సాక్షి, బెంగళూరు: ఇలా పోలింగ్ ముగిసిందో లేదో.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైపోయింది. దాదాపు ప్రధాన ఛానెళ్ల పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడే అవకాశాలే ఉన్నాయని తేల్చి చెప్పేశాయి. అయితే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న ధీమాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తం చేస్తున్నారు.
‘వచ్చే రెండు రోజులు ఎగ్జిట్ పోల్స్ వినోదాన్ని పంచబోతున్నాయి. నదిని ఈదలేనోడు లోతు లెక్కలు చూసుకుని మురిసిపోయాడంట. చివరకు తప్పుడు అంచనాతో నీటిలో మునిగిపోతాడు. కొందరికి(బీజేపీని ఉద్దేశించి) అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది. కాబట్టి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బాధపడాల్సిన పని లేదు. మీ వారాంతాన్ని హాయిగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది’ అంటూ సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మానసికంగా కుంగిపోయి ఉన్నారని, అందుకే 17వ తేదీ ప్రమాణం చేస్తానని ఏదో మాట్లాడుతున్నారంటూ సిద్ధరామయ్య సెటైర్లు పేల్చారు. బీజేపీకి 60-65 సీట్ల కన్నా ఎక్కువ రాబోవని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ప్రీపోల్స్ సర్వేల్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ తప్పదనే సంకేతాలు అందుతుండగా, స్పష్టమైన గెలుపుపై ప‍్రధాన పార్టీలన్నీ వేటికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment