ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజ
న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అసోం, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలోని పది స్థానాలకు ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని బోరంజ్, ఢిల్లీ రాజౌరి గార్డెన్, అసోం, హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, లితిపురాలో జేఎంఎం అభ్యర్థి, కర్ణాటకలోని నజంగుడు, గుండ్లుపేట ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.
థీమజీ (అస్సాం), భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), అతెర్, బాంధవ్‌గఢ్ (మధ్యప్రదేశ్), కంతీదక్షిన్ (వెస్ట్ బెంగాల్), ధోల్‌పూర్ (రాజస్థాన్), నజంగుడు, గుండ్లుపేట్ (కర్ణాటక) లతిపురా (జార్ఖండ్), ఉప్పేర్ బుర్‌తూక్ (సిక్కిం), రాజౌరీ గార్డెన్ (ఢిల్లీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే జమ్మూ,కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్, కేరళలోని మలప్పురం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
బుద్గాం జిల్లాలో రీపోలింగ్
మరోవైపు శ్రీనగర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పోలింగ్ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీ పోలింగ్ జరుగుతోంది. అల్లర్లు, ఓటింగ్ తక్కువగా నమోదు కావడంతో ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ నిర్వహిస్తోంది. రీ పోలింగ్‌కు అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఓటింగ్ కొనసాగనుంది. కాగా శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన గొడవల్లో పోలీసులు కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతిచెందిన విషయం తెలిసిందే.