ఏమౌతుందో?
- రేపే కౌంటింగ్..
- ‘ఉప’ ఫలితాలపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ
- సీఎం సిద్ధుకు ప్రతిష్టాత్మకం
- మంచి ఫలితాలు రాబట్టే నేతలకు ‘తాయిలాలు’?
- కార్పొరేషన్లు, బోర్డుల నియామకాల్లో వారికి ప్రాధాన్యత
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసన సభ స్థానాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. బళ్లారి గ్రామీణ, శివమొగ్గ జిల్లా శికారిపుర, బెల్గాం జిల్లా చిక్కోడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం ఫలితాలు వెలువడనున్నాయి.
గత శాసన సభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ, శికారిపురల్లో బీఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీరాములు, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పలు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు వారు బీజేపీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. కనుక ఈ స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నట్లే లెక్క. వీటిని ఆ పార్టీ తిరిగి చేజిక్కించుకుంటుందా లేదా కాంగ్రెస్ పరం చేస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఈ రెండు స్థానాల్లో బీజేపీకే కాస్త మొగ్గు కనిపిస్తోందని వినిపిస్తున్నప్పటికీ, అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా చేయడానికి వీల్లేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్నందున, దానిని దీటుగా ఎదగడానికి ఉప ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసింది.
ఇందులో భాగంగా జేడీఎస్ నాయకులకు గాలం వేసింది. శికారిపురలో జేడీఎస్ స్థానిక నాయకత్వం బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థి శాంత వీరప్ప గౌడకు ప్రచారం చేసింది. బళ్లారిలో కొందరు జేడీఎస్ నాయకులను తన వైపు లాక్కుంది. అయితే ఈ నియోజక వర్గాల్లో జేడీఎస్‌కు చెప్పుకోదగ్గ బలం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కనుక ఆ పార్టీ మద్దతు వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ ఉండదని వారి అంచనా. చిక్కోడి-సదలగ స్థానాన్ని గతంలో కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆ పార్టీలో విశ్వాసం వ్యక్తమవుతోంది.
సీఎంకు ప్రతిష్టాత్మకం
మూడు స్థానాలను గెలుచుకోవడం ద్వారా అధిష్టానం వద్ద తన పలుకుబడిని పెంచుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టి ప్రయత్నమే చేశారు. ఆ నియోజక వర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిలుగా నియమించి, వారికి పూర్తి సేచ్ఛను ఇచ్చారు. పార్టీలో విభేదాలను పక్కన పెట్టి అందరినీ ఏక తాటిపై నడిపించడంలో కొంత వరకు కృతకృత్యులయ్యారు. మంచి ఫలితాలను చూపిన స్థానిక నాయకులకు కార్పొరేషన్లు, బోర్డుల నియామకాల ‘తాయిలాల’ను చూపెట్టారు. ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయో, లేదో...తేలడానికి మరో రోజు వేచి ఉండక తప్పదు.