రానికి జేడీ (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి గవర్నర్‌ను కలసి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం ఇచ్చివచ్చారు. కానీ ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటి కథ వేరు. కాంగ్రెస్ గెలుపు మీద సర్వేలు రెండుగా చీలిపోయాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినవారికి కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న అభిప్రాయం కలిగింది. తరువాత బీజేపీ ముందంజలోకి రావడానికి కారణం ఏమిటి? ఏప్రిల్ 30 వరకు కూడా బీఎస్ యడ్యూరప్ప, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు సాగించిన ప్రచారం పేలవంగానే సాగింది. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి 21 బహిరంగ సభలలో ప్రసంగించడంతో పార్టీలో ఉత్సాహం వెల్లువెత్తింది. కాంగ్రెస్ పార్టీ చతికిలపడిందని ఆ పదిరోజులలో ఆ పార్టీల నేతలు కొందరు నా దగ్గర అంగీకరించారు కూడా. కానీ ఆ స్థితి నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. ఇటు మోదీ తన ‘కాంగ్రెస్ రహిత భారతం’ నినాదంతో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కూడా విశేషంగా ప్రభావితం చేశారు. ఈ ఎన్నికలలో ఆరెస్సెస్ నిర్వహించిన పాత్ర కూడా గణనీయమైనది. అన్ని నియోజక వర్గాలలోను ఆ సంస్థ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కోస్తా, మధ్య, ముంబై కర్ణాటక ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. హిందూ పార్టీకే ఓటు వేయమని కోరారు. హిందువులు కోసం హిందువులు అన్న కార్డు బాగానే పని చేసిందని ఫలితాలు రుజువు చేశాయి కూడా. బీజేపీకి రాష్ట్రంలో 20,000 వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. తమ రాజకీయ సందేశాన్ని ఓటర్లకు చేరవేసేందుకు వాటిని పార్టీ విశేషంగా ఉపయోగించుకుంది. ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ యడ్డీ ప్లస్ 2 రెడ్డీస్ నినాదాన్ని నమ్ముకుంది. బీజేపీ అవినీతి గురించి అలా ప్రచారం చేయదలిచింది. కానీ హైదరాబాద్–కర్ణాటక ప్రాంత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అవినీతి అనేది అసలు విషయమేకాదని తేలుతుంది. ఇక్కడి నియోజక వర్గాల వ్యవహారం గాలి జనార్దనరెడ్డి, బి. శ్రీరాములు స్వీకరించారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు సంతృప్తికరంగా లేదు. దాదాపు అందరు సిటింగ్ సభ్యులకు టికెట్లు ఇచ్చారు. సిద్ధరామయ్య అనుసరించిన వ్యూహం కూడా విమర్శల పాలైంది. చాముండేశ్వరి నియోజకవర్గం ఆయనకు కలసి రాలేదు. గతంలో తన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన జీటీ దేవెగౌడ చేతిలోనే సిద్ధరామయ్య ఓడిపోయారు. ఇదంతా చూస్తే ఆయన వ్యూహాల మీదే అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ఆయన సురక్షితమైన వరుణ నియోజక వర్గాన్ని తన కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేశారు. అదృష్టవశాత్తు బాదామి నియోజకవర్గంలో కూడా పోటీ చేయడంతో సిద్ధరామయ్య గట్టెక్కారు. ఒక దశలో ఆయన బి.శ్రీరాములుపై వెనుపడిపోయారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ప్రకారం ఇలాంటి పరిస్థితులలో నెపమంతా ఎలాగూ సిద్ధరామయ్య మీదే పడుతుంది. కానీ ఈసారి అలాంటి నెపం వేయడానికి సందేహించనక్కరలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికీ లేనంత అధికారాన్ని సిద్ధరామయ్య దక్కించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అంతా తానే అయి చేశారు. ఎన్నికల కోసం సిద్ధరామయ్య చేసిన ట్వీట్లు పరిహా సానికి గురయ్యాయి. వాటిలో ఆయన ప్రయోగించిన వ్యంగ్యం ఓట్ల రూపం దాల్చలేదు. ప్రధాని మోదీని ‘ఉత్తర భారత బయటి మనిషి’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. తరువాత మోదీ మీద పరువునష్టం దావా దాఖలు చేస్తానని బీరాలు పలికి, తాను సరైన పంథాలో నడవడంలేదని నిరూపించారు. ప్రాంతీయ అస్తిత్వం, లింగాయత్‌లకు వేరే మతం హోదా వంటి చర్యలతో కొద్దిరోజుల క్రితం వరకు ఆయన బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగిన నేతగా కనిపించారు. కానీ ఆయన విభజన రాజకీయాలను ఓటర్లు ఆమోదించలేదు. మళ్లీ తమ పార్టీ మీద ప్రజలలో విశ్వాసం కల్పించడానికి అమిత్‌షా శ్రమించారు. ఎన్నో మఠాలకు తిరిగారు. లింగాయత్, దళిత సాధువులను కలుసుకుని పార్టీకి బలం చేకూర్చే యత్నాలు చేశారు. సిద్ధరామయ్య హిందూమతంలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అని బీజేపీ ప్రచారం చేయగలిగింది. దక్షిణ భారత రాష్ట్రాల విముక్తి కారుకునిగా అవతరించాలన్న కోరి కతో సిద్ధరామయ్య అతిగానే ప్రవర్తించారు. ఉత్తర, దక్షిణ భారత విభజన గురించి మాట్లాడారు. అలాగే బీజేపీయేతర రాష్ట్రాల మీద ఢిల్లీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ మీద కూడా వివక్ష ఆరోపణ గుప్పించారు. తన ఐదేళ్ల పాలనలో ఆయన దళిత వ్యతిరేక, వక్కలిగ వర్గ వ్యతిరేక నాయకునిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో దళిత నాయకుడు జి. పరమేశ్వరను నియమించడానికి విముఖత చూపడం, మరో దళిత నాయకుడు శ్రీనివాస ప్రసాద్ నిష్క్రమణ సిద్ధరామయ్య మీద దళిత వ్యతిరేకి ముద్రను బలోపేతం చేశాయి. నిజానికి 2015లో సిద్ధరామయ్య స్థానంలో దళిత ముఖ్యమంత్రిని నియమించాలన్న వాదన వినిపించింది. ఆ సమయంలో ఆయన తాను కూడా దళితుడనేనని, తాను సైతం సమాజంలో అణగారిన కుటుంబాల నుంచి వచ్చిన వాడినేనని వాదించారు. రాహుల్ మెప్పు కోసం కర్ణాటక ప్రముఖుడు దేవెగౌడను అవమానించడానికి కూడా సిద్ధరామయ్య వెనుకాడలేదు. జనతాదళ్ (ఎస్)ను జనతాదళ్ (సంఘ్ పరివార్) అని కొత్తగా నామకరణం చేశారు. జేడీ(ఎస్), బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని, దేవెగౌడ పార్టీ బీజేపీకి ‘బీటీమ్’ మాత్రమేనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం మాజీ ప్రధానిని కలవర పెట్టింది. ఈ వ్యాఖ్యల వెనుక సిద్ధరామయ్యకు ఒక ఉద్దేశం ఉంది. కాంగ్రెస్, జేడీ(ఎస్)లు శత్రువులుగానే కొనసాగడం, భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి ఎవరూ జేడీ(ఎస్) మద్దతుతో సీఎం అయ్యే అవకాశం రాకుండా చూడడం సిద్ధరామయ్య ఉద్దేశం. సిద్ధరామయ్య 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో బయటి మనిషిగానే మిగిలిపోయారు. 2013లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి సిద్ధరామయ్య ఈ విషయం మీదే పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. కానీ మంగళవారం నాటి ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవెగౌడను ఆశ్రయించింది. ఆయన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే, సిద్ధరామయ్య మాట్లాడినదానిని పట్టించుకోవద్దని దేవెగౌడకు, ఆయన కుమారులకు చెప్పినట్టే ఉంది. అలాగే సిద్ధరామయ్య కాంగ్రెస్ వైఖరికి ఇకపై ప్రాతినిధ్యం వహించబోరని వారికి స్పష్టం చేసినట్టు కూడా ఉంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి సిద్ధరామయ్యను బయటకు నెట్టివేసే ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే. ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు రెండురోజులు గడువు కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి తగినంత ఆధిక్యం లేదు కాబట్టి ఇప్పుడు రాజ కీయ బేరసారాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన పలువురు లింగాయత్ వర్గ శాసనసభ్యులు ఒక వక్కలిగ ముఖ్యమంత్రి కింద పని చేయడానికి సముఖంగా లేరన్నది మరొక అంశం. కాబట్టి బల నిరూపణ సమయంలో శాసనసభ రణరంగంగా మారడానికి అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలలో అసలు లబ్ధిదారు దేవెగౌడ. ఆయనే ఈ మంగళవారాన్ని అసలు మరచిపోలేరు. ఆయన ఒకప్పటి అంతేవాసి, ఇప్పటి శత్రువు సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడారు. తన కుమారుడికి మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. అయితే ఒకటి. కర్ణాటక నాటకం ఇప్పుడే మొదలయింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణం మనుగడ సాగించగలదా? కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మొదటిగా బీజేపీకే గవర్నర్ అవకాశం ఇవ్వక తప్పదు. ఒకవేళ గవర్నర్ కనుక జేడీ (ఎస్), కాంగ్రెస్ సంకీర్ణానికి అవకాశం ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జేడీ (ఎస్)ను చీల్చడానికి బీజేపీ పావులు కదుపుతుంది. టీఎస్ సుధీర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ :tssmedia10@gmail.com -
ఎటూ తేల్చని కర్ణాటక!
ఈ ఏడాది చివరిలో జరగబోయే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకూ... వచ్చే సార్వత్రిక ఎన్నికలకూ రిహార్సల్ అనదగ్గ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు సర్వేలన్నీ కోడై కూసినట్టు చివరకు హంగ్ అసెంబ్లీ తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీలకూ సమానంగా చుక్కలు చూపించారు. ఓట్ల లెక్కింపు సమయంలో క్షణక్షణానికీ పార్టీల తలరాతలు తారు మారవుతున్న తీరు గమనించి కాకలు తీరిన నేతలే గందరగోళంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచార ఘట్టంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాల జాడలు పెద్దగా కనబడకపోయినా కాంగ్రెస్‌కు రెండో స్థానమే రాసిపెట్టి ఉందని మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోయింది. కానీ విస్పష్టమైన మెజారిటీ 112 స్థానాలకు సునాయాసంగా చేరుతుందనుకున్న బీజేపీ చివరాఖరికి 104 స్థానాల దగ్గర నిలిచిపోయింది. హంగ్ అసెంబ్లీ వచ్చినపక్షంలో ‘కింగ్ మేకర్’ కాగలదనుకున్న జనతాదళ్(సెక్యులర్) 37 స్థానాలే లభించినా కాంగ్రెస్ ఇచ్చిన బేషరతు మద్దతుతో ప్రభుత్వానికి సారథ్యంవహించేందుకు సిద్ధపడుతోంది. కానీ ఆ పార్టీ ఏకశిలా సదృశంగా లేదు. పార్టీ అగ్ర నాయకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ వర్గం, ఆయన కుమారులు రేవణ్ణ, కుమార స్వామిలకు చెరో వర్గమూ ఉన్నాయి. ఒకే గొడుగు కింద ఉన్నా ఇలా మూడు ముక్కలాటగా జేడీ (ఎస్) రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు అందరి కళ్లూ రాజ్భవన్నే చూస్తున్నాయి. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కర్ణాటకలో బీజేపీ సాధించిన విజయం ‘అసమానమైనదీ, అసాధారణమైనదీ’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడాన్ని గమనిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ కర్ణాటకను చేజారనీయదని, ఏం చేసైనా దాన్ని తన ఖాతాలో వేసు కుంటుందని స్పష్టంగా అర్ధమవుతోంది. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎదురైన చేదు అనుభవాల పర్యవసానంగా ఈసారి కాంగ్రెస్ చురుగ్గా కదిలింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ‘బీ’ టీమ్‌గా అభివర్ణించిన జేడీ(ఎస్) వద్దకు హుటాహుటీన సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్లను పంపింది. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ వజుభాయ్ వాలా చెబుతున్నారు గనుక కర్ణాటక ఉత్కంఠకు వెంటనే తెరపడే అవకాశం లేదు. ఆయన ఏకైక పెద్ద పార్టీ బీజేపీకి తొలి అవకాశం ఇస్తారా, ఎన్నికల అనంతరం కుదిరిన పొత్తులను పరిగణనలోకి తీసుకుం టారా అన్నది తేలాల్సి ఉంది. గోవా, మణిపూర్, మేఘాలయల్లో ఎన్నికల అనంతర పొత్తుల్ని పరి గణనలోకి తీసుకుని అక్కడి గవర్నర్లు బీజేపీ భాగస్వామ్యం ఉన్న కూటములకు అధికారం కట్టబెట్టారు. ఈ ఫలితాలు ఒకవిధంగా ఆశ్చర్యకరమైనవే. 104 స్థానాలతో అగ్ర స్థానంలో ఉన్న బీజేపీకి పోలైన ఓట్లలో 36.2 శాతం రాగా, 78 స్థానాలతో ఆ పార్టీకి చాలా దూరంగా రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు లభించాయి. అంటే బీజేపీకంటే కాంగ్రెస్‌కే 1.8 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండుచోట్ల పోటీచేయగా సొంత నియోజకవర్గం చాముండేశ్వరిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. గెలిచిన బాదామి నియోజకవర్గంలో స్వల్ప మెజారిటీ లభించింది. అంతేకాదు... ఆయన మంత్రివర్గ సహచరుల్లో 16మంది ఓడిపోయారు. నామమాత్రమే కావొచ్చుగానీ... కాంగ్రెస్ జాతీయ పార్టీ గనుక అభ్యర్థుల ఎంపిక విషయంలో సిద్ధ రామయ్యకు స్వేచ్ఛ లేదు. ఆయనకు ఇష్టమున్నా లేకున్నా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు లభించాయి. బహుశా ఇది కొంప ముంచి ఉండొచ్చు. స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయక పోవడం, ఎవరైనా బలం పుంజుకుంటున్నారని అనుమానం వస్తే పార్టీలో వారి వ్యతిరేకులకు ప్రోత్సాహమీయడం రివాజు. ఇలాంటివన్నీ సిద్ధరామయ్య ఉన్నంతలో అధిగమించి పాలనలో సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన వెనక పటిష్టమైన పార్టీ లేదు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచార సభల వల్ల ఆయనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈసారి రాహుల్ ఎక్కువ ప్రచారసభల్లో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో మెజారిటీ లభిస్తే తానే ప్రధానినవుతానన్న ఆయన ప్రకటన పార్టీకి శిరోభారమైందన్న అభిప్రాయం ఉంది. ఇక లింగాయత్‌లను మైనారిటీ మతంగా పరిగణించాలన్న సిఫార్సు సైతం ఆ పార్టీకి పెద్దగా లాభించినట్టు లేదు. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం విషయంలో చెలరేగిన ఉద్యమం ఆ వర్గాల్లో పార్టీని పటిష్టపరచలేకపోయింది. నిజానికి ప్రచార ఘట్టం తొలి దశలో కాంగ్రెస్ ముందంజలో ఉన్న ఛాయలు కనబడ్డాయి. అయితే నరేంద్ర మోదీ రంగంలోకి దిగాక ఇదంతా మారింది. బీజేపీ వ్యతిరేకత సన్నగిల్లింది. కానీ ఇది ఆ పార్టీని స్పష్టమైన విజేతగా నిలబెట్టలేకపోయింది. కానీ ఆ పార్టీ లక్ష్యం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ మాత్రం నెరవేరింది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పుదుచ్చేరి, పంజాబ్ మినహా ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించినచోట సైతం అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. నరేంద్రమోదీ– అమిత్ షాల నాయకత్వంలోని బీజేపీని ఢీకొనే సత్తా రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌కు లేదని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. బీజేపీని ఎదిరించగలనన్న ధీమాతో అది ఒంటరిగా బరిలో నిలిచి తాను లాభపడకపోగా ఇతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఆదరాబాదరాగా జేడీ(ఎస్)కు సన్నిహితం కావడానికి ప్రయ త్నించిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడితే రెండూ లాభపడేవి. ఇరు పార్టీలకూ కలిసి 54 శాతం ఓట్లు లభించేవి. కర్ణాటకలో బీజేపీకి ఉన్నంతలో అడ్డుకట్ట వేయ గలిగానన్న తృప్తి ఒక్కటే కాంగ్రెస్‌కు మిగిలింది. జాతీయ పార్టీగా తన పాత్ర ముగిసిందని, ప్రాంతీయ పార్టీలతో కలిసి నడిస్తేనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికి మిగులుతుందని ఆ పార్టీ గుర్తించాల్సి ఉంది. -
అంచనాలకు మించి విజయాలు.. అయినా ప్చ్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న ట్రెండ్స్ ప్రకారం కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచి.. సాధారణ మెజారిటీని సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ 122 స్థానాల్లో, కాంగ్రెస్ 58 స్థానాల్లో, జేడీఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తానికి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హంగ్ అసెంబ్లీ వస్తే.. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని పేర్కొన్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి జేడీఎస్ విజయాలు సాధించింది. ఏకంగా ఆ పార్టీ 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించడంతో జేడీఎస్ ప్రభావం పెద్దగా ఉండే అవకాశం కనిపించడం లేదు. మొదట కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి.. హంగ్ అసెంబ్లీని సూచించింది. దీంతో సహజంగానే కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశమున్న జేడీఎస్‌పై అందరి దృష్టి పడింది. దీంతో ఆ పార్టీ మద్దతు కోసం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ రంగంలోకి దిగారు. జేడీఎస్‌ను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పెద్దలు అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్ దేవెగౌడకు ఆఫర్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఇటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హుటాహుటిన బెంగళూరు బయలుదేరడంతో జేడీఎస్‌తో మంతనాల కోసమేనని భావించారు. కానీ కాసేపటిలోనే ఫలితాలు మారడం.. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలోకి రావడంతో జేడీఎస్ కింగ్ మేకర్ ఆశలు గల్లంతయ్యాయి. గతంలో కన్నా ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలుపొందినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం మాత్రం లేకపోయింది. -
హస్త విలాసమా? కమల వికాసమా?
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కన్నడ ఎన్నికల్లో ఓటరు ఎవరికి పట్టం గట్టారనేది తేలిపోనుంది. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైనట్లు హంగ్ అసెంబ్లీ ఏర్పుడుతుందా? అయితే కింగ్‌మేకర్ అనుకుంటున్న జేడీఎస్ మొగ్గు ఎటువైపు ఉంటుంది? ఈ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారా? అని కొంతకాలంగా రాజకీయరంగాన్ని తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి రెండుమూడు గంటల్లోనే ఫలితాలపై కొంతమేర అంచనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. పూర్తి ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడవుతాయని తెలుస్తోంది. అసలైన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుందనేది సుస్పష్టమే అయినా.. జేడీఎస్ గెలుచుకునే సీట్లు కీలకం కానున్నాయి. 222 అసెంబ్లీ సీట్లలో 112 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. దీంతో ఓటరు ఎవరికి ఈ మేజిక్ ఫిగర్‌ను కట్టబెట్టాడన్నదానిపై ఈ ఉత్కంఠ. సీఎం సిద్దరామయ్యేనా? కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మెజారిటీ తెచ్చుకున్నట్లయితే.. 1985 తర్వాత వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేతగా నిలుస్తారు. అయితే సిద్దరామయ్యనే సీఎంగా ఉంచుతారా? లేక 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళితనేతకు సీఎం పదవిని కాంగ్రెస్ అధిష్టానం కట్టబెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ తర్వాత సిద్దరామయ్య ‘దళితనేతపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాన’ంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అదే జరిగితే సిద్దరామయ్యకు లోక్‌సభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర ప్రత్యామ్నాయాలుగా కనబడుతున్నారు. బీజేపీకి నైతిక బలం ఒకవేళ బీజేపీ గెలిస్తే.. అది దక్షిణాదిలో కమలం పార్టీ విస్తరణకు ప్రధాన ద్వారంగా మారనుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ హవా వీచేందుకు మరింత అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కార్యకర్తల్లో నైతికస్థైర్యం పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంపై జేడీఎస్ కూడా ధీమాగా ఉంది. తమ పార్టీ అధినేత కుమారస్వామి కింగ్ మేకర్ కాదని.. కింగ్ అవుతారని పేర్కొంది. ఏదేమైనా మరోసారి దేవేగౌడ కన్నడ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అత్యంత ఖరీదైన ఎన్నికలుగా..! కర్ణాటక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. పార్టీలు, అభ్యర్థులు పోటీలు పడి ఓటర్లపై కాసుల వర్షం కురిపించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరిగిందని ఈ సంస్థ పేర్కొంది. అన్ని పార్టీలూ, వ్యక్తిగతంగా అభ్యర్థులు పెట్టిన ఖర్చు మొత్తంగా రూ. 9,500 కోట్ల నుంచి రూ. 10,500 కోట్లు ఉండొచ్చని సీఎంఎస్ అంచనావేసింది. ‘దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక ఎన్నికల వ్యయం ఆధారంగా 2019 ఎన్నికల్లో రూ.50వేల నుంచి రూ.60వేల కోట్ల ఖర్చు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. 2014లో పార్టీలు రూ.30వేల కోట్లు ఖర్చు చేశాయి’ అని సీఎంఎస్ ప్రతినిధి భాస్కర్ రావు తెలిపారు. ఏమేం జరగొచ్చు...? కర్ణాటకలో ఫలితాల ఆధారంగా అధికారం ఎవరికి దక్కొచ్చన్న అంశంపై వివిధ అంచనాలు చర్చకొస్తున్నాయి. వీటిని ఓసారి గమనిస్తే.. అంచనా–1: కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తే ► ఆ పార్టీకి గొప్ప విజయం అవుతుంది ► రాహుల్ నాయకత్వంపై పార్టీలో విశ్వాసం పెరుగుతుంది ► సిద్దరామయ్య ప్రభావం పెరుగుతుంది ► రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది అంచనా–2: బీజేపీకి సంపూర్ణమెజారిటీ వస్తే ► మోదీ–షా జోడీకి తిరుగుండదు ► మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలకు మరింత ఉత్సాహం ► దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితి ► రాహుల్ గాంధీపై పార్టీలోనూ వ్యతిరేకత అంచనా–3: కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజారిటీ రాని పక్షంలో.. ► సీఎంగా సిద్దరామయ్యను జేడీఎస్ తిరస్కరిస్తుంది ► దళిత సీఎం వేటలో కాంగ్రెస్ అధిష్టానం ► మల్లికార్జున ఖర్గే, పరమేశ్వరల్లో ఒకరికి అవకాశం ► జేడీఎస్ కీలక మంత్రిత్వ శాఖలు కోరే అవకాశం అంచనా–4: బీజేపీ అతిపెద్ద పార్టీగానిలిచి మెజారిటీ రానిపక్షంలో ► మోదీ–షా వ్యూహం పనిచేస్తుంది ► బీజేపీ – జేడీఎస్ కలుస్తాయి ► కుమారస్వామి ఉపముఖ్యమంత్రి అవుతారు ► కాంగ్రెస్ తన అవకాశాల్ని కోల్పోతుంది అంచనా–5: హోరాహోరీ ఉంటే.. ► బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది ► జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ► రిసార్టు రాజకీయాలు కీలకంగా మారతాయి ► జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారుతుంది -
‘మెజారిటీ’ సర్కారే..!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పునిస్తారనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరగటం.. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కర్ణాటక రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరికి మేజిక్ ఫిగర్ దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కన్నడలో ప్రజానాడిపై విడుదలైన ఎనిమిది సర్వేల్లో.. ఆరు బీజేపీవైపు, రెండు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కేవలం మూడు సర్వేలు మాత్రమే ఏకపార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ సంస్థ కాంగ్రెస్ 106 నుంచి 118 సీట్లతో సర్కారు ఏర్పాటుచేస్తుందని పేర్కొనగా.. రిపబ్లిక్–జన్‌కీ బాత్, టుడేస్ చాణక్య సంస్థలు బీజేపీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. యూపీలో గతితప్పిన అంచనాలు గతంలోనూ వివిధ రాష్ట్రాలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించటంలో విజయం సాధించలేకపోయాయి. ఉదాహరణకు, గతేడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ+కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఎస్పీ+కాంగ్రెస్ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు, బీజేపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నా అత్తెసరు మెజారిటీయే ఉంటుందని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓవైపు ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాలు.. కాంగ్రెస్ తరపున సిద్దరామయ్య ఒంటరిగా ప్రతివ్యూహాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ మరొకరికి తీసిపోని విధంగా ప్రచారం చేసింది. మే 15 నాటి ఫలితాలతోనే ఎవరిపై ఎవరిది పైచేయనేది స్పష్టమవుతుంది. సిద్దరామయ్య విశ్వాసం కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్యే కన్నడ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఐదేళ్ల కాలంలో చేపట్టిన పలు పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోవటం, సామాన్యులు, పేదలకోసం ఉద్దేశించిన పథకాలను సరిగ్గా అమలుచేయటమే తనకు మళ్లీ పట్టంగడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కేవలం సిద్దరామయ్య వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమేననేది సుస్పష్టం. కన్నడ గౌరవం, కన్నడ ప్రత్యేక జెండా వంటివి కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్‌కు దూరం కాకుండా చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఐదారు నెలలుగా తమ పార్టీకి 120కి పైగా సీట్లొస్తాయని విశ్వాసంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదు. అటు బీజేపీకి కూడా 2008లో అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు కూడా లేవు. క్షేత్రస్థాయి పనిలో బీజేపీ! కర్ణాటక ఎన్నికలకు కనీసం ఆర్నెల్ల ముందునుంచే బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. బూత్ స్థాయిలో పనిచేసేలా కార్యకర్తలకు శిక్షణనివ్వటం మొదలుకుని ఓటింగ్ రోజు వారిని పోలింగ్ బూత్‌లకు తీసుకురావటం వరకు పకడ్బందీగా నిర్వహించింది. ఈ పనిని అమిత్‌షాయే ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూవచ్చారు. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితా విశ్లేషణ, ఎన్నికల ర్యాలీలు, యాత్రలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇక్కడ తొలిసారి ఓటేస్తున్న వారి సంఖ్య గతంలో కంటె రెట్టింపు కాగా, మహిళాఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ తన ప్రచారంలో యువత, మహిళలను పదేపదే ప్రస్తావించటం వెనక వ్యూహం కూడా ఇదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమిత్ షా సందేశమిస్తూ.. ‘ ఉదయం 10.30 కల్లా ఓటు వేసి.. మిగిలిన వారు ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి’ అని సూచించారు. లింగాయత్‌లు ఎటువైపు? ఈసారి కన్నడ ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించటం. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని సీఎం భావిస్తున్నారు. లింగాయత్‌ల జనాభా ఎక్కువగా ఉండే, సెంట్రల్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్, అంతకుముందు ఒపీనియన్ పోల్స్కూడా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే 10 శాతం లింగాయత్‌లు మినహా మిగిలిన వారంతా బీజేపీతోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరగటం అధికార పార్టీపై వ్యతిరేకతకు సంకేతమని అనుకోవడానిక్కూడా వీల్లేదు. దళిత, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, వక్కలిక ఓట్లు మెజారిటీగా ఉన్న పాత మైసూరు ప్రాంతాలపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. హైదరాబాద్ కర్ణాటకలోనూ బీజేపీనుంచి తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. కోస్తా కర్ణాటకలోనూ బీజేపీయే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
బీజేపీకి 60 నుంచి 65 సీట్లే
సాక్షి, బెంగళూరు: ఇలా పోలింగ్ ముగిసిందో లేదో.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైపోయింది. దాదాపు ప్రధాన ఛానెళ్ల పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడే అవకాశాలే ఉన్నాయని తేల్చి చెప్పేశాయి. అయితే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న ధీమాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తం చేస్తున్నారు. ‘వచ్చే రెండు రోజులు ఎగ్జిట్ పోల్స్ వినోదాన్ని పంచబోతున్నాయి. నదిని ఈదలేనోడు లోతు లెక్కలు చూసుకుని మురిసిపోయాడంట. చివరకు తప్పుడు అంచనాతో నీటిలో మునిగిపోతాడు. కొందరికి(బీజేపీని ఉద్దేశించి) అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది. కాబట్టి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బాధపడాల్సిన పని లేదు. మీ వారాంతాన్ని హాయిగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది’ అంటూ సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మానసికంగా కుంగిపోయి ఉన్నారని, అందుకే 17వ తేదీ ప్రమాణం చేస్తానని ఏదో మాట్లాడుతున్నారంటూ సిద్ధరామయ్య సెటైర్లు పేల్చారు. బీజేపీకి 60-65 సీట్ల కన్నా ఎక్కువ రాబోవని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ప్రీపోల్స్ సర్వేల్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ తప్పదనే సంకేతాలు అందుతుండగా, స్పష్టమైన గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ వేటికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్!
కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధక సంస్థ పీపుల్స్ పల్స్ చెబుతోంది. అత్యధికసీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోనున్నప్పటికీ సంపూర్ణ మెజారిటీ ఆ పార్టీకి రాదనీ, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ ఉంటాయని తమ సర్వేలో తేలినట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. ప్రభుత్వం ఎవరిదో నిర్ణయించే సామర్థ్యం జేడీఎస్‌కు ఉంటుందంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ‘కోలార్ వాణి’ అనే పత్రికతో కలసి కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రీ పోల్ సర్వే నిర్వహించామని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ‘కాంగ్రెస్‌కు 93 నుంచి 103 మధ్య, బీజేపీకి 83–93 మధ్య, జేడీఎస్‌కు 33 నుంచి 43 మధ్య సీట్లు వస్తాయి. ఇతర చిన్నాచితకా పార్టీలు నాలుగు సీట్ల వరకు గెలవొచ్చు. కాంగ్రెస్‌కు 39.6 శాతం, బీజేపీకి 34.2%, జేడీఎస్‌కు 21.6% ఇతర పార్టీలకు మొత్తంగా 4.6 శాతం ఓట్లు రావొచ్చు. కోస్తా కర్ణాటక మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కన్నా కాంగ్రెస్సే ముందంజలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్యపై పెద్ద వ్యతిరేకతేమీ లేదు. ప్రధాని మోదీ ప్రభావం కోస్తా ప్రాంతానికి, బాంబే కర్ణాటకలోని ఒక్క బెళగావి జిల్లాకే పరిమితం. సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని 37%మంది కోరుకుంటున్నారు. 24% మంది యడ్యూరప్పను, 19% మంది కుమారస్వామిని తర్వాతి సీఎంగా చూడాలనుకుంటున్నారు’ అని పీపుల్స్ పల్స్ పేర్కొంది. -
మళ్లీ హంగ్ వస్తుందా ?
సాక్షి, బెంగళూరు : కర్ణాటక 15వ శాసనసభ ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీకి దారితీస్తాయని అత్యధిక సర్వేలు చెబుతున్నాయి. గత 35 ఏళ్లలో రాష్ట్రంలో మూడుసార్లు (1983, 2004, 2008)) మాత్రమే త్రిశంకు సభలు ఏర్పడ్డాయి. తొలి హంగ్అసెంబ్లీ రెండేళ్లు మాత్రమే కొనసాగింది. 14 సంవత్సరాల క్రితం ఏర్పడిన త్రిశంకు సభ నాలుగేళ్లు నడిచింది. మూడో హంగ్అసెంబ్లీ కొద్ది కాలానికే పాలకపక్షమైన బీజేపీకి మెజారిటీ సమకూరడంతో ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 1983 ఎన్నికల తర్వాత ఏర్పడిన హంగ్అసెంబ్లీ కాలాన్ని మినహాయిస్తే మిగిలిన రెండు సార్లూ ముగ్గురు చొప్పున ముఖ్యమంత్రులు మారారు. మరో విశేషమేమంటే, గతంలో త్రిశంకు సభకు దారితీసిన ఎన్నికలకు ముందు మూడు సందర్భాల్లోనూ ఐదేళ్లు పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి లేరు. తొలి ‘హంగ్’తో సీఎం అయిన రామకృష్ణ హెగ్డే! ఆంధ్రప్రదేశ్‌తో పాటు తొలి కాంగ్రెసేతర సర్కారు ఏర్పాటుకు దారితీసిన 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో మొదటి త్రిశంకుసభ ఏర్పడింది. మొత్తం 224 సీట్లున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో అప్పటి పాలకపక్షమైన కాంగ్రెస్ఓడిపోవడమేగాక సీట్ల విషయంలో రెండో పెద్ద పార్టీగా(82) దిగజారింది. ఏ పార్టీకి మెజారిటీరాని ఈ ఎన్నికల్లో జనతాపార్టీ 95 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బయటి నుంచి సీపీఐ, సీపీఎం(మూడేసి సీట్లు), కర్ణాటక క్రాంతిరంగ అనే ప్రాంతీయపక్షం, ఇండిపెండెంట్ల మద్దతుతో జనతాపార్టీ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు రెండేళ్లు ఈ సర్కారు పాలన సాఫీగా సాగాక ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్షమైన జనతాపార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్మూడింటి రెండు వంతులకు పైగా ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో జనతా ఘోర పరాజయంతో విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నానంటూ అసెంబ్లీని రద్దుచేయించి హెగ్డే తాజాగా ప్రజల తీర్పు కోరారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా 139 సీట్లు సంపాదించిగా హెగ్డే మరోసారి సీఎం అయ్యారు. 2004 త్రిశంకు సభతో పార్టీల కుర్చీలాట! కాంగ్రెస్సీనియర్నేత ఎస్ఎం కృష్ణ నాలుగేళ్ల ఏడు నెలలు సీఎంగా కొనసాగాక జరిగిన 2004 ఎన్నికల ఫలితాలు అసలు సిసలు హంగ్అసెంబ్లీకి దారితీశాయి. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి 79 సీట్లు సాధించింది. ఓడిపోయిన పాలకపక్షం కాంగ్రెస్65, జేడీఎస్58 సీట్లు గెల్చుకున్నాయి. మొదట జేడీఎస్‌తో పొత్తుకు బీజేపీ సీనియర్‌నేతలు అరుణ్‌జైట్లీ, ఎం.వెంకయ్య నాయడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్, గౌడ పార్టీ మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. అయితే, తన సామాజికవర్గానికే(ఒక్కళిగ) చెందిన తన రాజకీయ ప్రత్యర్థి కృష్ణకు సీఎం పదవి ఇవ్వడానికి దేవెగౌడ నిరాకరించడంతో ఉత్తర కర్ణాటకకు చెందిన మరో కాంగ్రెస్‌నేత ఎన్.ధరమ్సింగ్ఈ కాంగ్రెస్జేడీఎస్సంకీర్ణానికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు జేడీఎస్‌లో ఉన్న ప్రస్తుత సీఎం సిద్దరామయ్యకి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. తనకు ఎదురు తిరిగిన సిద్ధూను 2005 నవంబర్‌లో గౌడ పదవి నుంచి తప్పించాక కాంగ్రెస్‌తో పెరిగిన విభేదాల ఫలితంగా ఏడాది 8 మాసాలకే జేడీఎస్మద్దతు ఉపసంహరించడంతో ధరమ్సింగ్సర్కారు 2006 జనవరి ఆఖరులో కూలిపోయింది. కుమారస్వామితో చేతులు కలిపిన బీజేపీ రాష్ట్ర జేడీఎస్నేతగా నియమితుడైన దేవెగౌడ కుమారుడు కుమారస్వామి తండ్రి అనుమతి లేకుండా తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతో అవగాహనకు వచ్చారు. బీజేపీ భాగస్వామిగా సంకీర్ణ సర్కారు సీఎంగా 2006 ఫిబ్రవరి మూడున ఆయన ప్రమాణం చేశారు. తన అనుమతి లేకుండా తన కొడుకు కాషాయపక్షంతో చేతులు కలిపారంటూ దేవెగౌడ నెత్తీనోరూ బాదుకున్నారు. తన కళ్ల ముందే తన కొడుకు మతతత్వ పార్టీతో కుమ్మక్కవడం అన్యాయమని కన్నీళ్లు పెట్టుకున్నారు. జేడీఎస్‌కు చెందిన 46 మంది ఎమ్మెల్యేలను చీల్చి కుమారస్వామి బీజేపీతో జతకట్టారు. కొన్నాళ్లుకు సీఎం అయిన తన కుమారుడుకి గౌడ మద్దతు పలకడంతో కథ సుఖాంతమైంది. కాని 20 నెలల తర్వాత సీఎం పదవిని బీజేపీ నేత బీఎస్యడ్యూరప్పకు ఇవ్వాలన్న ఒప్పందానికి కట్టుబడి కుమారస్వామి రాజీనామా చేయకపోవడంతో మళ్లీ సంక్షోభం మొదలైంది. 18 మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేసి, ఆ పార్టీ మద్దతు ఉపసంహరించాక కుమారస్వామి రాజీనామా చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా బీజేపీ యడ్యూరప్ప నేతృత్వంలో ఏర్పాటు చేసిన సర్కారు వారం రోజులకే రాజీనామా చేసింది. ఇలా త్రిశంకు సభకు కారణమైన 12వ అసెంబ్లీ ముగ్గురు ముఖ్యమంత్రులను చూసింది. దాదాపు 190 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత అసెంబ్లీని అప్పటి యూపీఏ కేంద్రసర్కారు రద్దుచేయించి ఎన్నికలు జరిపించింది. ‘త్రిశంకు’గా మొదలైన 13వ అసెంబ్లీ కాలంలో ముగ్గురు బీజేపీ సీఎంలు 2008 మే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు(110) దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. తన పార్టీకి సాధారణ మెజారిటీకి మూడు సీట్లు తగ్గడంతో ఇండిపెండెంట్ల మద్దతుతో యడ్యూరప్ప రెండోసారి మే 30న ముఖ్యమంత్రి అయ్యారు. ‘ఆపరేషన్కమల్’ పేరుతో కొందరు కాంగ్రెస్, జేడీఎస్ఎమ్మెల్యేలతో శాసససభ్యత్వానికి రాజీనామా చేయించి వారిని తన టికెట్‌పై బీజేపీ గెలిపించింది. ఇలా బీజేపీ బలం 113 దాటిపోయింది. సర్కారుపై అవినీతి ఆరోపణలు, బళ్లారి గాలి జనార్దన్‌రెడ్డి సోదరులతో గొడవలు, కీచులాటల ఫలితంగా మూడేళ్ల రెండు నెలల తర్వాత 2011 జులై 11న యడ్యూరప్పను బీజేపీ కేంద్ర నాయకత్వం సీఎం పదవి నుంచి తప్పించింది. ఆయన తర్వాత సీఎం పదవి చేపట్టిన డీవీ సదానంద గౌడ కూడా పార్టీలో ముఠా తగాదాలు కారణంగా ఏడాది నిండకుండానే 2012 జులైలో రాజీనామా చేయాల్సివచ్చింది. ఆయన తర్వాత మూడో బీజేపీ సీఎం అయిన జగదీష్షెట్టర్అసెంబ్లీ పదవీ కాలం పూర్వయ్యే వరకూ అంటే 2013 మే 12 వరకూ కొనసాగారు. 14వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్122 సీట్లు కైవసం చేసుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇలా మూడుసార్లు త్రిశంకు సభలను చూసిన కర్ణాటక ప్రజలు నాలుగోసారి మరో హంగ్అసెంబ్లీకి అనుకూలంగా తీర్పు ఇస్తారా? లేక రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఒకదానికి సంపూర్ణ మెజారిటీ అప్పగిస్తారా? అనే ప్రశ్నలకు ఈ నెల 15 వెలువడే ఫలితాలు జవాబిస్తాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్