
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమ రాజీనామాల గురించి నివేదించడమే కాకుండా తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రాజీనామాలు ఆమోదం పొందితే కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. ఈ నేపథ్యంలో రాజీనామాలపై స్పీకర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజీనామాల అంశాన్ని ఆయన సోమవారానికి వాయిదా వేశారు.
మరోవైపు ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే.. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆహ్వానిస్తే.. బీజేపీ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పేర్కొంటూ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తమకుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే.. ముఖ్యమంత్రిగా యడ్యూరప్పే ఉంటారని సదానంద స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు.. వారి రాజీనామాలను సదానంద సమర్థించారు.