B S Yeddyurappa
-
Karnataka: కౌన్ బనేగా కర్ణాటక సీఎం?
తమకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం కర్ణాటక పౌరుల మెదళ్లను తొలచేస్తోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే సత్తా ఉన్న నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ వర్గాల నుంచి బలమైన నేతను నేనేనంటూ చాలా మంది ముందుకొచ్చినా.. బీజేపీ ఢిల్లీ నాయకత్వం కొందరి పేర్లనే పరిశీలనలోకి తీసుకుందని సమాచారం. నిఘా వర్గాలు, ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్ సీనియర్ సలహాదారులు,ఆర్ఎస్ఎస్, ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారుల నుంచి తెప్పించిన నివేదికలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె తుది నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. లింగాయత్, ఒక్కలిగ ఇలా ఒక వర్గం వ్యక్తికే సీఎం పదవి ఇస్తున్నామనేలా కాకుండా విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎంపికచేయాలని పార్టీ భావిస్తోంది. సీఎం పదవి వరించే అవకాశముందని పేర్లు వినిపిస్తున్న వారిలో ముఖ్యల గురించి క్లుప్తంగా.. బసవరాజ్ బొమ్మై(61) ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రి అయిన బసవరాజ్ సోమప్ప బొమ్మై.. యడియూరప్పకు అత్యంత దగ్గరి వ్యక్తి. లింగాయత్. మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడైన బసవరాజ్ కూడా ‘జనతా పరివార్’కు చెందినవారే. 2008లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగానూ చేశారు. మురుగేశ్ నిరానీ(56) ప్రస్తుతం గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. లింగాయత్‌లలో ప్రముఖమైన పంచమ్శాలీ లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. వృత్తిపరంగా పారిశ్రామికవేత్త అయిన ఈయనకు చెందిన విద్యుత్, చక్కెర తదితర పరిశ్రమల్లో లక్షకుపైగా కార్మికులు ఉన్నారు. హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. అరవింద్ బెల్లాద్(51) ఉన్నత విద్యను అభ్యసించిన అరవింద్ బెల్లాద్కు నేతగా మంచి పేరుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ చట్టసభ్యుడైన చంద్రకాంత్ బెల్లాద్ కుమారుడే ఈ అరవింద్. ఆర్ఎస్ఎస్ మూలాలున్న అరవింద్‌కు యువనేతగా కర్ణాటకలో ఏ అవినీతి మచ్చాలేని రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు. బసన్నగౌడ పాటిల్(57) విజయపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బసన్నగౌడ గతంలో కేంద్రంలో టెక్స్టైల్స్, రైల్వే శాఖల సహాయమంత్రిగా చేశారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన గతంలో రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎంఎల్సీగానూ పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో పంచమశాలీ లింగాయత్‌లనూ బీసీలుగా గుర్తించాలని, రిజర్వేషన్ కల్పించాలని జరిగిన ఉద్యమానికి సారథ్యం వహించారు. సీటీ రవి(54) బీజేపీ ప్రస్తు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీటీ రవి ఒక్కలిగ వర్గానికి చెందిన నేత. సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తి. బీజేపీ జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ బీఎల్.సంతోష్‌కు బాగా సన్నిహితుడు. కర్ణాటకలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా రాజీనామా చేసి కేంద్రంలో పార్టీ పనుల్లో క్రియాశీలకంగా మారారు. సీఎన్ అశ్వథ్ నారాయణ్(52) కర్ణాటక డెప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు. వైద్యవిద్యను అభ్యసించిన సీఎన్ అశ్వథ్ నారాయణ్ ఆధునిక భావాలున్న వ్యక్తి. 2008 నుంచి మల్లేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి పార్టీ.. ఒక్కలిగ వర్గానికి చెందిన ఈయనను డిప్యూటీ సీఎంను చేసింది. ప్రహ్లాద్ జోషి(58) కేంద్ర బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ వర్గానికి చెందిన సీనియర్ నేత. ధర్వాడ్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రధాని మోదీకి దగ్గరి వ్యక్తిగా పేరుంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈయనకు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆర్ఎస్ఎస్ వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు చక్కబెడతారని ఈయనకు పేరుంది. విశ్వేశ్వర హెగ్డే కగెరి(60) ప్రస్తుతం సిర్సి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వేశ్వర హెగ్డే కగెరి ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయన ఏబీవీపీ విద్యార్థి నేతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
దిగిపోక తప్పదు!
బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి తాను దిగిపోవడం తప్పదన్న సంకేతాలను కర్ణాటక సీఎం బి.ఎస్.యడియూరప్ప(78) ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పుపై ఆయన తొలిసారిగా గురువారం నోరు విప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వ నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును ఈ నెల 25వ తేదీన బీజేపీ నాయకత్వం ఖరారు చేయనుందని పేర్కొన్నారు. పార్టీ పెద్దల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని ఈ నెల 26న పూర్తి చేసుకోనున్నారు. ఇతరులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలో అధిష్టానానికి చెప్పానన్నారు. మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం ‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నాపై ప్రత్యేకమైన ప్రేమ, విశ్వాసం ఉన్నాయి’ అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేసి, మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తలెవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని, అందరూ తనకు సహకరించాలని కోరారు. అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. తనకు అనుకూలంగా ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని చెప్పారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. వెల్లువెత్తుతున్న సంఘీభావం సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పదని యడియూరప్ప చెబుతుండగా, మరోవైపు ఆయనకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. మఠాలు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు ఆయనకు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వీరశైవ–లింగాయత్ సామాజికవర్గం నేతలు యడియూరప్పకు అండగా నిలుస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అఖిల భారత వీరశైవ మహాసభ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆయనను పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్పే: బీజేపీ
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమ రాజీనామాల గురించి నివేదించడమే కాకుండా తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రాజీనామాలు ఆమోదం పొందితే కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. ఈ నేపథ్యంలో రాజీనామాలపై స్పీకర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజీనామాల అంశాన్ని ఆయన సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే.. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆహ్వానిస్తే.. బీజేపీ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పేర్కొంటూ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తమకుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే.. ముఖ్యమంత్రిగా యడ్యూరప్పే ఉంటారని సదానంద స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు.. వారి రాజీనామాలను సదానంద సమర్థించారు. -
షాకిచ్చిన ప్రభుత్వం.. హుందాగా మాజీ సీఎం!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్పకు హెచ్డీ కుమారస్వామి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. అయితే యెడ్డీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించి తన గౌరవాన్ని కాపాడుకున్నారని తెలుస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప రేస్‌కోర్స్ రోడ్డులోని నంబర్2 ఇంట్లో ఉండేవారు. అయితే కొన్ని రోజుల కిందట ప్రతిపక్షనేతగా తనకు ఆ ఇంటిని తిరిగి కేటాయించాలని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తిచేశారు. కానీ కుమారస్వామి ప్రభుత్వం యెడ్డీకి అదే రోడ్డులోని నంబర్ 4 ఇంటిని కేటాయించింది. బీజేపీ నేత అడిగిన ఇంట్లో ప్రస్తుతం మంత్రి మహేష్ ఉంటున్నారు. దీంతో యెడ్డీకి వేరే ఇంటిని ఇవ్వగా అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘మిత్రులారా.. నేను ఆ ఇంటిని కేటాయించాలని చాలాకాలం కిందటే కోరాను. కానీ నాకు అందుకు అవకాశం ఇవ్వలేదు. నా సొంత ఇంట్లోనే ఉంటాను. ప్రస్తుతం నాకు కేటాయించిన నంబర్ 4 ఇంటిని వేరే నేతకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. దీనిపై ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షనేతగా తనను గౌరవం ఇచ్చేందుకైనా గతంలో ఉన్న ఇంటిని కర్ణాటక ప్రభుత్వం తనకు కేటాయిస్తుందని యడ్యూరప్ప ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సమాచారం. బంగ్లా కేటాయింపు వివాదంపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. యడ్యూరప్పకు ఓ నివాసాన్ని కేటాయించాం. కచ్చితంగా ఆయన బంగ్లానే కేటాయించాలంటే కష్టం. చాలామంది మంత్రులు అదే ఇంటిని అడుగుతున్నారు. ఒకరికి ఆ ఇంటిని కేటాయించామని’ వివరించారు. -
గెలుస్తాననుకున్నా..!
బెంగళూరు: రాజీనామా చేసే ముందు, సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాజీనామా చేయడం తథ్యమని నిర్ణయించుకున్న తరువాత చేసిన ఈ వీడ్కోలు ప్రసంగంలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై విమర్శలు గుప్పించారు. అధికారంలో కొనసాగితే రైతు సంక్షేమం కోసం పాటు పడ్తామనుకున్నానని, అది సాధ్యం కాకపోతున్నందుకు బాధపడ్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు అతిపెద్ద పార్టీగా బీజేపీకే పట్టం కట్టారని, కాంగ్రెస్, జేడీఎస్ కుట్రపూరితంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడి ప్రజాతీర్పును కాలరాశాయన్నారు. అయినా, రాష్ట్రాభివృద్ధికోసం కలసి వస్తారన్న ఆశతో కొందరు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తాననుకున్నానన్న యడ్యూరప్ప.. ఆశించినవన్నీ జరగవు కదా! అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కాంగ్రెస్–జేడీఎస్ అవకాశవాద కూటమి. కుట్ర చేసి ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు. మీరు ఎమ్మెల్యేలను బంధించారు. పాపం వారు తమ కుటుంబసభ్యులతోనూ మాట్లాడుకోకుండా చేశారు. మీ ఎమ్మెల్యేలంతా వాళ్ల కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం దక్కినందుకు ఇవాళ సంతోషంగా ఉండుంటారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు విపక్ష ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇది వాస్తవం. ఆత్మ ప్రబోధం మేరకే ఓటేయాలని వారిని కోరాను. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉన్న పార్టీ. అందుకే ఆ ఎమ్మెల్యేలు నేటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను. కేంద్రంలో మోదీ ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని వారితో అన్నాను. కొందరు ఇందుకు అంగీకరించారు కూడా. కాంగ్రెస్‌కు గానీ, జేడీఎస్‌కు గానీ ప్రజామోదం దక్కలేదనేది వాస్తవం. అతిపెద్ద పార్టీగా నిలిచినందునే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించారు. నావి ప్రజా రాజకీయాలు. ఇకపైనా నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఈ విశ్వాస పరీక్షను అగ్నిపరీక్షలా భావించాను. ఇదేం తొలిసారి కాదు. నా జీవితమంతా అగ్నిపరీక్షే. ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అడుగడుగునా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం అనుకునేది వేరు. దేవుడి ఆలోచన వేరు’ అని వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు ‘నా చివరి శ్వాస వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటా. ఇక కర్ణాటక రాష్ట్రమంతా పర్యటిస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలను, అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను బీజేపీ గెలుచుకోవటంలో చిత్తశుద్ధితో పనిచేస్తా. ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తా. నేను పోరాడుతూనే పైకొచ్చాను. నాకు అధికారం ఇవ్వకపోతే చనిపోతానని ఒకరు (కుమారస్వామి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ)చెప్పారు. నాకు అధికారం దక్కినా, దక్కకపోయినా నేను మాత్రం అలా అనను. మన కాంగ్రెస్ మిత్రుల కుట్ర కారణంగా ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై ప్రజల వద్దకు వెళ్లి న్యాయం అడుగుతాను. గవర్నర్ దగ్గరికెళ్లి రాజీనామా సమర్పించబోతున్నాను’ అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సందర్శకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌తో కరచాలనం చేసి సభ నుంచి యడ్యూరప్ప బయటకెళ్లారు. నాడు వాజ్‌పేయి..నేడు యడ్యూరప్ప! అది 1996.. కేవలం 13రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందు ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. నాటి ప్రసంగాన్ని డీడీ ప్రత్యక్ష ప్రసారంలో అందించటంతో దేశ ప్రజల మనసుల్లో అది చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈ సుదీర్ఘ, ఉద్వేగపూరిత ప్రసంగంతో సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయినా.. దేశ ప్రజల నమ్మకాన్ని వాజ్‌పేయి చూరగొన్నారు. ‘నేను పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి విపక్షాలకు చురకలు అంటించా రు. శనివారం నాడు అసెంబ్లీలోనూ యడ్యూరప్ప ఇదే రీతిలో మాట్లాడారు. ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినా నా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. -
ఢీ కొట్టని యెడ్డీ..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో ఐదురోజుల సస్పెన్స్‌కు తెరపడింది. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. కీలకమైన విశ్వాసపరీక్షకు ముందు బల నిరూపణ చేసుకోలేకపోతున్నానంటూ రాజీనామా చేశారు. గవర్నర్ వజూభాయ్ వాలా బలనిరూపణ కోసం యెడ్డీకి 15 రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్–జేడీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు శనివారం సాయంత్రమే విశ్వాసపరీక్ష జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండానే.. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగింది. సభలో ఉద్వేగ భరిత ప్రసంగం చేసిన యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని బీజేపీయేతర విపక్ష నేతలు పేర్కొన్నారు. అనంతరం మమతా బెనర్జీ సహా వివి ధ పార్టీల అధ్యక్షులు కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు ఫోన్లో అభినందనలు తెలిపారు. కాగా, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు రావాలంటూ.. జేడీఎస్ నేత కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మమత, కేసీఆర్, చంద్రబాబు తదితరులను కుమారస్వామి ఆహ్వానించారు. ఉదయం నుంచీ ఉత్కంఠ శనివారం ఉదయం నుంచీ బెంగళూరులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో బసచేసిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఉదయమే వేర్వేరు బస్సుల్లో బెంగళూరులోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో వీరిని పటిష్టమైన భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అక్కడ ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య.. ఎన్నికైన అందరు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదంతా జరుగుతుండగానే.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ మిత్రులైన బీజేపీ సభ్యులతోనూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ హోటల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక భద్రత నడుమ అసెంబ్లీకి తీసుకొచ్చారు. అనంతరం సిద్దరామయ్య కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ చేశారు. మరోవైపు, వీలైనంత ఎక్కువ మందిని లాగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా.. ఓ గంటముందు నుంచీ బీజేపీలో విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది. యడ్యూరప్పే రంగంలోకి దిగినా.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పటినుంచీ విశ్వాస పరీక్షలో గెలుస్తామంటూ యడ్యూరప్ప ధీమాగా కనిపించారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన గానీ, బీజేపీ నేతలు గానీ పరీక్షలో నెగ్గటంపై నమ్మకంగా కనిపించలేదు. బలపరీక్షలో నెగ్గేందుకు ఏడుగురు అదనపు ఎమ్మెల్యేల బలం అవసరం ఉండగా.. జేడీఎస్, కాంగ్రెస్ కూటమిలోని ఎమ్మెల్యేలను ఒప్పించటంలో యడ్యూరప్ప బృందం విఫలమైంది. యడ్యూరప్పే స్వయంగా రంగంలోకి దిగి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడినా పెద్దగా లాభం లేకపోయింది. కూటమి ఎమ్మెల్యేల్లో యెడ్డీ సహా పలువురు బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియో టేపులను కాంగ్రెస్ విడుదల చేయటం సంచలనం రేపింది. వారికి మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప స్వయంగా భరోసా ఇవ్వడంతో బలనిరూపణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ బంధించిందని ఆరోపణలు రాగా.. ఈయన సరిగ్గా యడ్యూరప్ప ప్రసంగానికి ముందు సభలో ప్రవేశించారు. అసెంబ్లీలో ప్రకటన అనంతరం రాజ్‌భవన్ చేరుకున్న యడ్యూరప్ప.. గవర్నర్ వజూభాయ్ వాలాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. యెడ్డీ రాజీనామాతో జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు (కాంగ్రెస్ మద్దతుతో) చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన 221 సీట్లలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి 117 ఎమ్మెల్యేల బలముంది. న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు: ఆజాద్ గులాంనబీ ఆజాద్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ‘గవర్నర్ మా రెండు పార్టీలను (జేడీఎస్, కాంగ్రెస్) చీల్చేందుకు యడ్యూరప్పకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ.. ఎమ్మెల్యేల బేరసారాలు జరగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా న్యాయవ్యవస్థ వ్యవహరించినందుకు కృతజ్ఞతలు’ అని ఆజాద్ పేర్కొన్నారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన యడ్యూరప్ప 2007లో ఏడు రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అనంతరం 2008లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాక దాదాపు మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదురోజుల సస్పెన్స్ మే 15న వెల్లడైన ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో కన్నడ నాట అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఫలితాలు వెలువడుతుండగానే జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవటంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. కూటమి కంటే ముందే యడ్యూరప్ప గవర్నర్‌ను కలసి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరారు. అటు, మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువమందే తమకు మద్దతుగా ఉన్నారంటూ జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలసి తమ ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చారు. కొంత సమయం తీసుకున్న గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టి.. మరునాడు జరగాల్సిన యెడ్డీ ప్రమాణస్వీకారాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తమ అభ్యర్థులు చేజారకుండా బౌన్సర్లతో పటిష్టమైన భద్రత నడుమ రిసార్టులు, హోటళ్లలో వారిని ఉంచింది. అయితే.. యెడ్డీ ప్రమాణస్వీకారానికి అడ్డుతగలబోమన్న సుప్రీంకోర్టు.. శనివారం సాయం త్రం 4కు బలనిరూపణ జరగాల్సిందేనని ఆదేశించింది. దీంతో రాత్రికి రాత్రి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారమంతా వీరితో సమావేశమై విశ్వాస పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. అయినా ఇరు పార్టీల నేతలకు మనస్సులో ఎక్కడో శంక. తమ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారతారన్న అనుమానం వెంటాడా యి. కానీ శనివారం అసెంబ్లీలో ఎలాంటి నిరసనలు లేకుండానే యడ్యూరప్ప రాజీనామాను ప్రకటించటంతో ఐదురోజుల థ్రిల్లర్ ప్రస్తుతానికి ముగిసినట్లే కనబడుతోంది. -
తాత్కాలిక స్పీకర్‌పై తకరారు!
