ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీ: జనాల మీద సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. సందేశాత్మక చిత్రాల్లోనూ సరదాను వెతుక్కనే స్వభావం మన సగటు ఆడియొన్స్‌ది. పైగా ‘సినిమాలోని సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలే. అనుకరించకండి’ అంటూ సినిమా ముందు వచ్చే విజ్ఞప్తులను పట్టించుకునేవాళ్లు కనిపించరు!. ప్రత్యేకించి అందులోని ఘట్టాల అనుకరణ.. సరదా వరకైతే పర్వాలేదు. అదే సీరియస్ మలుపు తీసుకుంటే..
దేశ రాజధాని పరిధిలో జరిగిన ఓ నేరం ఇప్పుడు ‘సినిమా ఇచ్చే సందేశం’ గురించి చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ జహంగీర్‌పురిలో జరిగిన ఓ హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ సినిమాతో పాటు ఓ హిందీ వెబ్ సిరీస్ స్ఫూర్తితో నేర ప్రవృత్తిలోకి దిగామంటూ ముగ్గురు టీనేజర్లు స్టేట్‌మెంట్ ఇవ్వడం కలకలం రేపింది.
నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ బస్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్లలో ఒకడు ‘బద్నాం’ పేరుతో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ఏరియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో తరచూ ఇతరులకు దమ్‌కీ ఇస్తూ.. ఆ ఘటనలను షార్ట్ వీడియోలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప’ సినిమా చూసిన ఆ గ్యాంగ్.. అందులో పుష్పరాజ్‌లా ఎదగాలనే ప్లాన్‌వేసింది. ఇందుకోసం అటుగా వెళ్తున్న ఓ అమాయకుడిని ఎంచుకుంది.
ఆ యువకుడిని చావబాదుతూ.. ఆ వీడియోను రికార్డు చేశారు. వాళ్లను చెదరగొట్టి.. కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో ఆ వ్యక్తి మృతి చెందగా.. బాధితుడిని 24 ఏళ్ల శిబుగా గుర్తించారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమను తాము ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో, గ్యాంగ్‌స్టర్‌లుగా ఎదగాలన్న ఉద్దేశంతో పుష్ప సినిమాను, బౌకాల్ సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని, వాటిల్లో హీరోల మాదిరిగా ఎదిగే ప్రయత్నం చేశామని చెప్పడంతో కంగుతినడం పోలీసులు వంతూ అయ్యింది. ఈ నేరంలో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment