సాక్షి, బెంగళూరు: మరోసారి అందరి జీవితాలను అతలాకుతలం చేసేలా కరోనా వైరస్ పేట్రేగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 5,279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా సోకి 32 మంది మృత్యువాత పడ్డారు. ఇటీవలి నాలుగు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మరో 1,856 మంది కోలుకున్నారు.
10.20 లక్షలకు మొత్తం కేసులు..
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,20,434 కి, డిశ్చార్జ్‌లు 9,65,275 కి, మరణాలు 12,657 కి పెరిగాయి. ప్రస్తుతం 42,483 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 345 మంది రోగులు ఐసీయూలో ఉన్నారు.
బెంగళూరులో 3,728 మందికి..
ఉద్యాననగరిలో తాజాగా 3,728 పాజిటివ్‌లు, 1,026 డిశ్చార్జిలు, 18 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 4,50,759 కు పెరిగింది. అందులో 4,15,309 మంది కోలుకున్నారు. మరో 4,667 మంది మరణించారు. 30,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మైసూరులో 3, కలబురిగిలో 2, బళ్లారి, బీదర్, హావేరి, కోలారు, కొప్పళ, శివమొగ్గ, తుమకూరు, విజయపుర, యాదగిరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
- 2.19 కోట్లకు టెస్టులు..
- రాష్ట్రంలో సోమవారం 74,135 మందికి కరోనా టీకా వేశారు. మొత్తం టీకాదారులు 44,75,617 కి చేరారు.
- 97,829 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షలు 2,19,87,431 మందికి పెరిగాయి.
నెగిటివ్ ఉంటేనే బెంగళూరులోకి
బనశంకరి: కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో నియంత్రణ కోసం మంగళవారం నుంచి నగర సరిహద్దులు దాటివచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు నివేదిక తప్పనిసరి చేశామని బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ మంజునాథ్ తెలిపారు. సోమవారం విలేకరులతో మంజునాథ్ మాట్లాడుతూ బెంగళూరులో కరోనా పెచ్చరిల్లుతోందన్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటేయడానికి నగరం నుంచి అనేకమంది అక్కడికి వెళ్తారు. వారు తిరిగివచ్చేటప్పుడు కోవిడ్ నెగిటివ్ ఉంటే మాత్రమే బెంగళూరులోకి అనుమతిస్తాం, ఒకవేళ పాజిటివ్ వస్తే వెనక్కి పంపిస్తామని చెప్పారు.
బీబీఎంపీ, పోలీస్ సహా పలు శాఖల ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కోవిడ్ బాధితుల ప్రాథమిక, ద్వితీయ సంబంధాలు కలిగిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని తెలిపారు. తమిళనాడు సరిహద్దుల్లో అత్తిబెలె చెక్‌పోస్ట్ వద్ద నిరంతరం తనిఖీలు చేస్తారన్నారు. మెడికల్ స్టోర్‌లలో జ్వరం, జలుబు మాత్రలు కొనేవారి సమాచారం సేకరిస్తున్నామని, జాతరలు, సభలు, సమావేశాలను నిషేధించామని చెప్పారు. పాలికె కమిషనర్ గౌరవ్‌గుప్తా మాట్లాడుతూ రోగుల కోసం బెడ్లను సిద్ధం చేశామన్నారు.
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తుమకూరు: మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తుమకూరు నగరంలోని సిద్దగంగ మఠంలో చదువుకుంటున్న ఇతర ప్రాంతాల విద్యార్థులు సోమవారం పెట్టేబేడా సర్దుకుని స్వగ్రామాలకు పయనమయ్యారు. తీవ్రమైన ఎండలో విద్యార్థుల అవస్థలు చూసి పలువురు అయ్యో అనుకున్నారు. ఇక్కడికి బీజాపుర, ధార్వాడ, బెళగావితో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు చదువుల కోసం వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment