
బెంగళూరు : వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ మరణించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ గ్రూప్–డి ఉద్యోగి నాగరాజు (43) కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న రెండో రోజు మరణించాడు. అయితే ఈ మరణం హార్ట్ అటాక్ వల్ల వచ్చిందని, వ్యాక్సినేషన్ వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం పోస్ట్ మార్టం వరకూ ఆగాల్సి ఉంటుందని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఓ ఆరోగ్య కార్యకర్త మృతిచెందాడు. అయితే, కరోనా టీకా సంబంధిత మరణం కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గుండె–శ్వాసకోశ సంబంధిత వ్యాధితోనే మహిపాల్ మృతిచెందాడని శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు. మహిపాల్ మృతిపై దర్యాప్తు జరిపిస్తామని మొరాదాబాద్ కలెక్టర్ రాకేశ్‌సింగ్ చెప్పారు.