'సిద్ధు సర్కార్‌ను దించడమే లక్ష్యం'
Published Fri, Jul 8 2016 12:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
-బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప
బెంగళూరు: రైతులు, మధ్యతరగతి ప్రజలకు సిద్ధు సర్కారు కంటకంగా మారిందని, ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా విభాగం అధ్యక్షుడిగా ప్రతాప్ సింహ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ... రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ అభ్యర్థులను పోటీకి నిలబెడుతుందన్నారు. కనీసం 150 స్థానాలను గెలుచుకోవాలన్నది పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్‌షా ఆశయమన్నారు. ఇందు కోసం కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా రుణమాఫీ విషయంలో సిద్ధరామయ్య మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు.
ఇక పారిశ్రామిక అభివృద్ధి తిరోగమన దిశలో ప్రయాణిస్తోందన్నారు. ఫలితంగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందగా ఉందని అభివర్ణించారు. అయితే సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాల వల్లే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే భ్రమ పెట్టుకోవద్దని, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకుపోయేలా ప్రచారం చేయాలన్నారు. బూత్ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని యడ్యూరప్ప దిశానిర్దేశం చేశారు. మహిళల సంక్షేమం కోసం భాగ్యలక్ష్మీ పథకాలను తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేయగా ప్రస్తుతం చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని మెచ్చుకోవడమే కాకుండా యథాతథంగా అమలు చేస్తున్నాయన్నారు. అయితే రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం రాజకీయ కోణంతో అలోచించి ఈ పథకం అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యడ్యూరప్ప అరోపించారు.
Advertisement