బెంగళూరు: రాజీనామా చేసే ముందు, సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాజీనామా చేయడం తథ్యమని నిర్ణయించుకున్న తరువాత చేసిన ఈ వీడ్కోలు ప్రసంగంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. అధికారంలో కొనసాగితే రైతు సంక్షేమం కోసం పాటు పడ్తామనుకున్నానని, అది సాధ్యం కాకపోతున్నందుకు బాధపడ్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు అతిపెద్ద పార్టీగా బీజేపీకే పట్టం కట్టారని, కాంగ్రెస్, జేడీఎస్ కుట్రపూరితంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడి ప్రజాతీర్పును కాలరాశాయన్నారు. అయినా, రాష్ట్రాభివృద్ధికోసం కలసి వస్తారన్న ఆశతో కొందరు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తాననుకున్నానన్న యడ్యూరప్ప.. ఆశించినవన్నీ జరగవు కదా! అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కాంగ్రెస్–జేడీఎస్ అవకాశవాద కూటమి. కుట్ర చేసి ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. మీరు ఎమ్మెల్యేలను బంధించారు. పాపం వారు తమ కుటుంబసభ్యులతోనూ మాట్లాడుకోకుండా చేశారు. మీ ఎమ్మెల్యేలంతా వాళ్ల కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం దక్కినందుకు ఇవాళ సంతోషంగా ఉండుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇది వాస్తవం. ఆత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని వారిని కోరాను. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న పార్టీ.
అందుకే ఆ ఎమ్మెల్యేలు నేటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని వారితో అన్నాను. కొందరు ఇందుకు అంగీకరించారు కూడా. కాంగ్రెస్‌కు గానీ, జేడీఎస్‌కు గానీ ప్రజామోదం దక్కలేదనేది వాస్తవం. అతిపెద్ద పార్టీగా నిలిచినందునే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించారు. నావి ప్రజా రాజకీయాలు. ఇకపైనా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈ విశ్వాస పరీక్షను అగ్నిపరీక్షలా భావించాను. ఇదేం తొలిసారి కాదు. నా జీవితమంతా అగ్నిపరీక్షే. ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం అనుకునేది వేరు. దేవుడి ఆలోచన వేరు’ అని వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
‘నా చివరి శ్వాస వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఇక కర్ణాటక రాష్ట్రమంతా పర్యటిస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలను, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను బీజేపీ గెలుచుకోవటంలో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తా. నేను పోరాడుతూనే పైకొచ్చాను. నాకు అధికారం ఇవ్వకపోతే చనిపోతానని ఒకరు (కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ)చెప్పారు. నాకు అధికారం దక్కినా, దక్కకపోయినా నేను మాత్రం అలా అనను. మన కాంగ్రెస్ మిత్రుల కుట్ర కారణంగా ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగుతాను. గవర్నర్ దగ్గరికెళ్లి రాజీనామా సమర్పించబోతున్నాను’ అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌తో కరచాలనం చేసి సభ నుంచి యడ్యూరప్ప బయటకెళ్లారు.
నాడు వాజ్‌పేయి..నేడు యడ్యూరప్ప!
అది 1996.. కేవలం 13రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందు ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. నాటి ప్రసంగాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారంలో అందించటంతో దేశ ప్రజల మనసుల్లో అది చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సుదీర్ఘ, ఉద్వేగపూరిత ప్రసంగంతో సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయినా.. దేశ ప్రజల నమ్మకాన్ని వాజ్‌పేయి చూరగొన్నారు. ‘నేను పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి విపక్షాలకు చురకలు అంటించా రు. శనివారం నాడు అసెంబ్లీలోనూ యడ్యూరప్ప ఇదే రీతిలో మాట్లాడారు. ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినా నా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment