గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..
జబల్‌పూర్: వివిధ కేసుల్లో రిమాండ్‌లో ఉన్న పది మంది బాలనేరస్తులు జువెనైల్ హోం నుంచి పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జువెనైల్ హోంకు గార్డుగా ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి బాలనేరస్తులు పరారయ్యారు.
రాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గార్డును తీవ్రంగా కొట్టి తాళాలు లాక్కొని.. పది మంది బాల నేరస్తులు పరారయ్యారని రిమాండ్ హోం అధికారి పునిత్ వర్మ వెల్లడించారు. పరారైన వారికోసం గాలింపు చేపడుతున్నామని రాంజీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ శుక్లా తెలిపారు.