న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశించిన విధంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వంలోని వారంతా ఉరి వేసుకోవాలా ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా వేయాలి అని కోర్టు సూచించడం మంచి పరిణామమే. అయితే ఈ సందర్భంగా కోర్టును ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు రేపటి వరకు దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు అనుకొండి.. అందుకు సరిపడా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనందుకు మేం అంతా ఉరి వేసుకుని చావాలా ఏంటి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ కొరతపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సదానంద సమాధానం ఇస్తూ.. ‘‘ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే కార్యక్రమాలు కొనసాగుతాయి తప్ప.. దీనిలో రాజకీయ, ఇతర ప్రయోజనాలు లేవు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఎంతో నిజాయతీగా, నిబద్దతగా ఉంది. కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. సాధారణంగానే కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉండవు. వాటిని మనం ఎలా మ్యానేజ్ చేయగల్గుతాం’’ అంటూ విలేకరులపై ఆయన ఎదురు దాడికి దిగారు. ఏది ఏమైనా రెండు, మూడు రోజుల్లో అన్ని విషయాలు చక్కబడతాయి. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని తెలిపారు.
కర్ణాటకలో రోజూ 40,000 నుంచి 50,000 కేసులను నమోదవుతుండటంతో టీకాలకు డిమాండ్ బాగా పెరిగింది. కర్ణాటక ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రం మూడు కోట్ల వ్యాక్సిన్ల ఆర్డర్‌ను ఇచ్చిందని, అప్పటికే ఆ డబ్బును ఇద్దరు టీకా తయారీదారులకు చెల్లించారు. కానీ రాష్ట్రానికి మూడు లక్షల డోసులు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment