Juveniles
-
ఇండియన్ ఆయిల్ చొరవ.. ఖైదీల జీవితాల్లో వెలుగు
జైలులో ఉన్న ఖైదీలు, బాలనేరస్థుల జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య , 'పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్' 8వ దశను, 'నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్' 5వ దశను ప్రారంభించారు.ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టిన ఈ రెండు కార్యక్రమాలు.. 22 జైళ్లు, జువైనల్ హోమ్‌లలో 1000 మందికి పైగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ఇండియన్ ఆయిల్ 23 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 మహిళా బాల్య కేంద్రాలతో సహా 150 సంస్థలలో 7300 మంది ఖైదీలకు స్పోర్ట్స్ కోచింగ్, పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉంది.పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్, నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్ ప్రారంభించిన సందర్భంగా ఇండియన్ ఆయిల్ చైర్మన్ మాట్లాడుతూ.. కార్పోరేట్ సంస్థల్లో ఇండియన్ ఆయిల్ అగ్రగామిగా నిలిచి జైలులో ఉన్న వారికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నాను. జైలు జీవితాలను గడిపిన వారు క్రీడల్లో రాణించేలా ప్రయత్నాలు సాగిస్తున్నామని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జైలు అధికారులు.. ఖైదీలు, బాలనేరస్థులు మెరుగైన జీవితాన్ని నిర్మించడంలో మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకోవడం గొప్ప విషయం. దీనికోసం ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు.ఇప్పటికే ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవతో.. ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) నిర్వహించిన ఖైదీల ఇంటర్కాంటినెంటల్ “చెస్ ఫర్ ఫ్రీడమ్” ఆన్లైన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పూణేలోని యెరవ్డా జైలులోని ఖైదీలు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఖైదీలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కారణంగా శ్రీకాంత్ మాధవ్ వైద్యకు ప్రపంచ చెస్ సమాఖ్య 'ఫ్రెండ్ ఆఫ్ ఫిడే" అనే ప్రతిష్టాత్మక బిరుదును అందించింది.‘పరివర్తన్-ప్రైజన్ టు ప్రైడ్’ కార్యక్రమం 2021 ఆగస్టు 15న ప్రారంభమైంది, అయితే ‘నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్’ను 2023 జనవరి 26న మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఖైదీలను క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఎంత పని చేశావ్ ‘పుష్ప’.. సినిమా చూసి చంపేశారు
ఢిల్లీ: జనాల మీద సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. సందేశాత్మక చిత్రాల్లోనూ సరదాను వెతుక్కనే స్వభావం మన సగటు ఆడియొన్స్ది. పైగా ‘సినిమాలోని సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలే. అనుకరించకండి’ అంటూ సినిమా ముందు వచ్చే విజ్ఞప్తులను పట్టించుకునేవాళ్లు కనిపించరు!. ప్రత్యేకించి అందులోని ఘట్టాల అనుకరణ.. సరదా వరకైతే పర్వాలేదు. అదే సీరియస్ మలుపు తీసుకుంటే.. దేశ రాజధాని పరిధిలో జరిగిన ఓ నేరం ఇప్పుడు ‘సినిమా ఇచ్చే సందేశం’ గురించి చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ జహంగీర్‌పురిలో జరిగిన ఓ హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ సినిమాతో పాటు ఓ హిందీ వెబ్ సిరీస్ స్ఫూర్తితో నేర ప్రవృత్తిలోకి దిగామంటూ ముగ్గురు టీనేజర్లు స్టేట్మెంట్ ఇవ్వడం కలకలం రేపింది. నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ బస్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్లలో ఒకడు ‘బద్నాం’ పేరుతో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ఏరియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో తరచూ ఇతరులకు దమ్కీ ఇస్తూ.. ఆ ఘటనలను షార్ట్ వీడియోలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప’ సినిమా చూసిన ఆ గ్యాంగ్.. అందులో పుష్పరాజ్‌లా ఎదగాలనే ప్లాన్‌వేసింది. ఇందుకోసం అటుగా వెళ్తున్న ఓ అమాయకుడిని ఎంచుకుంది. ఆ యువకుడిని చావబాదుతూ.. ఆ వీడియోను రికార్డు చేశారు. వాళ్లను చెదరగొట్టి.. కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో ఆ వ్యక్తి మృతి చెందగా.. బాధితుడిని 24 ఏళ్ల శిబుగా గుర్తించారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమను తాము ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో, గ్యాంగ్స్టర్లుగా ఎదగాలన్న ఉద్దేశంతో పుష్ప సినిమాను, బౌకాల్ సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని, వాటిల్లో హీరోల మాదిరిగా ఎదిగే ప్రయత్నం చేశామని చెప్పడంతో కంగుతినడం పోలీసులు వంతూ అయ్యింది. ఈ నేరంలో ముగ్గురు మైనర్లు కావడం విశేషం. -
గాలింపు ముమ్మరం.. జువెనైల్స్ కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ జువెనైల్ హోం నుంచి బాలురు పారిపోయిన కేసులో పురోగతి లభించింది. 15 మందిలో ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మూడు బృందాలతో ఈస్ట్ జోన్ పోలీసులు తప్పించుకున్న జువెనైల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిగతా 12 మంది బాలుర ఆచూకీ త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. సైదాబాద్ జువెనైల్ హోం నుంచి శనివారం అర్ధరాత్రి 15 మంది బాలురు రెండు గ్రూపులుగా విడిపోయి పారిపోయారు. కిటికీ ఇనుప చువ్వలను ఆక్సా బ్లేడ్, కట్టర్ సాయంతో కోసి గోడదూకి బాలురు తప్పించుకున్నారని జువెనైల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో వీరిపై ఐదేసి కేసులున్నట్లు జువెనైల్ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఇదే హోం నుంచి ఐదుగురు బాలురు పారిపోగా వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకుని తిరిగి హోంకు తీసుకొచ్చినట్లు సమాచారం. -
జువైనల్ హోం నుంచి 15 మంది పరార్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువైనల్ హోం నుంచి 15 మంది బాలురు పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జువైనల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైదాబాద్‌లోని జువైనల్ హోంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన బాలురు.. ఆపై గోడదూకి పక్కనే ఉన్న బస్తీలోకి ప్రవేశించినట్లు సమాచారం. కొందరు హోం నుంచి బయటకు వచ్చి ఓ బైకు మీదు వెళ్లిపోగా, మిగతావారు కాలినడకన వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు హోం నుంచి తప్పించుకున్న బాలురిని గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుర కోసం సిటీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
అబ్జర్వేషన్ హోం నుంచి బాల నేరస్తుల పరారీ
సాక్షి, హైదరాబాద్: ఓ అబ్జర్వేషన్ హోమ్ నుంచి ఆరుగురు బాల నేరస్తులు పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కృషి నగర్లో రోజ్ అబ్జర్వేషన్ హోమ్ ఉంది. అందులో ఉన్న బాల నేరస్తులలో ఆరుగురు బాలలు నిర్వాహకులను బెదిరించి పారిపోయారు. కాగా, మూడు నెలల వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారి. పోలీస్ స్టేషన్లో నిర్వాహకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాల నేరస్తుల కోసం గాలిస్తున్నారు. -
గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..
జబల్పూర్: వివిధ కేసుల్లో రిమాండ్‌లో ఉన్న పది మంది బాలనేరస్తులు జువెనైల్ హోం నుంచి పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జువెనైల్ హోంకు గార్డుగా ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి బాలనేరస్తులు పరారయ్యారు. రాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గార్డును తీవ్రంగా కొట్టి తాళాలు లాక్కొని.. పది మంది బాల నేరస్తులు పరారయ్యారని రిమాండ్ హోం అధికారి పునిత్ వర్మ వెల్లడించారు. పరారైన వారికోసం గాలింపు చేపడుతున్నామని రాంజీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజయ్ శుక్లా తెలిపారు. -
దొరికిన చిన్నారులు
చెన్నై కెల్లీస్‌లోని జువనైల్ హోం నుంచి సోమవారం తప్పించుకున్న 33 మంది బాలనేరస్తుల్లో 31 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోగా గాలిస్తున్నారు. పట్టుబడిన వారిలో 30 మందిని చెంగల్పట్టు హోమ్‌కు తరలించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కీల్పాక్ కెల్లీస్లో ప్రభుత్వ బాలనేరస్తులను ఉంచే జువెనైల్ హోం ఉంది. హత్య, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాలకు పాల్పడే 18 ఏళ్ల లోపు బాల నేరస్తులను అక్కడ ఉంచుతారు. మొదటి అంతస్తులో 21 మంది, రెండో అంతస్తులో 53 మంది ఉన్నారు. ఇళ్లలో చోరీలకు పాల్పడే వారికి, రౌడీలు కిరాయి గూండాలతో సంబంధాలున్న వారి మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే హోం నుంచి తప్పించుకు పోవడం సహజమై పోయింది. రౌడీలతో సంబంధాలు ఉన్నవారు తప్పిం చుకు పోవడం, మరో గ్రూపు వారు హోం అధికారులకు సమాచారం ఇవ్వడమే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణం. ఇదిలా ఉండగా, క్రోంపేటకు చెందిన ఒక బాలుడు, తండయారుపేటకు చెందిన మరో బాలుడు నేరాలు చేసి గత నెల హోంలోకి వచ్చారు. వీరిద్దరి జామీన్ కోసం బెయిల్ దరఖాస్తు చేసి ఉన్నారు. వీరిలో తండయార్‌పేటకు చెందిన బాలుడికి బెయిలు మంజూరు కాకపోవడంతో గందరగోళం సృి ష్టంచైనా హోం నుంచి బైటపడాలని పథకం పన్ని తన స్నేహితులకు చెప్పాడు. ఈ విషయం క్రోంపేటకు చెంది న బాలుడికి తెలి సిపోయింది. హోం నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదనే దృక్ఫథంతో ఉన్న క్రోంపేట బాలుడికి అధికారుల్లో మంచి పేరు ఉన్నందున స్వేచ్ఛగా బైటకు వెళ్లివచ్చే వెసులుబాటు కల్పించారు. ఇలా రెండుగా విడిపోయిన గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తండయారుపేటకు చెందిన బాలుడి బృందం ఈ నెల 10వ తేదీన హోంలోని ట్యూబ్‌లైట్‌ను పగులగొట్టి గలాటా సృష్టించారు. అయితే హోం వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో గ్రూపునకు చెందిన బాలుడు అధికారులను నిలదీశాడు. చీకట్లో భద్రతా చర్యలు ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. దీంతో అదేరోజు రాత్రే ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. చీకటి, రాత్రి వేళ కావడంతో కొద్దిసేపటికి వారే శాంతించారు. ఈ దశలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తండయారుపేట బాలుడికి బెయిలు రాలేదనే సమాచారం వచ్చింది. దీంతో ఆ బాలుడు మొదటి అంతస్తులోని తన గ్రూపువారితో కలిసి తలుపుల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించాడు. వీరికి మద్దతుగా మరో 33 మంది అక్కడికి చేరుకున్నారు. ఒక తాడును తయారుచేసి ఒకరి తర్వాత ఒకరు 33 మంది గోడదూకి కూవం నది గట్టుమీదుగా పారిపోయారు. పారిపోతున్న సమాచారాన్ని అధికారులకు చేరవేయడంతో మళ్లీ ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సమాచారం