జైలులో ఉన్న ఖైదీలు, బాలనేరస్థుల జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య , 'పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్' 8వ దశను, 'నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్' 5వ దశను ప్రారంభించారు.
ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టిన ఈ రెండు కార్యక్రమాలు.. 22 జైళ్లు, జువైనల్ హోమ్‌లలో 1000 మందికి పైగా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా ఇండియన్ ఆయిల్ 23 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 మహిళా బాల్య కేంద్రాలతో సహా 150 సంస్థలలో 7300 మంది ఖైదీలకు స్పోర్ట్స్ కోచింగ్, పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉంది.
పరివర్తన్ - ప్రిజన్ టు ప్రైడ్, నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్ ప్రారంభించిన సందర్భంగా ఇండియన్ ఆయిల్ చైర్మన్ మాట్లాడుతూ.. కార్పోరేట్ సంస్థల్లో ఇండియన్ ఆయిల్ అగ్రగామిగా నిలిచి జైలులో ఉన్న వారికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నాను. జైలు జీవితాలను గడిపిన వారు క్రీడల్లో రాణించేలా ప్రయత్నాలు సాగిస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జైలు అధికారులు.. ఖైదీలు, బాలనేరస్థులు మెరుగైన జీవితాన్ని నిర్మించడంలో మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకోవడం గొప్ప విషయం. దీనికోసం ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు.
ఇప్పటికే ఇండియన్ ఆయిల్ తీసుకున్న చొరవతో.. ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) నిర్వహించిన ఖైదీల ఇంటర్‌కాంటినెంటల్ “చెస్ ఫర్ ఫ్రీడమ్” ఆన్‌లైన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పూణేలోని యెరవ్డా జైలులోని ఖైదీలు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఖైదీలను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న కారణంగా శ్రీకాంత్ మాధవ్ వైద్యకు ప్రపంచ చెస్ సమాఖ్య 'ఫ్రెండ్ ఆఫ్ ఫిడే" అనే ప్రతిష్టాత్మక బిరుదును అందించింది.
‘పరివర్తన్-ప్రైజన్ టు ప్రైడ్’ కార్యక్రమం 2021 ఆగస్టు 15న ప్రారంభమైంది, అయితే ‘నయీ దిశ - స్మైల్ ఫర్ జువెనైల్’ను 2023 జనవరి 26న మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఖైదీలను క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ.. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment