అంతా గవర్నర్‌ విచక్షణేనా? | All the governor discredited ijn karnataka? | Sakshi
Sakshi News home page

అంతా గవర్నర్‌ విచక్షణేనా?

Published Thu, May 17 2018 3:53 AM | Last Updated on Thu, May 17 2018 11:43 AM

All the governor discredited ijn karnataka? - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో హంగ్‌ ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్‌ పాత్ర కీలకంగా మారింది. హంగ్‌ ఏర్పడితే, లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్‌ అధికార పరిధి, నిర్ణయాధికారాలపై కమిషన్లు, నిపుణుల సూచనలు చూద్దాం..

పూంచీ కమిషన్‌ ఏమంది?
ఎన్నికలకు ముందు పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని కూడా రాజకీయ పార్టీగా భావించాలని పూంచీ కమిషన్‌ సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌  ఎవరిని ఆహ్వానించాలో ప్రాధాన్య క్రమంలో వివరించింది. అవి వరుసగా.. 1) పోలింగ్‌కు ముందు ఏర్పడి అధిక సీట్లు గెలుచుకున్న కూటమి 2) ఇతరుల మద్దతున్న అతిపెద్ద పార్టీ 3)పోలింగ్‌ అనంతరం ఏర్పడిన కూటమి 4)ఇతర పార్టీల చేరికతో పోలింగ్‌ అనంతరం ఏర్పడిన కూటమి (స్వతంత్రులు బయటి నుంచి మద్దతు తెలుపుతూ ఉండాలి)

సర్కారియా కమిషన్‌ సిఫార్సు ఏంటి?
ఎక్కువ సీట్లు గెలుచుకున్న కూటమికి గవర్నర్‌ ప్రాధాన్యమివ్వాలని సర్కారియా కమిషన్‌ అభిప్రాయపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో..ప్రాధాన్య క్రమంలో 1)పోలింగ్‌కు ముందు కుదిరిన కూటమి 2) సరిపడా మద్దతు కూడగట్టే అవకాశాలున్న అతిపెద్ద పార్టీ 3)పోలింగ్‌ తరువాత ఏర్పడిన కూటమి (సంఖ్యాబలముంటేనే) 4) బయటి నుంచి మద్దతు ఉందని, విశ్వాస పరీక్షకు 30 రోజుల గడువు కోరిన
కూటమిని ఆహ్వానించాలంది.  

ఒక్కొక్కరిది ఒక్కో శైలి: నారిమన్‌
కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితి భారత్‌కు కొత్త కాదని ప్రముఖ న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్‌ అభిప్రాయపడ్డారు. దీన్ని ‘అతిపెద్ద పార్టీ వర్సెస్‌ పోలింగ్‌ అనంతర కూటమి’ కేసుగా వర్ణించారు. పార్టీ ఫిరాయింపులు, అనైతిక బేరసారాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గవర్నర్లు అంతా తమ విచక్షణాధికారాలను ఒకే రకంగా వినియోగించరని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కొందరు అతిపెద్ద పార్టీని, మరికొందరు అతిపెద్ద కూటమిని ఆహ్వానిస్తారని తెలిపారు.

తేలాల్సింది సభలోనే: సుభాష్‌ కశ్యప్‌
ప్రభుత్వం ఏర్పాటుచేయమని ఎవరినైనా అడిగే అధికారం గవర్నర్‌కు ఉందని, ఆ నిర్ణయాన్ని కోర్టులోనూ సవాలుచేయరాదని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ కశ్యప్‌ తెలిపారు. అయితే గవర్నర్‌ సీఎంగా నియమించిన వ్యక్తి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని, గవర్నర్‌ ముందు సభ్యుల పరేడ్‌ నిర్వహిస్తేనో, ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లుగా లేఖలు చూపితేనో సరిపోదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement