- కేంద్ర మంత్రి సదానందగౌడకు యడ్డి విన్నపం
శివమొగ్గ, న్యూస్‌లైన్ :రైల్వే బడ్జెట్‌లో శివమొగ్గకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి డి.వి.సదానందగౌడను శివమొగ్గ ఎంపీ బి.ఎస్.యడ్యూరప్ప, మాజీ ఎంపీ బి.వై.రాఘవేంద్ర కోరారు. ఇటీవల ఢిల్లీలో సదానందగౌడను కలిసి వారు వినతిపత్రం అందించారు. శివమొగ్గ-హరిహర రైల్వేమార్గం ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
అదే విధంగా 2012-13 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన శివమొగ్గ-శికారిపుర-రాణిచెన్నూరు రైల్వేమార్గానికి బదులుగా శివమొగ్గ-శికారిపుర-హనగల్-తడస మార్గం గూండా హుబ్లీకి రైల్వేమార్గం నిర్మాణం చేపట్టాలని కోరారు. బీరూరు-శివమొగ్గ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించాలని, శివమొగ్గ నుంచి బెంగళూరుకు అర్ధరాత్రి సమయంలో రైలు సౌకర్యం కల్పించాలని కోరారు.
గోవా, ఘన, ముంబై, గుజరాత్‌కు వెళ్లేందుకు తాళగెప్పె నుంచి హొన్నాళి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసి దానిని కొంకణి రైల్వేలో చేర్చాలని విన్నవించారు. నంబర్16227-16228 బెంగళూరు-తాళగుప్పె-బెంగళూరు రైలుకు ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని, శివమొగ్గ రైల్వేస్టేషన్‌లో స్కైవాకర్ నిర్మించాలని, శివమొగ్గ తాలూకా హొన్నవిలే హసూడిపార్మ, దడమఘట్ట తదితర గ్రామాల ప్రజలకు అనుకూలంగా లెవల్ క్రాసింగ్ గేట్ ఏర్పాటు చేయాలని కోరారు.
భద్రావతిలో రైల్వే వంతెన పనులు వేగవంతం చేయాలని, శివమొగ్గ తాలూకా బీదర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక ప్రాంతం వద్ద రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
రామచంద్రాపురమఠ, కూల్లూరు ఇతర ధార్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తాదులకు అనుకూలంగా హొసనగర తాలూకా, అరసాళు, శివమొగ్గ తాలూకాలోని హరనపాళ్య రైల్వేస్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లకు హాల్ట్ ఏర్పాటు చేయాలని, శివమొగ్గ రైల్వేస్టేషన్ సమీపంలో వంద అడుగుల రింగ్‌రోడ్డు నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించాలని యడ్యూరప్ప, రాఘవేంద్ర విన్నవించారు.