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నాయకత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహణకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేజీ బోపయ్యను గవర్నర్ వజూభాయ్ వాలా నియమించడంతో ప్రొటెం స్పీకర్ నియామకం, పాత్రపై చర్చ మొదలైంది. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ నియామకానికి అనుసరించే పద్ధతులనే శాసనసభ ప్రొటెం స్పీకర్ విషయంలోనూ పాటిస్తారు. ప్రొటెం స్పీకర్ పదవికి సీనియర్ సభ్యుడిని నియమిస్తారు. లోక్‌సభకైతే పార్లమెంటు సభా వ్యవహారాల విభాగం, అసెంబ్లీకైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందించి పంపితే ఆయా ప్రభుత్వాలు ఒకరిని ఎంపిక చేస్తాయి. లోక్‌సభకైతే ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి, అసెంబ్లీకైతే ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ నియమించి ప్రమాణం చేయిస్తారు. సంప్రదాయంగా దీన్ని పాటిస్తున్నారు. అత్యధిక సీనియర్ అయిన సభ్యుడినే ఈ పదవికి నియమించాలనే నిబంధనలేమీ లేవు. ప్రొటెం స్పీకర్ ప్రధాన విధులు కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతోపాటు, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం లేదా మరణించడం జరిగితే కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారీ చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనని ఆయన వివరించారు. నెలలో ముగ్గురు ప్రొటెంలు ఆంధ్రప్రదేశ్‌లో 1984 ఆగస్ట్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ తర్వాత గద్దెనెక్కిన నాదెండ్ల భాస్కరరావు సర్కారు బలపరీక్ష సమయంలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రొటెమ్ స్పీకర్లు(నెల రోజుల్లో)గా పనిచేశారు. అప్పటి స్పీకర్ తంగి సత్యనారాయణ, డెప్యూటీ స్పీకర్ ఎ.భీమ్‌రెడ్డి రాజీనామా చేసి నాదెండ్ల కేబినెట్లో చేరడంతో సభా నిర్వహణకు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. బాగారెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. సభలో రోజూ రభస జరగడంతో బాగారెడ్డి రాజీనామా చేశారు. తర్వాత ఎంఐఎం నేత సుల్తాన్సలాహుద్దీన్ ఒవైసీని ఈ పదవిలో నియమించగా ఆయన నాదెండ్లకు సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తూ సభలో గొడవలను అదుపు చేయలేకపోయారనే ఆరోపణలొచ్చాయి. ఫలితంగా ఆయనను గవర్నర్తొలగించారు. నెల తర్వాత మళ్లీ సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ సర్కారు బలపరీక్ష నిర్వహణకు నియమితుడైన సీనియర్ సభ్యుడు పి.మహేంద్రనాథ్ ప్రొటెం స్పీకర్‌గా ఆ పని పూర్తి చేశారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టార్గెట్ 150 !
కాంగ్రెస్ రహిత కర్ణాటకనే ధ్యేయం ఈ రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం రాష్ట్ర స్థాయి కార్యాచరణ సమావేశంలో బీజేపీ తీర్మానం బెంగళూరు: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణను రూపొందించింది. అధికార పార్టీ కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకలించి ‘కాంగ్రెస్ ముక్త కర్ణాటక’ లక్ష్యంగా నగరంలో శనివారం కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను గెలుచుకొని స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఈ సమావేశంలో తీర్మానించింది. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం నిర్వహించిన మొదటి కార్యాచరణ సమావేశంలో రాష్ట్రంలో బీజేపీని మరింత పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చించారు. ఈ కార్యక్రమానికి బి.ఎస్.యడ్యూరప్ప అధ్యక్షత వహించారు. ఇక కాంగ్రెస్ పాలనా వ్యవధి మరో రెండేళ్లలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. హోబళి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విడతల వారీగా సర్కారు వైఫల్యాలపై పోరాటాలు నిర్వహించాలని తీర్మానించారు. ఇదే సందర్భంలో కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, విజయాలను సైతం రాష్ట్రంలోని ప్రతీ గడపకు తీసుకెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించారు. గతంలో బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, నేతల మధ్య ఏర్పడిన బేధభావాలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరంపై సైతం సమావేశంలో చర్చించినట్లు సమాచారం. తద్వారా తామంతా ఐకమత్యంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని బీజేపీ నాయకులు తీర్మానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, జీఎం సిద్ధేశ్వర్, పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు, పార్టీ నేతలు జగదీష్ శెట్టర్, శోభాకరంద్లాజే, సి.టి.రవి, అరవింద లింబావళి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ పదాధికారులు పాల్గొన్నారు. -
షా చాణక్యం.. యడ్డీకే 'కర్ణాటక' పట్టం
న్యూఢిల్లీ/ బెంగళూరు: సంస్థాగతంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బలమైన లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పకే బీజేపీ చీఫ్ పదవి దక్కింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అనంతరం యడ్డీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్ణాటకతోపాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే కర్ణాటక అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించింది. యడ్యూరప్పను అధ్యక్షుణ్ని చేసేందుకు అమిత్ షా గొప్ప చాణక్యమే నెరపాల్సివచ్చింది. నిజానికి యడ్డీకి మోదీ, షాలతో సత్సంబంధాలు లేవు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన యడ్డీ.. పార్టీ కురువృద్ధుడు అద్వానీకి వీర విధేయుడు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీలో నెలకొన్న తాజా పరిస్తితులు, బీజేపీ నుంచి దూరమై సొంతకుంపటి పెట్టుకోవటం వల్ల ఒరిగేదేమీ ఉండదని తెలిసిరావటం యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరేలా చేశాయి. మరోవైపు కేసుల విషయంలోనూ యడ్డీకి హైకోర్టులో ఊరట లభించింది. యడ్డీపై విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతి చెల్లదని జనవరిలో కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. దీంతో అధ్యక్ష పదవి చేపట్టేందుకు యడ్డీకి ఉన్న కేసుల అడ్డంకి కూడా తొలిగిపోయినట్లయింది. గనులు, భూముల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ యడ్డీ సహా ఆయన మంత్రివర్గంలోని పలువురిపై నాటి లోకాయుక్త తీవ్ర ఆరోపణలు చేయడం, యడ్యూరప్ప ఏడాదిన్నరపాటు జైలులో గడపటం తెలిసిందే. తిరిగి పార్టీలోకి వచ్చిన యడ్డీకి సారధ్యబాధ్యతలు అప్పగించేవిషయంలో సీనియర్ నాయకులైన సీటీ రవి, నళిన్ కుమార్ కటేల్, ఆర్.అశోక్ ల పేర్లతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే యడ్డీతో పోల్చుకుంటే మిగతా ఎవ్వరికీ పేద, మధ్యతరగతి వర్గాల్లో పట్టులేదు. అందుకు చిన్న ఉదాహరణ ఇటీవల జరిగన బీజేపీ రైతు యాత్ర. కాంగ్రెస్ పాలనలో రైతుల దీన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారంటూ బీజేపీ చేపట్టిన యాత్రకు మొదట్లో అంతగా స్పందనరాలేదు. ఎప్పుడైతే యడ్యూరప్ప రంగప్రవేశం చేశారో, అప్పటినుంచి యాత్ర స్వరూపమే మారిపోయింది. పెద్దెసంఖ్యలో జనం బీజేపీ యాత్రకు హాజరవుతున్నారు. ' ఒకవేళ ఇంకో నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే 2018లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేం కానీ యడ్యూరప్పకు ఇస్తే మాత్రం తప్పక ప్రభావం ఉంటుంది' అని అమిత్ షా బలంగా నమ్మటంవల్లే యడ్డీకి పదవి దక్కిందని, యడ్యూరప్ప ఆ నమ్మకాన్ని నిజం చేయగల సత్తాఉన్న నేత అని బీజేపీ నాయకులు అంటున్నారు.