![World Most Feared Prison El Salvador](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/World-Most-Feared-Prison-El.jpg.webp?itok=HxIcj_wm)
కిక్కిరిసినా కుక్కుతారు..
ఒక్కో బందీకి లభించే చోటు.. ఆరు చదరపు అడుగులే
త్వరలో అమెరికా ఖైదీల తరలింపు?
ఎల్ సాల్వడార్.. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్యనున్న సెంట్రల్ అమెరికాలో ఓ చిన్న దేశం. ఇందులో ఉందొక మహా కారాగారం. దాని పేరు- టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. క్లుప్తంగా సెకోట్ (CECOT). అంటే... సెంటర్ ఫర్ కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిజం. ‘ఉగ్రవాద కట్టడి కేంద్రం’ అనొచ్చు. ఈ జైలును ఉద్దేశపూర్వకంగానే నగర వాతావరణానికి దూరంగా పల్లెపట్టున నిర్మించారు. రాజధాని శాన్ సాల్వడార్ కు తూర్పుగా 40 మైళ్ళ దూరంలోని గ్రామీణ ప్రాంతంలో 57 ఎకరాల్లో విస్తరించిన ఈ మెగా ప్రిజన్.. లాటిన్ అమెరికాలోనే అతి పెద్ద జైలు. ఇందులో 40 వేల మంది వరకూ ఖైదీలను బంధించవచ్చు.
పేరుమోసిన క్రిమినల్ గ్యాంగ్స్... ప్రత్యేకించి MS-13, బార్లో-18 సభ్యుల్ని ఇక్కడే బంధిస్తుంది ఎల్ సాల్వడార్. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 ఆగస్టు నాటికి ఇందులోని ఖైదీల సంఖ్య 14,500. ఈ జైలు విషయంలో ప్రశంసలు తక్కువగా, విమర్శలు ఎకువగా వినిపిస్తాయి. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడేవారు ‘సెకోట్’ను సమర్థిస్తారు. మానవ హక్కుల సంస్థలు మాత్రం పదునైన విమర్శలతో విరుచుకుపడతాయి. ఎల్ సాల్వడార్ ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఈ జైల్లో ఎక్కువ మంది ఖైదీలున్నట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.
అతి ఇరుకైన ఈ కారాగారంలో ఒక్కో ఖైదీకి లభించే చోటు కేవలం 6.45 చదరపు అడుగులు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఇది విరుద్ధం. ఈ జైల్లో పరిస్థితులు అత్యంత కఠినంగా, ప్రమాదకరంగా ఉంటాయి. దేశ జనాభా ప్రకారం చూస్తే ప్రతి లక్ష మంది పౌరుల్లో 1,659 మంది ఖైదీలతో ఎల్ సాల్వడార్... ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఖైదీలున్న దేశం. దోషులుగా నిర్ధారితులై తమ జైళ్ళలో ఉన్న కొందరు ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలని అమెరికా భావిస్తోంది.
ఈ మేరకు ఎల్ సాల్వడార్‌కు అగ్రరాజ్యం ‘మాంచి ఆఫర్’ ఇచ్చింది కూడా. అయితే అమెరికా రాజ్యాంగం తమ దేశ పౌరులకు భద్రత కల్పించింది. నేరస్థుల పౌరసత్వాన్ని లాక్కొనే హక్కు ఎవరికీ లేదని అమెరికా కోర్టులు కూడా గతంలో తీర్పులు వెలువరించాయి. దీని ప్రకారం నేరగాళ్లను బహిష్కరించే, వేరే దేశానికి వెళ్లగొట్టే అధికారం అమెరికాకు లేదు.
అయితే తమ ఖైదీల నిర్వహణ ఖర్చు తగ్గించుకునే అవకాశాల్ని దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్వేషిస్తున్నారు. పదే పదే నేరాలకు పాల్పడే అమెరికన్లను అతి తక్కువ ఫీజు చెల్లించి ఇతర దేశాల్లో నిర్బంధించే అవకాశాలను తాను పరిశీలిస్తున్నట్టు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. దీనిపై విపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అమెరికా ఖైదీలను తమ దేశంలో బంధిస్తే మానవ హక్కుల ఉల్లంఘన అధికమవుతుందని, మానవ హక్కులు మరింత ప్రమాదంలో పడతాయని ఎల్ సాల్వడార్ స్వచ్ఛంద సంస్థలు ఆక్రోశిస్తున్నాయి.
::జమ్ముల శ్రీకాంత్
(Credit: Reuters)
Comments
Please login to add a commentAdd a comment