దొరికిన చిన్నారులు
చెన్నై కెల్లీస్‌లోని జువనైల్ హోం నుంచి సోమవారం తప్పించుకున్న 33 మంది బాలనేరస్తుల్లో 31 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోగా గాలిస్తున్నారు. పట్టుబడిన వారిలో 30 మందిని చెంగల్పట్టు హోమ్‌కు తరలించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కీల్‌పాక్ కెల్లీస్‌లో ప్రభుత్వ బాలనేరస్తులను ఉంచే జువెనైల్ హోం ఉంది. హత్య, దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాలకు పాల్పడే 18 ఏళ్ల లోపు బాల నేరస్తులను అక్కడ ఉంచుతారు. మొదటి అంతస్తులో 21 మంది, రెండో అంతస్తులో 53 మంది ఉన్నారు. ఇళ్లలో చోరీలకు పాల్పడే వారికి, రౌడీలు కిరాయి గూండాలతో సంబంధాలున్న వారి మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే హోం నుంచి తప్పించుకు పోవడం సహజమై పోయింది.
రౌడీలతో సంబంధాలు ఉన్నవారు తప్పిం చుకు పోవడం, మరో గ్రూపు వారు హోం అధికారులకు సమాచారం ఇవ్వడమే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణం. ఇదిలా ఉండగా, క్రోంపేటకు చెందిన ఒక బాలుడు, తండయారుపేటకు చెందిన మరో బాలుడు నేరాలు చేసి గత నెల హోంలోకి వచ్చారు. వీరిద్దరి జామీన్ కోసం బెయిల్ దరఖాస్తు చేసి ఉన్నారు. వీరిలో తండయార్‌పేటకు చెందిన బాలుడికి బెయిలు మంజూరు కాకపోవడంతో గందరగోళం సృి ష్టంచైనా హోం నుంచి బైటపడాలని పథకం పన్ని తన స్నేహితులకు చెప్పాడు. ఈ విషయం క్రోంపేటకు చెంది న బాలుడికి తెలి సిపోయింది.
హోం నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదనే దృక్ఫథంతో ఉన్న క్రోంపేట బాలుడికి అధికారుల్లో మంచి పేరు ఉన్నందున స్వేచ్ఛగా బైటకు వెళ్లివచ్చే వెసులుబాటు కల్పించారు. ఇలా రెండుగా విడిపోయిన గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తండయారుపేటకు చెందిన బాలుడి బృందం ఈ నెల 10వ తేదీన హోంలోని ట్యూబ్‌లైట్‌ను పగులగొట్టి గలాటా సృష్టించారు. అయితే హోం వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
మరో గ్రూపునకు చెందిన బాలుడు అధికారులను నిలదీశాడు. చీకట్లో భద్రతా చర్యలు ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. దీంతో అదేరోజు రాత్రే ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. చీకటి, రాత్రి వేళ కావడంతో కొద్దిసేపటికి వారే శాంతించారు. ఈ దశలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తండయారుపేట బాలుడికి బెయిలు రాలేదనే సమాచారం వచ్చింది. దీంతో ఆ బాలుడు మొదటి అంతస్తులోని తన గ్రూపువారితో కలిసి తలుపుల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించాడు. వీరికి మద్దతుగా మరో 33 మంది అక్కడికి చేరుకున్నారు.
ఒక తాడును తయారుచేసి ఒకరి తర్వాత ఒకరు 33 మంది గోడదూకి కూవం నది గట్టుమీదుగా పారిపోయారు. పారిపోతున్న సమాచారాన్ని అధికారులకు చేరవేయడంతో మళ్లీ ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సమాచారం అందుకున్న కీల్‌పాక్ పోలీసులు పారిపోయిన 33 మందిని పట్టుకునే వేట సోమవారం రాత్రి ప్రారంభించారు. పట్టుబడిన 31 మందిని జువెనైల్ హోంకు తరలించారు. ఇదే సమయంలో హోం నుంచి నలుగురు బాలురు తప్పించుకునే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకునేందుకు చుట్టుముట్టారు. తమను పట్టుకుంటే కోసుకుంటామని వారి వద్దనున్న బ్లేడు, కత్తులను బైటపెట్టి బెదిరించారు.
వారి తల్లిదండ్రులతో సమాధాన పరిచే ప్రయత్నాన్ని కూడా ధిక్కరించి తమ వద్దనున్న ఆయుధాలతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గాయపడిన నలుగురిని కీల్‌పాక్ ఆసుపత్రిలో చేర్పించారు. 30 మంది బాలనేరస్తులను చెన్నై హోం నుంచి చెంగల్పట్టు హోంకు మంగళవారం తరలించారు. మరో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తప్పించుకున్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.