![El Salvador Prison Is Like Hell On Earth](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Trump_jail1.jpg.webp?itok=JepB0Ldp)
ఎల్ సాల్వడార్ మహా కారాగారం... ప్రపంచంలోనే అత్యంత అధ్వాన జైలుగా ‘అప్రసిద్ధి’. ఖైదీలు ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం అసంభవం. 60 ఏళ్లు మొదలుకొని వెయ్యేళ్లకు పైగా కారాగారవాస శిక్షలు పడిన ఖైదీలు ఇక్కడ ఉంటారు. వెయ్యి మంది అధికారులు, 600 మంది సైనికులు, 250 మంది పోలీసులు ఈ జైలును పర్యవేక్షిస్తుంటారు.
స్టీలుతో పెట్టెల్లా తయారుచేసిన బోనుల్లాంటి నాలుగు అరల పడకల్లో (మెటల్ బంక్ బెడ్స్) ఖైదీలు దాదాపు రోజంతా మోకాళ్లపై వంగి కూర్చోవాలి లేదా చతికిలబడి కూర్చోవాలి. పరుపులు ఉండవు. వారు గుసగుసలాడుకోవాల్సిందే తప్ప పెద్దగా మాట్లాడుకునేందుకు అనుమతించరు. భోజనంగా మూడు పూటలా వరి అన్నం, బీన్స్, పాస్టా, ఉడికించిన గుడ్డు పెడతారు. మాంసం వడ్డించరు.
ఎల్ సాల్వడార్లో 1990వ దశకం చివర్లో ఎంఎస్-13, బారియో 18 అనే రెండు గ్యాంగులు మాదకద్రవ్యాల వ్యాప్తి, బలవంతపు వసూళ్లతో చెలరేగాయి. పరస్పరం ప్రత్యర్థులైన ఈ రెండు ముఠాలు దేశాన్ని వణికించాయి. అయినా ప్రస్తుతం జైల్లో మాత్రం ఈ రెండు గ్రూపుల సభ్యుల్ని కలిపే ఉంచుతున్నారు. గ్వాంటనామో బే కారాగారం కంటే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి.
శిక్షాకాలం ముగిసినా ఖైదీలను సమాజంలోకి విడిచిపెట్టరు. వారు బయటి ప్రపంచాన్ని చూసే అవకాశమే లేదు. ఒకరకంగా చెప్పాలంటే వారు జీవచ్ఛవాలు! తమ దేశంలో హింసకు పాల్పడే ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అనైతికమని, న్యాయసమ్మతం కాదని ఆయన రాజకీయ విరోధులు విమర్శిస్తున్నారు.
‘ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత నియంత’ (వరల్డ్స్ కూలెస్ట్ డిక్టేటర్) గా తనను తాను అభివర్ణించుకునే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే మాత్రం తమ జైలు సేవలకు ప్రతిగా అమెరికా అందించే ‘ఆఫర్’ కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. ఇంతకీ అమెరికా ఆఫర్ ఏమిటి? ఏ రూపంలో? ఎంత? వివరాలు బయటికి రాలేదు!
Comments
Please login to add a commentAdd a comment