dv sadananda gowda
-
మాజీ ముఖ్యమంత్రికి దక్కని టికెట్.. రాజకీయాలకు గుడ్‌బై?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత 'డీవీ సదానంద గౌడ'కు బెగళూరు నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది పార్టీ . దీంతో ఈయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తనను పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వడం వల్ల కలత చెందినట్లు పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ తనను సంప్రదించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తన మద్దతు మోదీకి ఉంటుందని, మళ్ళీ ఆయన ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సదానంద గౌడ వెల్లడించారు. సదానంద గౌడ.. 2004 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆ తరువాత ఆగస్టు 2011 నుంచి మే 2013 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈయన మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తనకు పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈయన ఇక రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా? అని పలువురు భావిస్తున్నారు. BJP leader and former Karnataka CM D.V. Sadananda Gowda holds a press conference in Bengaluru, he says, "I am upset with BJP as the election ticket (from Bangalore North seat) has been given to someone else in my place. Yes, I was invited to join the Congress party, but I will… pic.twitter.com/uhs9fRa6wQ — ANI (@ANI) March 21, 2024 -
టీకా కొరత.. మేం ఉరేసుకోవాలా ఏంటి: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశించిన విధంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వంలోని వారంతా ఉరి వేసుకోవాలా ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా వేయాలి అని కోర్టు సూచించడం మంచి పరిణామమే. అయితే ఈ సందర్భంగా కోర్టును ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు రేపటి వరకు దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు అనుకొండి.. అందుకు సరిపడా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనందుకు మేం అంతా ఉరి వేసుకుని చావాలా ఏంటి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కొరతపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సదానంద సమాధానం ఇస్తూ.. ‘‘ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే కార్యక్రమాలు కొనసాగుతాయి తప్ప.. దీనిలో రాజకీయ, ఇతర ప్రయోజనాలు లేవు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఎంతో నిజాయతీగా, నిబద్దతగా ఉంది. కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సాధారణంగానే కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉండవు. వాటిని మనం ఎలా మ్యానేజ్ చేయగల్గుతాం’’ అంటూ విలేకరులపై ఆయన ఎదురు దాడికి దిగారు. ఏది ఏమైనా రెండు, మూడు రోజుల్లో అన్ని విషయాలు చక్కబడతాయి. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. కర్ణాటకలో రోజూ 40,000 నుంచి 50,000 కేసులను నమోదవుతుండటంతో టీకాలకు డిమాండ్ బాగా పెరిగింది. కర్ణాటక ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రం మూడు కోట్ల వ్యాక్సిన్ల ఆర్డర్‌ను ఇచ్చిందని, అప్పటికే ఆ డబ్బును ఇద్దరు టీకా తయారీదారులకు చెల్లించారు. కానీ రాష్ట్రానికి మూడు లక్షల డోసులు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు. చదవండి: టీకా ఉత్పత్తి: ఇతర కంపెనీలకు కోవాగ్జిన్ ఫార్ములా! -
‘పంటల బీమాపై రైతులదే తుది నిర్ణయం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఏఎంటీజెడ్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 25 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పటి వరకు 7.49 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ.. బల్క్ ఇండస్ట్రీకి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే పథకం కింద విశాఖపట్నంలో మెడ్ టెక్ జోన్ ఏర్పాటుకు 25 కోట్ల సాయం అందించే అంశానికి కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ మొత్తంలో 30 శాతం నిధులను ఏఎంటీజెడ్‌కు విడుదల చేసినట్లు తెలిపారు. (త్వరలో జలశక్తి మంత్రి పోలవరం పర్యటన) నాలుగేళ్ళుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుపై రైతులు ఇతర భాగస్వామ్య పక్షాలతో జరిపిన చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు. అందులో భాగంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా 2020 ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. పంటల బీమాపై దీర్ఘకాలికంగా రైతులు చేస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో చేరాలా, వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను రైతులకే విడిచిపెట్టినట్లు మంత్రి తెలిపారు. 2020 ఖరీప్ సీజన్లో పంటల బీమాకు సంబంధించి అందిన వివరాల ప్రకారం పంటలు బీమా చేసుకునే రైతుల సంఖ్య గత ఖరీప్ సీజన్ మాదిరిగానే ఉందని చెప్పారు. (ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన) -
ఫార్మాలో స్వయం సమృద్ధి..
న్యూఢిల్లీ: దేశీయంగా బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీని మరింతగా ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన నాలుగు స్కీముల మార్గదర్శకాలను కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఫార్మా రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే విధంగా ఈ స్కీమ్‌లను రూపొందించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 53 కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), వైద్య పరికరాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్నది లక్ష్యమని ఆయన వివరించారు. వీటికి సంబంధించి భారత్ ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, దేశీయంగా వైద్యంపై ప్రతికూల ప్రభావాలు పడే పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. అయితే, ఫార్మా రంగం, జాతీయ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించి ఔషధాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో లాక్డౌన్ సమయంలోనూ ఇబ్బందులు పడే అవసరం రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగా ఆయా ఔషధాలు, డివైజ్‌ల ఉత్పత్తిని మరింత పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. ‘ప్రస్తుతం దేశీ ఫార్మా రంగ పరిమాణం సుమారు 40 బిలియన్ డాలర్లుగా ఉంది. సరైన తోడ్పాటు అందిస్తే 2024 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదు. తద్వారా 2025 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తోడ్పడగలదు‘ అని గౌడ తెలిపారు. ఫార్మా విభాగం రూపొందించిన ఈ స్కీములకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది మార్చిలో ఆమోదముద్ర వేసింది. అర్హత ప్రమాణాలను బట్టి ఎంపిక.. పరిశ్రమవర్గాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట స్కీముల మార్గదర్శకాలు రూపొందించినట్లు గౌడ చెప్పారు. మార్గదర్శకాల్లో పొందుపర్చిన అర్హతా ప్రమాణాల్లో ఆయా ఉత్పత్తి సంస్థలకు వచ్చే మార్కుల ఆధారంగా తయారీ ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమునకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటయ్యే ఈ ఉత్పత్తి పార్కుల్లో అధునాతన ఇన్ఫ్రా, మెరుగైన కనెక్టివిటీ, తక్కువ ధరలకు స్థలం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థ మొదలైనవన్నీ ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటులో సమయం, పెట్టుబడి వ్యయాలు తగ్గుతాయని వివరించారు. ‘ఈ స్కీములపై కంపెనీల నుంచి సానుకూల స్పందన ఉంటుందని భావిస్తున్నాం. అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులను ఈ పార్కులు ఆకర్షించగలవు. కార్యకలాపాలు ప్రారంభమైన రెండు, మూడేళ్లలో ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలవు, అలాగే దిగుమతులపై ఆధారపడటం తగ్గించగలవు. గ్లోబల్ ఫార్మా హబ్‌గా భారత్ ఎదిగేందుకు ఉపయోగపడగలవు‘ అని గౌడ చెప్పారు. స్వాగతించిన పరిశ్రమ.. దేశీయంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్‌ల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన స్కీముల మార్గదర్శకాలను పరిశ్రమ స్వాగతించింది. స్కీములు సక్రమంగా అమలైతే 8–10 ఏళ్ల కాలంలో ఏపీఐల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదని ఇండియన్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ఈడీ అశోక్ కుమార్ మదన్ తెలిపారు. -
నాకు క్వారంటైన్ అవసరం లేదు: మంత్రి
బెంగళూరు: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ క్వారంటైన్‌కు వెల్లకపోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. వివరాలు.. సోమవారం సదానంద గౌడ ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చారు. అయితే క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. రసాయనాల శాఖ మంత్రి కావడంతో తనకు మినహాయింపు ఉందని తెలిపారు. కోవిడ్-19 తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల్లో రాష్ట్రానికి వచ్చే వారికి క్వారంటైన్ తప్పని సరి అంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. కానీ సదానందగౌడ దీన్ని పట్టించుకోకుండా విమానాశ్రయం నుంచి అధికారిక వాహనంలో వెళ్లి పోయారు. (పాఠశాలల్లో క్వారంటైన్) దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నియమాలు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.. మంత్రులకు కాదు అంటూ సోషల్‌మీడియా వేదికగా జనాలు విమర్శలు చేయడంతో సదానంద గౌడ దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము కరోనా కట్టడి కోసం పనిచేయాల్సి ఉంది. రసాయన శాఖ మంత్రిగా మందుల ఉత్పత్తి, సరఫరా సరిగా ఉందా.. లేదా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే కేంద్రం మాకు కొన్ని మినహాయింపుల ఇచ్చింది. మా ఇష్టం వచ్చినట్లు తిరిగితే.. ప్రధాని ఊరుకోరు. నా మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ నేను సురక్షితంగా ఉన్నానని చెప్పింది. అందుకే క్వారంటైన్‌కు వెళ్లలేదు’ అన్నారు సదానంద గౌడ.(దెయ్యాల గ్రామాలే.. క్వారంటైన్ సెంటర్లు) కర్ణాటక ప్రభుత్వం కూడా సదానందకు మద్దతు ఇచ్చింది. అత్యవసర విధులు నిర్వర్తించే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వమే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాక ప్రభుత్వ విధుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే మంత్రులకు, ఉద్యోగులకు క్వారంటైన్ అవసరం లేదు అంటూ ఈ నెల 23న కేంద్రం జారీ చేసిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్’(ఎస్ఓపీ)ని ప్రజల దృష్టికి తీసుకు వచ్చింది. -
ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కొరత లేదని, రైతులకు సరఫరా చేయడానికి తగినంత యూరియా సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ.. 2017-18లో రాష్ట్రంలో 15.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా.. 14.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. 2018-19లో 16.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా 14.18 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. 2019-20లో 17.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. పంటల సీజన్ ఆరంభం కావడానికి ముందు వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఆ సీజన్లో ఏ రాష్ట్రంలో ఎంత మేర యూరియా, ఎరువుల అవసరం ఉంటుందో అంచనాలను సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు. ఈ అంచనాలు పూర్తయిన తర్వాత నెలవారీ ఎరువుల అవసరాన్ని కూడా అంచనా వేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. తయారు చేసిన అంచనాల ప్రకారం ఆయా రాష్ట్రాలకు దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులు, దిగుమతి చేసుకునే ఎరువులను సరఫరా చేయనున్నట్లు సదానంద గౌడ తెలిపారు. -
తెలంగాణకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగానూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు దక్కింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల చొరవతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. -
యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి
సాక్షి, అమరావతి: ప్లాస్టిక్ పరిశ్రమ, పరిశోధన రంగాల్లో అత్యధికంగా ఉన్న ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. 9.30 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశ ప్లాస్టిక్ పరిశ్రమ విలువ 2025 నాటికి 340 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సురంపల్లిలో సంయుక్తంగా నిర్మించిన ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెంటర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ (సీపెట్–సీఎస్టీఎస్) నూతన భవనాన్ని గురువారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సీపెట్ పారిశ్రామిక ఆవిష్కరణల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ రంగంలో పరిశోధనలు, ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించేందుకు దేశంలో త్వరలో కొత్తగా మరో అయిదు సీపెట్ కేంద్రాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా పరిశోధనలను విస్తృతం చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ సవాల్‌ను ఎదుర్కొంటామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వినతి మేరకునెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో ‘సీపెట్’ను నెలకొల్పుతామని కేంద్ర మంత్రి సదానందగౌడ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ అందించిన సహకారం అభినందనీయమని, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీరు, పట్టణాభివృద్ధి, సుందరీకరణ తదితర రంగాల్లో అభివృద్ధికి తమ శాఖ పూర్తిగా సహకరిస్తుందన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో మన రాష్ట్రం మాత్రమే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందని చెప్పారు.తగిన శిక్షణ పొందిన యువతను పారిశ్రామికరంగానికి అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అందుకే యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం భుజానికెత్తుకుందని వివరించారు. ఇందులో భాగంగా అన్ని పరిశ్రమల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. రానున్న రోజుల్లో సీపెట్ వంటి మరిన్ని సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలతో సీపెట్ అనుసంధానమై ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సహకరించాలన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ వైజాగ్ – కాకినాడ – బందర్ పెట్రో కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి పి.రాఘవేంద్రరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, రక్షణ నిధి, మొండితోక జగన్మోహనరావు, కైలే అనిల్ కుమార్, సీపెట్ విజయవాడ డైరెక్టర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌తో సదానందగౌడ భేటీ సీపెట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి డీవీ సదానందగౌడ తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను మర్యాద పూర్వకంగా తన నివాసంలోకి ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. మధ్యాహ్నం 12.31 గంటలకు వచ్చిన కేంద్ర మంత్రి అక్కడ గంటపాటు గడిపారు. సీఎం ఆతిథ్యం స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్పే: బీజేపీ
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమ రాజీనామాల గురించి నివేదించడమే కాకుండా తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రాజీనామాలు ఆమోదం పొందితే కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. ఈ నేపథ్యంలో రాజీనామాలపై స్పీకర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజీనామాల అంశాన్ని ఆయన సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే.. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆహ్వానిస్తే.. బీజేపీ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పేర్కొంటూ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తమకుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే.. ముఖ్యమంత్రిగా యడ్యూరప్పే ఉంటారని సదానంద స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు.. వారి రాజీనామాలను సదానంద సమర్థించారు. -
‘మండలి’కీ ఓపెన్ బ్యాలెట్!
న్యూఢిల్లీ: రాజ్యసభ తరహాలోనే శాసన మండలి ఎన్నికలూ ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం... దీనిపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. తద్వారా ధనబలానికి చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఎన్నికల కమిషన్ చేసిన ఈ ప్రతిపాదనపై అభిప్రాయం కోరుతూ జూన్‌లో నాటి న్యాయమంత్రి సదానందగౌడ.. రాష్ట్రాలకు లేఖలు రాశారు. ద్విసభలున్న ఏడు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, బిహార్‌లు దీనికి మద్దతు తెలిపాయి. ఓపెన్ బ్యాలెట్ ప్రకారం ఎమ్మెల్యేలు ఓటు వేసిన తరువాత బ్యాలెట్ పేపర్‌ను తమ పార్టీ ప్రతినిధికి చూపించాలి. అలాకాక బ్యాలెట్ బాక్స్‌లో వేసినా, ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేసినా చెల్లదు. -
యెడ్డీకి తిరుగుబాటు సెగలు!
కర్ణాటకలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీలో అసమ్మతి ఎదుర్కొంటుండగా.. అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు వ్యతిరేకంగా తిరుగుబాటు సెగలు ఎగిసిపడుతున్నాయి. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలో తెచ్చే లక్ష్యంతో గత ఏప్రిల్‌లో పార్టీ పగ్గాలను కమల అధినాయకత్వం యెడ్డీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, అందరినీ కలుపుకొని ముందుకెళ్లడానికి బదులు యెడ్డీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కర్ణాటక సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సీనియర్ నాయకులైన కేఎస్ ఈశ్వరప్ప, జగదీశ్ షెట్టర్, కేంద్రమంత్రులు అనంత్ కుమార్, డీవీ సదానంద గౌడ యెడ్డీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతలను విస్మరించి.. వారి అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా యడ్యూరప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు భగ్గుమంటున్నారు. మాజీ సీఎం అయిన యెడ్డీ తాజాగా చేపట్టిన జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్ల నియామకంలో తమను సంపద్రించలేదని, తమ అభిప్రాయాలు ఏమాత్రం వినకుండా ఇష్టానుసరం ఈ నియామకాలు చేపట్టారని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మీడియా ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర సీనియర్ నేతలు మీడియా ముందుకు రానప్పటికీ వారు కూడా ఇదేవిధంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీలోని యెడ్డీ వ్యతిరేక గ్రూపు తమ అసంతృప్తిని మూకుమ్మడిగా పార్టీ అధిష్ఠానానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. శీతాకాలం సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీకి యెడ్డీ తీరుపై ఫిర్యాదు చేయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు. -
నకిలీ లాయర్లెవరో తేల్చేస్తాం
న్యూఢిల్లీ: తొందర్లోనే నకిలీ లాయర్లెవరో తేల్చిపారేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు తేల్చాలంటే సాధ్యం కాని పని అని మరో ఏడు నెలల్లో నిజమైన లాయర్లెవరో, నకిలీ లాయర్లెవరో తెలుపుతామని పేర్కొంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నోత్తరాల సమయంలో బీసీఐ తరుపున కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానంద గౌడ వ్రాత పూర్వక వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు నకిలీలాయర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తేల్చాలన్న ఆలోచన బార్ కౌన్సిల్ చేయలేదని, ప్రస్తుతం మాత్రం అందుకోసం ఒక ప్రత్యేక మెకానిజాన్ని, కార్యచరణను ఏర్పాటుచేసి నకిలీ లాయర్ల సంఖ్య తేలుస్తామని చెప్పారు. గతంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో 30శాతంమంది నకిలీ లాయర్లే ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి లెక్కలేమిటో తేల్చాలని కేంద్ర ప్రభుత్వం బీసీఐని కోరింది. -
'రేపు ఇంకొకరి పేరు చెబుతారు'
బెంగళూరు: ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ మండిపడ్డారు. రోజుకొకరి పేరు తెరపైకి తెస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టం నుంచి లలిత్ మోదీ తప్పించుకోలేరని అన్నారు. 'ఈ రోజు ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పేర్లు బయపెట్టిన లలిత్ మోదీ రేపు ఇంకొకరి పేరు చెబుతారు. ఆ తర్వాత మరొకరి పేరు బయటపెడతారు. గందరగోళం సృష్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. దీనిక రాజకీయ కుట్ర ఉన్నట్టు కనబడుతోంద'ని సదానందా గౌడ అన్నారు. లండన్ లో ప్రియాంక, వాద్రాలను కలిశానని ట్విటర్ లో లలిత్ మోదీ పేర్కొన్నారు. -
బాలనేరస్థుల బిల్లుకు ఆమోదం
హేయమైన నేరాలకు పాల్పడిన 16-18 ఏళ్ల బాలలకు పెద్దల చట్టాల వర్తింపు జీవితఖైదు, మరణశిక్షల నుంచి మినహాయింపు న్యూఢిల్లీ: పదహారేళ్ల వయసున్న బాలనేరస్థులను వయోజనుల చట్టాల ప్రకారం విచారించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. 16 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉండి.. క్రూరమైన నేరాలకు పాల్పడే బాలలు పెద్దలు ఎదుర్కొనే శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. దేశరాజధానిలో 2012నాటి నిర్భయ అత్యాచార ఉదంతంలో 16 ఏళ్ల నిందితుడి పాత్ర ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. అయితే అమాయక పిల్లల హక్కులకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ సభ్యులకు తెలిపారు. క్రూరమైన నేరగాళ్లకు.. సాధారణ పిల్లలకు మధ్య సంతులనం పాటించామని ఆమె చెప్పారు. ప్రభుత్వం తరపున మొత్తం 42 సవరణలు సభలో ప్రతిపాదించారు. వీటన్నింటినీ లోక్‌సభ ఆమోదించింది. విపక్ష నాయకుడు శశిథరూర్(కాంగ్రెస్) ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ) వంటి వారు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. ఈ సందర్భంగా మనేకాగాంధీ మాట్లాడుతూ‘‘దేశ వ్యాప్తంగా 28వేల మంది బాలలు 2013లో రకరకాల నేరాలకు పాల్పడినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. వీరిలో 3887మంది అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డారు. అందుకే చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు కూడా నొక్కిచెప్పింది’’ అని అన్నారు. పార్టమెంటరీ స్థాయీసంఘం సిఫార్సులను పట్టించుకోలేదన్న విపక్షాల వాదనను మంత్రి ఖండించారు. స్థాయీ సంఘం చేసిన 13 సిఫార్సులలో 11 సిఫార్సులను ఆమోదించామన్నా రు. పేదలు, ఆదివాసీ బాలల విషయంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశముందన్న ఆరోపణల్ని కూడా మనేకా కొట్టిపారేశారు. దేశంలో ఎక్కువ నేరాలు పేదలు, ఆదివాసీలకు వ్యతిరేకంగానే అవుతున్నాయని వారికి న్యాయం చేసేందుకే కృషి చేసామన్నారు. చట్టంలోని ప్రధానాంశాలు.. కొత్త చట్టంలో బాలనేరస్థులకు జీవితఖైదు కానీ, మరణ శిక్ష కానీ ఉండదు. 16-18 ఏళ్ల చేసే బాలలు చేసే నేరాలను సాధారణ, తీవ్రమైన, హేయమైన నేరాలుగా వర్గీకరించారు. వీటి విచారణ విధానాలను కూడా వేర్వేరుగా నిర్వచించారు. హేయమైన నేరాలను పెద్దల చట్టాల ప్రకారం విచారిస్తారు. ఏ బాల నేరస్థుడైనా సరే, వారికి ఎలాంటి శిక్ష పడినా 21ఏళ్ల వయసు వచ్చేంత వరకూ బాలనేరస్థుల శిక్షణాలయం(బోర్స్టల్)లోనే ఉంచుతారు. 21ఏళ్ల తరువాత వారి ప్రవర్తనను అంచనా వేస్తారు. పరివర్తన వచ్చిందని భావిస్తే శిక్షలో మార్పు చేయవచ్చు ప్రవర్తన సరిగా లేకపోతే శిక్షను కొనసాగించవచ్చు. కాలం చెల్లిన చట్టాలకు చెల్లు: 32 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమో దం తెలిపింది. ఈ బిల్లు గత శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొం దింది. అయితే కొన్ని సాంకేతిక సవరణలతో తిరిగి దిగువసభకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానందగౌడ ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించింది. -
సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్
-
సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్
బెంగళూరు: కన్నడ నటి వర్ధమాన నటి మైత్రేయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ కు బెంగళూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశంతో అతడిని అరెస్ట్ చేసే అవకాశముంది. కాగా, ముందస్తు బెయిల్ కోసం కార్తీక్- ఆగస్టు 30న సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆర్టీ నగర్ పీఎస్‌లో మైత్రేయి ఫిర్యాదు చేసింది. అయితే మైత్రేయితో పదేళ్ల క్రితమే తనకు పెళ్లైందని కన్నడ సినీ దర్శకుడు రిషి మైత్రేయిపై ఇక్కడి 8వ ఏసీఎఎం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. రిషితో తనకు పెళ్లికాలేదని మైత్రేయి స్పష్టం చేసింది. -
రైల్వే బడ్జెట్లో శివమొగ్గకు ప్రాధాన్యత ఇవ్వండి
కేంద్ర మంత్రి సదానందగౌడకు యడ్డి విన్నపం శివమొగ్గ, న్యూస్‌లైన్ :రైల్వే బడ్జెట్లో శివమొగ్గకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి డి.వి.సదానందగౌడను శివమొగ్గ ఎంపీ బి.ఎస్.యడ్యూరప్ప, మాజీ ఎంపీ బి.వై.రాఘవేంద్ర కోరారు. ఇటీవల ఢిల్లీలో సదానందగౌడను కలిసి వారు వినతిపత్రం అందించారు. శివమొగ్గ-హరిహర రైల్వేమార్గం ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు. అదే విధంగా 2012-13 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన శివమొగ్గ-శికారిపుర-రాణిచెన్నూరు రైల్వేమార్గానికి బదులుగా శివమొగ్గ-శికారిపుర-హనగల్-తడస మార్గం గూండా హుబ్లీకి రైల్వేమార్గం నిర్మాణం చేపట్టాలని కోరారు. బీరూరు-శివమొగ్గ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించాలని, శివమొగ్గ నుంచి బెంగళూరుకు అర్ధరాత్రి సమయంలో రైలు సౌకర్యం కల్పించాలని కోరారు. గోవా, ఘన, ముంబై, గుజరాత్‌కు వెళ్లేందుకు తాళగెప్పె నుంచి హొన్నాళి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసి దానిని కొంకణి రైల్వేలో చేర్చాలని విన్నవించారు. నంబర్16227-16228 బెంగళూరు-తాళగుప్పె-బెంగళూరు రైలుకు ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని, శివమొగ్గ రైల్వేస్టేషన్లో స్కైవాకర్ నిర్మించాలని, శివమొగ్గ తాలూకా హొన్నవిలే హసూడిపార్మ, దడమఘట్ట తదితర గ్రామాల ప్రజలకు అనుకూలంగా లెవల్ క్రాసింగ్ గేట్ ఏర్పాటు చేయాలని కోరారు. భద్రావతిలో రైల్వే వంతెన పనులు వేగవంతం చేయాలని, శివమొగ్గ తాలూకా బీదర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక ప్రాంతం వద్ద రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రామచంద్రాపురమఠ, కూల్లూరు ఇతర ధార్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తాదులకు అనుకూలంగా హొసనగర తాలూకా, అరసాళు, శివమొగ్గ తాలూకాలోని హరనపాళ్య రైల్వేస్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లకు హాల్ట్ ఏర్పాటు చేయాలని, శివమొగ్గ రైల్వేస్టేషన్ సమీపంలో వంద అడుగుల రింగ్‌రోడ్డు నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించాలని యడ్యూరప్ప, రాఘవేంద్ర విన్నవించారు.