అందుకున్న కీల్పాక్ పోలీసులు పారిపోయిన 33 మందిని పట్టుకునే వేట సోమవారం రాత్రి ప్రారంభించారు. పట్టుబడిన 31 మందిని జువెనైల్ హోంకు తరలించారు. ఇదే సమయంలో హోం నుంచి నలుగురు బాలురు తప్పించుకునే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకునేందుకు చుట్టుముట్టారు. తమను పట్టుకుంటే కోసుకుంటామని వారి వద్దనున్న బ్లేడు, కత్తులను బైటపెట్టి బెదిరించారు. వారి తల్లిదండ్రులతో సమాధాన పరిచే ప్రయత్నాన్ని కూడా ధిక్కరించి తమ వద్దనున్న ఆయుధాలతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గాయపడిన నలుగురిని కీల్పాక్ ఆసుపత్రిలో చేర్పించారు. 30 మంది బాలనేరస్తులను చెన్నై హోం నుంచి చెంగల్పట్టు హోంకు మంగళవారం తరలించారు. మరో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తప్పించుకున్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
బాలనేరస్థుల బిల్లుకు ఆమోదం
హేయమైన నేరాలకు పాల్పడిన 16-18 ఏళ్ల బాలలకు పెద్దల చట్టాల వర్తింపు జీవితఖైదు, మరణశిక్షల నుంచి మినహాయింపు న్యూఢిల్లీ: పదహారేళ్ల వయసున్న బాలనేరస్థులను వయోజనుల చట్టాల ప్రకారం విచారించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. 16 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉండి.. క్రూరమైన నేరాలకు పాల్పడే బాలలు పెద్దలు ఎదుర్కొనే శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. దేశరాజధానిలో 2012నాటి నిర్భయ అత్యాచార ఉదంతంలో 16 ఏళ్ల నిందితుడి పాత్ర ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. అయితే అమాయక పిల్లల హక్కులకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ సభ్యులకు తెలిపారు. క్రూరమైన నేరగాళ్లకు.. సాధారణ పిల్లలకు మధ్య సంతులనం పాటించామని ఆమె చెప్పారు. ప్రభుత్వం తరపున మొత్తం 42 సవరణలు సభలో ప్రతిపాదించారు. వీటన్నింటినీ లోక్‌సభ ఆమోదించింది. విపక్ష నాయకుడు శశిథరూర్(కాంగ్రెస్) ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ) వంటి వారు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. ఈ సందర్భంగా మనేకాగాంధీ మాట్లాడుతూ‘‘దేశ వ్యాప్తంగా 28వేల మంది బాలలు 2013లో రకరకాల నేరాలకు పాల్పడినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. వీరిలో 3887మంది అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డారు. అందుకే చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు కూడా నొక్కిచెప్పింది’’ అని అన్నారు. పార్టమెంటరీ స్థాయీసంఘం సిఫార్సులను పట్టించుకోలేదన్న విపక్షాల వాదనను మంత్రి ఖండించారు. స్థాయీ సంఘం చేసిన 13 సిఫార్సులలో 11 సిఫార్సులను ఆమోదించామన్నా రు. పేదలు, ఆదివాసీ బాలల విషయంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశముందన్న ఆరోపణల్ని కూడా మనేకా కొట్టిపారేశారు. దేశంలో ఎక్కువ నేరాలు పేదలు, ఆదివాసీలకు వ్యతిరేకంగానే అవుతున్నాయని వారికి న్యాయం చేసేందుకే కృషి చేసామన్నారు. చట్టంలోని ప్రధానాంశాలు.. కొత్త చట్టంలో బాలనేరస్థులకు జీవితఖైదు కానీ, మరణ శిక్ష కానీ ఉండదు. 16-18 ఏళ్ల చేసే బాలలు చేసే నేరాలను సాధారణ, తీవ్రమైన, హేయమైన నేరాలుగా వర్గీకరించారు. వీటి విచారణ విధానాలను కూడా వేర్వేరుగా నిర్వచించారు. హేయమైన నేరాలను పెద్దల చట్టాల ప్రకారం విచారిస్తారు. ఏ బాల నేరస్థుడైనా సరే, వారికి ఎలాంటి శిక్ష పడినా 21ఏళ్ల వయసు వచ్చేంత వరకూ బాలనేరస్థుల శిక్షణాలయం(బోర్స్టల్)లోనే ఉంచుతారు. 21ఏళ్ల తరువాత వారి ప్రవర్తనను అంచనా వేస్తారు. పరివర్తన వచ్చిందని భావిస్తే శిక్షలో మార్పు చేయవచ్చు ప్రవర్తన సరిగా లేకపోతే శిక్షను కొనసాగించవచ్చు. కాలం చెల్లిన చట్టాలకు చెల్లు: 32 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమో దం తెలిపింది. ఈ బిల్లు గత శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొం దింది. అయితే కొన్ని సాంకేతిక సవరణలతో తిరిగి దిగువసభకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానందగౌడ ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించింది. -
అత్యాచారం కేసుల్లో పిల్లలైనా పెద్దల్లాగే శిక్షించాలి
అత్యాచారాల్లాంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న బాలలను వయోజన నేరస్తులతో సమానంగా పరిగణించి శిక్షించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు. చెన్నైలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ లైంగికపరమైన నేరాలకు పాల్పడుతున్న 16 ఏళ్లవారిలో సగం మందికి పైగా జువెనైల్ చట్టం గురించి బాగా తెలుసని పోలీసులు చెబుతున్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఇలా చట్టాల గురించి తెలుసుకుని, వాటినుంచి తప్పించుకుంటూ దారుణమైన నేరాలకు పాల్పడుతున్నవారిని వయోజనులతో సమానంగానే పరిగణించి శిక్షించాలని, అలాగైతేనే ఇతరులు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా భయపడతారని ఆమె చెప్పారు. -
అత్యాచారం, హత్య, దోపిడీ.. మసకబారుతున్న బాల్యం
దిగజారుతున్న శాంతిభద్రతలకు, నైతిక విలువలకు ఈ ప్రభుత్వ నివేదిక ఓ హెచ్చరిక లాంటింది. అత్యాచారం, హత్య వంటి నేరాల్లో పాల్గొంటున్న బాలుర సంఖ్య క్రమేణా పెరుగుతోంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటాలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ చట్టాలను సవరించాల్సిన ఆవవ్యకతను తెలియజేసింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2002లో దేశంలో 485 మంది బాలురకు అత్యాచార కేసుల్లో ప్రమేయం ఉండగా, 2012లో 1175 మందిపై కేసులు నమోదయ్యాడు. ఇక 2002లో 531 మంది బాలురను హత్య కేసుల్లో అరెస్ట్ చేయగా.. గతేడాది ఆ సంఖ్య 990కు పెరిగింది.ఇళ్లకు కన్నాలు వేయడం, దారిదోపిడీలు, కిడ్నాప్ వంటి కేసుల్లో అరెస్టవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. హత్యాయత్నం, చీటింగ్, దౌర్జన్యం వంటి కేసులు కూడా క్రమేణా పెరుగుతున్నాయి. బాలనేరస్తుల సంఖ్య పెరగడానికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యం, మానసిక స్థితి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
లక్నోలో విషం తాగిన బాల నేరస్థులు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న బాల నేరస్థుల సంరక్షణ కేంద్రంలో ముగ్గురు బాల నేరస్థులు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ముగ్గురిపైనా అత్యాచారం, హత్య ఆరోపణలున్నాయి. వారిలో ఒకరు లక్నోకు చెందినవారు కాగా, మరో ఇద్దరు మాత్రం సమీపంలోని ఉన్నావో జిల్లాకు చెందినవారు. వీళ్లంతా 15-16 ఏళ్ల మధ్య వయసువారే. గత కొన్ని నెలలుగా వీళ్లు బాల నేరస్థుల సంరక్షణ కేంద్రంలో ఉన్నారు. అసలు వాళ్లకు విషం ఎక్కడినుంచి వచ్చిందన్న విషయంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. అలాగే వాళ్లు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోడానికి కారణమేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురు బాల నేరస్థులు చాలా నేరాలకు సంబంధించి దోషులుగా తేలారని జువెలైన్ జస్టిస్ బోర్డు ఇంతకుముందు తెలిపింది.