గౌడ రైలు ‘కూత’పెట్టేనా?
- సబర్బన్ రైలు సంచారంపై ఆశలు
- ప్రతిపాదనలకే పరిమితమైన రైళ్ల పరుగు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రానికి చెందిన రైల్వే మంత్రి డీవీ. సదానంద గౌడ మంగళవారం తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. గత యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా వ్యవహరించిన మల్లిఖార్జున ఖర్గే, అంతకు ముందు రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేసిన కేహెచ్. మునియప్పలు కర్ణాటక వారే అయినా, సొంత రాష్ట్రంపై కాక తాము ప్రాతినిథ్యం వహించే నియోజక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రతిపాదనలు చేశారు.
రాష్ట్రానికి సుమారు 12 కొత్త రైళ్లను ఖర్గే ప్రతిపాదించగా, అందులో తొమ్మిది రైళ్లు తన సొంత నియోజక వర్గం గుల్బర్గ మీదుగా పోయేట్లు ‘జాగ్రత్తలు’ తీసుకున్నారు. అందుకే అప్పట్లో విమర్శకులు ‘ఖర్గే రైలు వయా గుల్బర్గ’ అని చమత్కరించే వారు. అవిభక్త గుల్బర్గ జిల్లాలోని యాదగిరికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ఖర్గే మంజూరు చేశారు. అంతకు ముందు మునియప్ప తన సొంత నియోజక వర్గం కోలారుకు కూడా ఓ కోచ్ ఫ్యాక్టరీని ప్రతిపాదించుకున్నారు. ఇవన్నీ ఆచరణలో సాధ్యమా, కాదా...అనేది వేయి డాలర్ల ప్రశ్న.
సబర్బన్ రైలు కావాలి
బెంగళూరులో మెట్రో రైలు సంచరిస్తున్నప్పటికీ, చెన్నై, ముంబైలలో లాగా సబర్బన్ రైలు కావాలనే డిమాండ్ ఉంది. దీని వల్ల నగర వాసులకు ఎంతో ఉపయోగం ఉంటుంది కనుక వచ్చే బడ్జెట్‌లో సబర్బన్ రైలును ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ గౌడ ఇటీవల బెంగళూరులో సదానంద గౌడకు వినతి పత్రాన్ని సమర్పించారు. దాంతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సేకరించిన పది వేల సంతకాలను కూడా జతపరిచారు. బీజేపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ ఈసారి రైల్వే బడ్జెట్‌లో సబర్బన్ రైలు ప్రకటిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కొత్త రైళ్ల కోసం విన్నపం
రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల నుంచి ఇంకా రాజధాని బెంగళూరుకు రైల్వే కనెక్టివిటీ లేదనే విమర్శలున్నాయి. దీనిపై తాను గతంలో అనేక మంది రైల్వే మంత్రులను కలిశానని దక్షిణ రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు ప్రకాశ్ మండోత్ తెలిపారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లైన చిక్కమగళూరు-బెంగళూరు, హరిహర, దావణగెరె-బెంగళూరు, మంగళూరు-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటించాలని కోరామని వివరించారు.
బెంగళూరు-ముంబై ఏసీ సూపర్ ఫాస్ట్, బెంగళూరు-రామేశ్వరం, బెంగళూరు-నిజాముద్దీన్ (రాజధాని) వయా హుబ్లీ లాంటి అంతర్ రాష్ట్ర రైళ్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఇంకా...యశ్వంతపుర-కార్వార రోజూ రైలు, యశ్వంతపుర-మిరాజ్ స్పెషల్ వయా హుబ్లీ డెయిలీ సర్వీస్‌లకు డిమాండ్లు ఉన్నాయి.
ఇంకా...చామరాజ నగర-బెంగళూరు, హొస్పేట-బెంగళూరు, హుబ్లీ-బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అంతర్ రాష్ర్ట సర్వీసులైన బెంగళూరు-వారణాసి వయా జబల్పూర్, బెంగళూరు-హరిద్వార్ వయా ఢిల్లీ, బెంగళూరు-షిర్టీ వయా రాయచూరు, బెంగళూరు-ఉదయ్‌పూర్ వయా పుణె, హుబ్లీ-చెన్నై వయా బళ్లారి, రేణిగుంట రైళ్లను ప్రవేశ పెట్టాలనే డిమాండ్లు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.