ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ బీజే పీ తీరుపై విరుచుకుపడింది
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ బీజే పీ తీరుపై విరుచుకుపడింది అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.
మేము అన్నివిధాలా సిద్ధమే
‘ఉప ఎన్నికల ప్రకటనతో శాసనసభ రద్దుకు బీజేపీ జంకుతోందనే విషయం స్పష్టమైంది. శాసనసభ ఎన్నికల విషయంలో ఆ పార్టీ పలాయనం చిత్తగించింది. మేము ఉప ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నాం. మోడీ వేవ్ అంటూ ఒకవైపు బలంగా వాదిస్తూనే మరోవైపు ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ జంకడం నాకు బాగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉప ఎన్నికల ప్రకటనతో శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సుముఖంగా లేదని తేలిపోయింది. శాసనసభను తక్షణమే రద్దు చేయాలి. ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే సహించబోం. ఢిల్లీ శాసనసభకు తక్షణమే ఎన్నికలు జరపాల్సిందే. రాజకీయ అనిశ్చితి తొలగిపోవడానికి ఇంతకుమించి మరో మార్గమే లేదు’ అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ పేర్కొన్నారు.