ముమ్మాటికి గెలుపు నాదే: అహ్మద్ పటేల్
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అహ్మద్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలపై ఈరోజు ఉదయం 9.30 గంటలకే అభ్యంతరం తెలిపామని ఆయన తెలిపారు. అయితే రిటర్నింగ్ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అహ్మద్ పటేల్ ఆరోపించారు.
కాగా తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికల సంఘంపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టం అవుతోందని కాంగ్రెస్ నేత అర్జున్ మోద్‌వాదియా ఆరోపించారు. వీడియో పుటేజీని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్తంగా పరిశీలించాలని కోరితే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని, దీనిపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, అంబికా సోనీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు అయ్యారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు, తాజా పరిణామాలు, భవిష్యత కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కాగా వైరల్ ఫీవర్ కారణంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ భేటీకి గైర్హాజరు అయ్యారు.
గుజరాత్ రాజ్యసభకు ఇవాళ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంపై ఆ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారని, తాము బీజేపీకి ఓటు వేసినట్లు వారిద్దరూ అమిత్ షాకు చెప్పిన వీడియో రికార్డు అయినట్లు కాంగ్రెస్ నేత శక్తికాంత్ గోహిల్ తెలిపారు.
వీడియో పుటేజీని ఇవ్వాలని కోరుతామని, ఒకవేళ వీడియో ట్యాంపరింగ్ చేస్తే అది క్రిమినల్ యాక్ట్ కిందకు వస్తుందన్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. ఇవాళ ఉదయం తమ గెలుపు ఖాయమన్న కాంగ్రెస్ ...ఇప్పుడు ఓటమి భయంతోనే ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ తదితరులు సీఈసీని కలిశారు. కౌంటింగ్ తక్షణమే ప్రారంభించాలని కోరారు.