గుజరాత్‌లో హైడ్రామా.. | Gujarat Rajya Sabha poll counting delayed; Congress, BJP rush to EC 3 times each | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో హైడ్రామా..

Published Wed, Aug 9 2017 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గుజరాత్‌లో హైడ్రామా.. - Sakshi

గుజరాత్‌లో హైడ్రామా..

నాటకీయ మలుపులతో రాజ్యసభ ఎన్నికలు
► బ్యాలెట్‌ పత్రాలను చూపిన ఇద్దరు కాంగ్రెస్‌ రెబల్స్‌
► వారిని అనర్హులుగా ప్రకటించాలని ఈసీని  కోరిన కాంగ్రెస్‌
► అలా కుదరదన్న బీజేపీ
► 7 గంటలు ఆగిన కౌంటింగ్‌
► ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవన్న ఈసీ


అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల రాజకీయ డ్రామా అనూహ్య ట్విస్ట్‌లతో సాగుతోంది. అతి సాధారణ పోరుగా నిలవాల్సిన ఈ పరోక్ష ఎన్నిక.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌  మధ్య ప్రతిష్టాత్మకంగా, ప్రత్యక్ష యుద్ధంగా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ ఓటమి లక్ష్యంగా బీజేపీ.. ఆయన గెలుపు పార్టీ ప్రతిష్టగా కాంగ్రెస్‌ భావించడంతో రెండు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఈ పోరాటాన్ని రక్తి కట్టించాయి. అయితే, పోలింగ్‌ అనంతరం కూడా ఈ డ్రామా కొనసాగుతుండటం విశేషం.

ఓటింగ్‌ సందర్భంగా ఇద్దరు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు.. తమ∙బ్యాలెట్‌ పేపర్లను బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు చూపారని, అది నిబంధనలకు విరుద్ధమని, వారి ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌ నిలిపేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ఢిల్లీలోని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ వెంటనే సీనియర్‌ మంత్రులతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం కూడా ఈసీ కార్యాలయానికి వెళ్లి, వెంటనే కౌంటింగ్‌ ప్రారంభించాలని కోరింది. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం రాష్ట్రంలోని ప్రిసైడింగ్‌ అధికారిదేనని ఈసీ స్పష్టం చేసింది. అనంతరం, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రతినిధి బృందాలు మళ్లీ ఈసీని కలిశాయి. ఆ తరువాత రాత్రి 11.30 గంటలకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

దాంతో మొత్తం చెల్లే ఓట్ల సంఖ్య 174గా మారింది. దాంతో అహ్మద్‌ పటేల్‌ గెలుపునకు 44 ఓట్లు సరిపోతాయి. కాంగ్రెస్‌కున్న 44 ఓట్లు, కాంగ్రెస్‌కే వేశానని చెబుతున్న జేడీయూ ఎమ్మెల్యే ఓటు కలిస్తే పటేల్‌ గెలుపునకు అవసరమైన ఓట్లు వచ్చేస్తాయి. పటేల్‌ గెలిస్తే.. అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీల సొంతగడ్డపై కాంగ్రెస్‌ సాధించిన ఘన విజయంగా దీన్ని అభివర్ణించవచ్చు. కాగా, మంగళవారం అర్ధరాత్రి దాటేంతవరకు కౌంటింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని బీజేపీ ప్రకటించింది.

గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో మంగళవారం మధ్యాహ్నానికే ఓటింగ్‌ ముగియగా.. నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల అనంతరం కౌంటింగ్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇద్దరు రెబల్‌ ఎమ్మెల్యేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్‌పార్టీ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు రాఘవ్‌జీ పటేల్, భోలా గోహిల్‌లు బీజేపీ అభ్యర్థి ఓటేసిన బ్యాలెట్లను కాంగ్రెస్‌ అధికారిక ఏజెంట్‌తోపాటు అమిత్‌ షా కూర్చున్న వైపు బీజేపీ ఏజెంట్‌కు కూడా చూపారని ఆరోపించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్‌ పేర్కొంది. ‘వారిద్దరు బీజేపీకి ఓటేశారు. బ్యాలెట్‌ పేపర్లను నాకు చూపడంతో పాటు.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కూర్చున్న వైపు బ్యాలెట్లను ఊపుతూ బీజేపీకి ఏజెంట్‌కు కూడా చూపించారు. ప్రిసైడింగ్‌ అధికారిపై ఒత్తిడి ఉంది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శక్తి సిన్హ్‌ గోహిల్‌ చెప్పారు.  

ఆ ఎన్నికల్ని మరిచారా: చిదంబరం
ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఈసీని ఆశ్రయించింది. పార్టీ నేతలు పి.చిదంబరం, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, అశోక్‌ గెహ్లాట్‌లు ఈ బృందంలో ఉన్నారు. గెలుపుపై బీజేపీ అంత ధీమాగా ఉంటే.. చట్టాన్ని గౌరవించాలని చిదంబరం సూచించారు. పార్టీ ఏజెంట్‌కు తప్ప ఎవరికి బ్యాలెట్‌ చూపినా ఆ ఓట్లు చెల్లవని.. జూన్‌ 2016లో హరియాణా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొరపాటున బ్యాలెట్‌ను సీఎల్పీ నేతకు చూపడంతో ఆ ఓటు చెల్లదని ప్రకటించారని, ఒక్క ఏడాదిలోనే చట్టాలు మారిపోతాయా? అని ఆయన ప్రశ్నించారు. కాగా మరోసారి బీజేపీ ప్రతినిధి బృందం ఈసీ కార్యాలయానికి వెళ్లి తమ డిమాండ్లను వినిపించింది. అనంతరం ఇరు బృందాలు మళ్లీ ఈసీని కలిశాయి.

పటేల్‌కు వాఘేలా షాక్‌!
మంగళవారం మధ్యాహ్నం ఓటింగ్‌ పూర్తి కాగానే ముఖ్య ఎన్నికల అధికారి బీబీ స్వాయిన్‌ మాట్లాడుతూ.. మొత్తం 176 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో అహ్మద్‌ పటేల్‌కు కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత శంకర్‌ సిన్హ్‌ వాఘేలా షాకిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అహ్మద్‌ పటేల్‌ ఓడిపోబోతున్నారు. అందుకే ఆయనకు నేను ఓటేయలేదు’ అని చెప్పారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ.. 45 ఓట్లు సాధిస్తామని, ఎన్సీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, జేడీయూ ఎమ్మెల్యే పటేల్‌కే ఓటేశారని చెప్పారు. అహ్మద్‌ పటేల్‌కే తాను ఓటేశానని జేడీయూ ఏకైక ఎమ్మెల్యే ఛోటూ వసావా వెల్లడించారు.

అమిత్‌ షా, ఇరానీల గెలుపు దాదాపు ఖరారు
ప్రస్తుతం గుజరాత్‌ అసెంబ్లీలో బీజేపీకి 121 మంది, కాంగ్రెస్‌కు 51 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఏడుగురు శంకర్‌సింఘ్‌ వాఘేలా నేతృత్వంలో పార్టీని వీడారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు గానూ నలుగురు బరిలో ఉన్నారు. గెలుపు కోసం ప్రతీ ఒక్కరికి కనీసం 45 మొదటి ప్రాధాన్య ఓట్లు రావాల్సి ఉండగా.. ఇద్దరి ఓట్ల తిరస్కరణతో ఆ సంఖ్య 44కి తగ్గింది.

బీజేపీకున్న సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే, బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీల గెలుపు ఖాయమే. మూడో స్థానం కోసం బీజేపీ నుంచి బల్వంత్‌ సిన్హ్‌ రాజ్‌పుత్, కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌ పోటీ పడుతున్నారు. పటేల్‌ గెలుపునకు కాంగ్రెస్‌కున్న 44 ఎమ్మెల్యేల ఓట్లు సాధిస్తే చాలు. ఎన్సీపీకి ఉన్న రెండు ఓట్లలో ఒకటి, జేడీయూకున్న ఏకైక ఓటు తనకే వచ్చాయని, ఇద్దరు రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లను ఈసీ తిరస్కరించడంతో తన గెలుపు ఖాయమని అహ్మద్‌ పటేల్‌ ధీమాగా ఉన్నారు.  


పోటాపోటీగా ఈసీని కలసిన బీజేపీ, కాంగ్రెస్‌
ఓటింగ్‌ వీడియో దృశ్యాల్ని పరిశీలించాలని రిటర్నింగ్‌ అధికారిని కాంగ్రెస్‌ కోరగా.. సరైన స్పందన రాకపోవడంతో సీన్‌ ఢిల్లీకి మారింది. రాత్రి 7 గంటల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. రణ్‌దీప్‌ సూర్జేవాలా, ఆర్పీఎన్‌ సింగ్‌లు ఓటింగ్‌ వీడియో ఫుటేజ్‌ను ఈసీకి సమర్పించారు.

అయితే ఈ అంశంలో రాష్ట్ర రిట్నరింగ్‌ అధికారే నిర్ణయం తీసుకుంటారని ఈసీ స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. ఇంతలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. అరుణ్‌ జైట్లీ, రవి శంకర్‌ ప్రసాద్, పియూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నఖ్వీలు ఈసీని కలిసి కాంగ్రెస్‌ ఫిర్యాదును తిరస్కరించాలని కోరారు. కౌంటింగ్‌ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని వారు ఆరోపించారు. ప్రిసైడింగ్‌ అధికారుల నిర్ణయమే అంతిమమని ఈసీ పేర్కొన్నట్లు గోయల్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement