సత్తాచాటిన బీజేపీ.. కాంగ్రెస్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటగా, కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. గురువారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఐదు, కాంగ్రెస్ మూడు, టీఎంసీ, జేఎంఎం ఒక్కో సీటు గెల్చుకున్నాయి.
కమలం పార్టీ మూడు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు అదనంగా మరో రెండు సీట్లను కైవసం చేసుకుంది. రాజౌరి గార్డెన్ (ఢిల్లీ), దోల్‌పూర్ (రాజస్థాన్), బంద్‌గఢ్ (మధ్యప్రదేశ్), బోరంజ్ (హిమాచల్ ప్రదేశ్), డెమజీ (అసోం) అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇంతకుమందు దోల్‌పూర్‌లో బీఎస్పీ, రాజౌరి గార్డెన్‌లో ఆప్ గెలుపొందగా.. తాజా ఫలితాల్లో ఈ రెండు సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఇటీవల వరుస పరాజయాలు మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజా ఫలితాలు ఊరట కలిగించాయి.
కర్ణాటకలోని గుండ్లుపేట్, నంజన్‌గూడ్, మధ్యప్రదేశ్‌లోని అతెర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అతెర్‌లో కాంగ్రెస్ 800 ఓట్లతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మూడు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానాలు. ఇక పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ కాంతి దక్షిణ్ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకుంది. జార్ఖండ్‌లోని లితిపర్‌లో జేఎంఎం గెలుపొందింది. కాగా ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజౌరి గార్డెన్ స్థానంలో ఆప్ మూడో స్థానానికి పడిపోయింది.