రాజ్యసభ ఎన్నికలు: నెగ్గిన కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో నెలకొన్న హైడ్రామాకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తెరదించింది. ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ డిమాండ్‌కే ఈసీ మొగ్గుచుపుతూ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ చూపించి ఓటు వేశారని, వారి ఓట్లను లెక్కించవద్దని, ఆ నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు రణదీప్ సుర్జేవాలా, ఆర్పీఎన్ సింగ్ ఈసీని కలిసి విజ్ఞప్తిచేయడంతో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
మరోవైపు బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, పీయుష్ గోయల్‌లు తక్షణం కౌంటింగ్ ప్రారంభించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్ సిన్హా బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అహ్మద్ పటేల్ పోటీ చేశారు.