సాక్షి,బెంగళూరు : కరోనా వ్యాక్సిన్ల కొరతపై అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని, అన్ని రాష్ట్రాల అవసరాలను తీర్చబోతున్నామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తరువాత బెంగళూరులో తొలిసారి పర్యటించిన ఆమె వ్యాక్సీన్ల పంపిణీపై ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో మీడియాను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడుతూ, ప్రతి రాష్ట్రానికి జనాభా సాంద్రత, బలహీన సెక్షన్ల వారీగా కేటాయింపులు లభిస్తాయన్నారు. కేంద్రం ముందుగానే వ్యాక్సీన్లను రాష్ట్రాలకు సరఫరా చేస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు ఎన్ని వ్యాక్సిన్లు కావాలో ఆయా రాష్ట్రాలు ఏడు రోజుల ముందుగానే ప్రకటించాలన్నారు. అలాగే అందరూ టీకా తీసుకోవాలని ఆమె సూచించారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు తమ వంతుగా తోడ్పాటునందించడం సంతోషకరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
బోయింగ్ ఇండియా సహా వివిధ ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంకలో నిర్మించిన 100 పడకల ఆధునిక కోవిడ్ కేర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆమె గురువారం సందర్శించారు. తక్కువ వ్యవధి లోనే కోవిడ్ కేర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడం అభినందనీయమని చెప్పారు. అలాగే జయనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నియోనాటల్, పీడియాట్రిక్ ఐసియు ఏర్పాటుకుగాను తన ఎంపిలాడ్ నిధుల నుండి రూ.1 కోట్లు కేటాయించనున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ, బెంగళూరు బయోఇన్నోవేషన్ సెంటర్లను కేంద్రమంత్రి నేడు సందర్శించనున్నారు. అలాగే కోవిడ్ విపత్తులో వైద్యుల సేవలకు గౌరవ చిహ్నంగా రాష్ట్రంలో ఆసుపత్రుల ఎదుట స్మారక స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డా.సుధాకర్ తెలిపారు. (Petrol Prices: పెట్రో షాక్, చెన్నైలో కూడా సెంచరీ)
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment