నారాయణపూర్, హోస్పేట ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో.. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన తెలుగు ప్రజలు చేసే వ్యవసాయంతో కళకళలాడుతూ కనిపించే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు రాజకీయంగా చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి కనిపించకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయాభివృద్ధి కనిపిస్తుంది.
రాయచూర్ (పట్టణ), రాయచూర్ (గ్రామీణ), సింధనూర్, మస్కి, మాన్వి, దేవదుర్గం, లింగుసూగుర్ నియోజకవర్గాలున్న రాయచూర్ జిల్లాలో.. ఈసారి ఎన్నికల్లో అనేక రాజకీయ, సామాజిక అంశాలు ప్రభావం చూపనున్నాయి. లింగాయత్, వాల్మీకి (నాయక్)లతోపాటు తెలుగు ప్రజలు ఇక్కడ ఎక్కువ. రెండు నియోజకవర్గాల్లో అయితే తెలుగు ప్రజలే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఇది.
రాయచూర్ పట్టణ (అర్బన్)
రాయచూర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన శివరాజ్‌పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ మహ్మద్‌షా ఆలం, జేడీఎస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్, ఈడిగ సామాజిక వర్గానికి చెందిన వినయ్‌కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పాటిల్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీ పరంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. షా ఆలంకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది.
రాయచూరు గ్రామీణ (రూరల్)
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన రాయచూరు రూరల్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దద్దల్ బసన్నగౌడ, బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తిప్పరాజు, జేడీఎస్ అభ్యర్థి, మాజీ జెడ్పీ సభ్యుడు చిన్న నర్సింహనాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యేకు సాత్వికుడనే పేరుంది. పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే ఈ నియోజకవర్గానికి కృష్ణా, తుంగభద్ర జలాలు తీసుకురావడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయన్న భావన ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి బసన్నగౌడ పట్ల సానుకూలత కనిపిస్తోంది.
సింధనూర్
జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెంకట్రావ్ నాడగౌడ, కాంగ్రెస్ నుంచి అంపన్నగౌడ బాదర్లి బరిలో ఉండగా, బీజేపీ నుంచి కరియప్ప పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం తక్కువే అయినా కరియప్ప కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీ టికెట్ తెచ్చుకోవడంతో.. త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ తెలుగువారు ఎక్కువ. వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్తున్నారు.
లింగుసూగుర్
ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కాంగ్రెస్ నుంచి డీఎస్ ఉలిగేరి, బీజేపీ నుంచి మానప్ప వజ్జల్, జేడీఎస్ నుంచి సిద్ధూ బండి పోటీ చేస్తున్నారు. పైకి మాత్రం ఉలిగేరి, వజ్జల్ మధ్య పోటీ భీకరంగా కనిపిస్తోంది. అయితే, సిద్ధూ బండిపై సానుభూతి కనిపిస్తోంది. ఆయన గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆయనకు ఓట్లు పడతాయనే అంచనాలున్నాయి. జేడీఎస్ ప్రభుత్వం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చారనే అభిప్రాయం కలసిరానుంది.
మస్కి
ఇక్కడ పారీ్టలు మారినా ప్రత్యర్థులు పాతవారే. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న బసన్నగౌడ గతంలో బీజేపీలో పనిచేశారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న ప్రతాపగౌడ పాటిల్ అంతకుముందు కాంగ్రెస్‌లో పనిచేశారు. గత ఎన్నికల్లో, తర్వాత ఉప ఎన్నికల్లో వారు తలపడ్డారు. ఇప్పుడూ వీరి మధ్యనే పోటీ ఉంది. ఇక్కడ వాల్మీకి, లింగాయత్‌లు చెరోసగం బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ఉండగా.. ఇతర కులాలు, తెలుగు క్యాంపులు కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నాయి. జేడీఎస్ నామమాత్రపు పోటీకి మాత్రమే పరిమితమనే అంచనాలున్నాయి.
మాన్వి
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం మాన్విలో హోరాహోరీ పోరు నడుస్తోంది. జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా వెంకటప్పనాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంపయ్యనాయక్, బీజేపీ నుంచి బీవీ నాయక్ పోటీ చేస్తున్నారు. లింగాయత్, వాల్మీకి వర్గాలు ప్రధాన ఓటర్లు అయినా తెలుగువారి ప్రభావం ఎక్కువే. మాన్వి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు బోసురాజు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వెంకటప్పనాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఇద్దరూ తెలుగు ఓటర్ల మద్దతుతోనే గెలిచారని అంచనా. ఈసారి కూడా వారు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు కనిపిస్తున్నారు.
దేవదుర్గం
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదని, జేడీఎస్ అధికారంలో ఉన్నప్పుడే నారాయణపూర్ నుంచి సాగునీరు తీసుకువచ్చిందన్న సానుకూలత కనిపిస్తోంది. ఇక్కడ జేడీఎస్ నుంచి కరెమ్మ నాయక్, కాంగ్రెస్ నుంచి శ్రీదేవీ నాయక్, బీజేపీ నుంచి శివన్నగౌడ పోటీలో ఉన్నారు. జేడీఎస్ రెండు సార్లు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కరెమ్మ నాయక్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. కాంగ్రెస్ అభ్యరి్థకి ఉన్న కుటుంబ రాజకీయ బలం కొంతమేర ప్రభావం చూపనుంది.
Comments
Please login to add a commentAdd a comment