బాలనేరస్థుల బిల్లుకు ఆమోదం
హేయమైన నేరాలకు పాల్పడిన
16-18 ఏళ్ల బాలలకు పెద్దల చట్టాల వర్తింపు
జీవితఖైదు, మరణశిక్షల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: పదహారేళ్ల వయసున్న బాలనేరస్థులను వయోజనుల చట్టాల ప్రకారం విచారించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. 16 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉండి.. క్రూరమైన నేరాలకు పాల్పడే బాలలు పెద్దలు ఎదుర్కొనే శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. దేశరాజధానిలో 2012నాటి నిర్భయ అత్యాచార ఉదంతంలో 16 ఏళ్ల నిందితుడి పాత్ర ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. అయితే అమాయక పిల్లల హక్కులకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ సభ్యులకు తెలిపారు.
క్రూరమైన నేరగాళ్లకు.. సాధారణ పిల్లలకు మధ్య సంతులనం పాటించామని ఆమె చెప్పారు. ప్రభుత్వం తరపున మొత్తం 42 సవరణలు సభలో ప్రతిపాదించారు. వీటన్నింటినీ లోక్‌సభ ఆమోదించింది. విపక్ష నాయకుడు శశిథరూర్(కాంగ్రెస్) ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్(ఆర్‌ఎస్‌పీ) వంటి వారు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.
ఈ సందర్భంగా మనేకాగాంధీ మాట్లాడుతూ‘‘దేశ వ్యాప్తంగా 28వేల మంది బాలలు 2013లో రకరకాల నేరాలకు పాల్పడినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. వీరిలో 3887మంది అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డారు. అందుకే చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు కూడా నొక్కిచెప్పింది’’ అని అన్నారు. పార్టమెంటరీ స్థాయీసంఘం సిఫార్సులను పట్టించుకోలేదన్న విపక్షాల వాదనను మంత్రి ఖండించారు. స్థాయీ సంఘం చేసిన 13 సిఫార్సులలో 11 సిఫార్సులను ఆమోదించామన్నా రు. పేదలు, ఆదివాసీ బాలల విషయంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశముందన్న ఆరోపణల్ని కూడా మనేకా కొట్టిపారేశారు. దేశంలో ఎక్కువ నేరాలు పేదలు, ఆదివాసీలకు వ్యతిరేకంగానే అవుతున్నాయని వారికి న్యాయం చేసేందుకే కృషి చేసామన్నారు.
చట్టంలోని ప్రధానాంశాలు..
- కొత్త చట్టంలో బాలనేరస్థులకు జీవితఖైదు కానీ, మరణ శిక్ష కానీ ఉండదు.
- 16-18 ఏళ్ల చేసే బాలలు చేసే నేరాలను సాధారణ, తీవ్రమైన, హేయమైన నేరాలుగా వర్గీకరించారు. వీటి విచారణ విధానాలను కూడా వేర్వేరుగా నిర్వచించారు.
- హేయమైన నేరాలను పెద్దల చట్టాల ప్రకారం విచారిస్తారు.
- ఏ బాల నేరస్థుడైనా సరే, వారికి ఎలాంటి శిక్ష పడినా 21ఏళ్ల వయసు వచ్చేంత వరకూ బాలనేరస్థుల శిక్షణాలయం(బోర్‌స్టల్)లోనే ఉంచుతారు. 21ఏళ్ల తరువాత వారి ప్రవర్తనను అంచనా వేస్తారు. పరివర్తన వచ్చిందని భావిస్తే శిక్షలో మార్పు చేయవచ్చు ప్రవర్తన సరిగా లేకపోతే శిక్షను కొనసాగించవచ్చు.
కాలం చెల్లిన చట్టాలకు చెల్లు: 32 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమో దం తెలిపింది. ఈ బిల్లు గత శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొం దింది. అయితే కొన్ని సాంకేతిక సవరణలతో తిరిగి దిగువసభకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానందగౌడ ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించింది.